23, డిసెంబర్ 2023, శనివారం

వ్యూహం ఫలిస్తుందా! – భండారు శ్రీనివాసరావు

 ఎవరీ పీకే

(రెండేళ్ల క్రితం ఆంధ్ర ప్రభలో ప్రచురితం)

"Larger than life, Bigger than life అని ఇంగ్లీష్ లో ఈ వాక్యాలను తెగ వాడేస్తుంటారు. వీటికి అసలు అర్ధం మారిపోయి, ఉన్న మనిషిని ఉన్నదానికన్నా పెంచి చూపించడం అనే కోణంలో ఉపయోగిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనిషిలోని గొప్పతనాన్ని మరింత పెంచి చూపించడం అంటే ఇమేజ్ బిల్డింగ్ అని అర్ధం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశంలో ఒక స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకులు అందరూ ఈ ఇమేజ్ బిల్డింగ్ తాపత్రయంలో పడిపోతున్నారు. బహుశా ఇదంతా ప్రశాంత్ కిషోర్ (పీకే) మహిమ కాబోలు.

కొన్ని వారాల క్రితం ఒక వెబ్ ఛానల్ వాళ్ళు ఈ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడమని అడిగారు. ‘ఎవరీ పీకే? ఈయన వెనక ఎవరున్నారు?’ అనేది మొదటి ప్రశ్న.

ఆయన వెనుక ‘ఆయనే’ వున్నారు’ అనేది నా జవాబు.

ఇంకొకరు వెనక ఉండడానికి ఆయన అల్లాటప్పా రకం కాదు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి లాగా ప్రశాంత్ కిషోర్ ఖాతాలో కూడా వరస విజయాలు వున్నాయి. ఒక వ్యక్తిని లేదా వ్యవస్థను అంచనా వేయడానికి ఈనాటి వాణిజ్య ప్రపంచంలో విజయాన్ని మించిన కొలమానం లేదు. ఆ విజేతలు పట్టింది బంగారం. చెప్పింది వేదం. వారి మాటకు ఎదురు చెప్పేవారు వుండరు. చెప్పరు కూడా. అది విజయంలో దాగున్న అసలు రహస్యం.

బీహార్ లోని రోహతాస్ జిల్లా కోనార్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కిషోర్ వైద్యుడైన తన తండ్రితోపాటు బక్సర్ కు వెళ్లి అక్కడే స్కూలు చదువు ముగించాడు. ఆరోగ్యరంగంలో ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో ఐక్యరాజ్యసమితిలో ఎనిమిదేళ్లు పనిచేసి భారత దేశానికి తిరిగివచ్చారు. అందరు నడిచేదారిలో కాకుండా రాజకీయ వ్యూహకర్తగా తన వృత్తిని ఎంచుకున్నారు.

మొదటి విజయానికి పునాది గుజరాత్ లో పడింది. ప్రస్తుత ప్రధాని 2012లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం ఎన్నికలను ఎదుర్కుంటున్న తరుణంలో పీకే తన వ్యూహ చాతుర్యాన్ని ప్రదర్శించి ఆయన గెలుపుకు కారణం అయ్యారు. తిరిగి రెండేళ్ల తరువాత 2014 లో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్ధిగా పోటీ చేస్తున్నప్పుడు కూడా పీకే ‘చాయ్ పె చర్చా’ వంటి వినూత్న కార్యక్రమాలతో దేశ ప్రజల దృష్టిలో నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేక స్థానం కల్పించడంలో విశేష కృషి చేశారు. ఆ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం, దరిమిలా ఆ పార్టీ జాతీయ స్థాయిలో స్థిర పడడానికి, వివిధ రాష్ట్రాలలో అధికార పీఠం ఎక్కడానికి తోడ్పడింది. రెండు ఎన్నికలలో బీజేపీతో కలిసి పనిచేసిన పీకే 2015 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించారు. అంతే! అక్కడ కూడా పీకే వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అమరేంద్ర సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. తరువాత పీకే తన సొంత రాష్ట్రం అయిన బీహార్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అక్కడా ఆయనకు ఎదురు లేకుండా పోయింది.

నన్నెవ్వరాపరీవేళా’ మాదిరిగా పీకే ప్రభలు దేశ వ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన రెడ్డి నుంచి ఆహ్వానం అందింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎదుర్కోవడం, ఎదుర్కుని గెలవడం అనేవి జగన్ మోహన రెడ్డికి చావోరేవో అనే తరుణంలో పీకే ఆయనతో జట్టు కట్టారు. అంతవరకూ సాంప్రదాయక ప్రచార పద్ధతులకు అలవాటు పడిన రాష్ట్ర రాజకీయ నాయకులకు ఈ వ్యూహకర్తల పాత్ర ఏమిటన్నది అర్ధం కాలేదు. పైగా ఈ పీకే అనే పెద్దమనిషి ఎవరో ఏమిటో కూడా చాలామందికి తెలవదు. ఎన్నికలకు ముందు జగన్ మోహన రెడ్డి ఒక బహిరంగ సభలో ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానించి, పక్కన నిలబెట్టుకుని ఇదిగో వీరే ప్రశాంత్ కిషోర్ అని పరిచయం చేసేవరకు ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీ ఎం కె విజయానికి దోహదం చేసింది కూడా పీకే వ్యూహ చాతుర్యమే. అలాగే బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ గెలుపులో కూడా పీకే హస్తం వుంది.

అల్లాంటి పీకే మళ్ళీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ఎవరీ పీకే అని ఆరాలు తీస్తున్నారు. పీకే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలుగునాట ప్రచారంలో ఉండడం ఓ కారణం.

ఒకటి మాత్రం నిజం. పీకే వల్ల అధికార పగ్గాలు చేజిక్కించుకున్నవాళ్ళు ఆ మాట ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన వల్ల పరాజయం పాలయిన వాళ్ళు మాత్రం ఏదో ఒక రోజు ఆయన సాయం తీసుకోరని అనుకోవడానికి లేదు. ఇందుకోసం క్యూలో నిలబడి వున్నా ఆశ్చర్యం లేదు.

ఎందుకంటే ఆయన పెద్ద బిజినెస్ మాన్. తను చేసిన పనికి తన ఫీజు తాను తీసుకుని కమిటెడ్ గా పనిచేస్తాడు. రిజల్ట్ చూపిస్తున్నాడు బాహుబలి రాజమౌళి లాగా. రాజకీయ పార్టీలు కూడా వ్యాపార పార్టీలే. లాభం లేదు అనుకుంటే ఒక పైసా విదల్చవు"

ముందే పేర్కొన్నట్టు ఇది రెండేళ్ల క్రితం రాసిన వ్యాసం.

అనుకున్నట్టే, ఈ ఎన్నికల వ్యూహకర్త   ప్రశాంత్ కిశోర్   ఈరోజు  విజయవాడ వెళ్లి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడిని కలిసి  మూడు గంటలకు పైగా చర్చించారని వార్తలు వచ్చాయి.

ఈ ఎన్నికల బాహుబలి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతుందా అనే విషయం తేలడానికి మరో మూడు, నాలుగు నెలలు ఆగాలి.


(ప్రశాంత్ కిశోర్) 


23-12-2023

 

5 కామెంట్‌లు:

  1. గతంలో ప్రశాంత కిషోర్ ని ఎంతగా టిడిపి విమర్శించిందో చేపవలసిన అవసరం లేదు.. ధారుణంగా బీహార్ డెకాయిట్ అంది కూడా.. ఈనాడు, జ్యోతిలు అయితే బూతులు తిట్టాయి.. ఈరోజు ఆ పత్రికలు ప్రశాంత కిషోర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి..
    ఎంతమంది pk లతో కలిసినా చంద్రబాబు సీయం కాలేడు ..

    రిప్లయితొలగించండి
  2. శీర్షిక చూసి రాం గోపాల్ వర్మ కొత్త సినిమా వ్యూహం గురించి వ్రాశారేమో అనిపించింది.

    చంద్ర సేన + పీకే .

    రిప్లయితొలగించండి
  3. బావుందండీ
    చంద్రబాబు గారు మళ్ళీ పదవిలోకి వస్తారన్న మాట అయితే.

    రిప్లయితొలగించండి
  4. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే . పంది కొక్కు అయినా గొంగళిపురుగు అయినా అవసరం అనుకుంటే కౌగిలించుకోవడమే. స్టాలిన్ గెలుస్తాడని ఎన్నికల ముందే పబ్లిక్ టాక్. జగన్ కూడా అంతే. గెలిచే జట్టు చుట్టూ తిరిగి నాణ్యమైన?? సేవలు అందించి ?? విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటారు ఇలాంటి వాళ్ళు. ఇదొక మైండ్ గేమ్ టీడీపీ తరపునుంచి ఈసారి. చరిత్ర ఎప్పుడూ ఒక వలయమే కదా.

    రిప్లయితొలగించండి