12, డిసెంబర్ 2023, మంగళవారం

మంత్రి అయినా మారని మాట తీరు

ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఈరోజు సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపాము. డాక్టర్ నాగభూషణం, డాక్టర్ భరత్, డాక్టర్ ఏపీ మనోహర్ రావు, నేను, డాక్టర్ బాలాజీ ఈ బృందంలో వున్నాము. జూపల్లి గారు రాజకీయ రంగప్రవేశం చేయక ముందు నుంచి వారితో చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వారితో కలిసి అక్కడే వర్కింగ్ లంచ్ చేసాము. అనేక పాత సంగతులు నెమరువేసుకుంటూ చాలాసేపు వారితో గడిపి తిరిగి వచ్చేసాము. బయట నుంచే తప్ప కొత్త సచివాలయం చూడడం ఇదే మొదటిసారి. కృష్ణారావు గారిని కలిసి కూడా చాలా కాలం అయింది. కానీ ఆయన  ప్రేమాభిమానాలలో ఎలాంటి తేడా లేదు.  
సచివాలయం నాకు కొత్తకాదు. నా విలేకరి జీవితంలో సింహభాగం అక్కడే గడిచింది. నాకు మరింత సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే నేను రిటైర్ అయి పద్దెనిమిది ఏళ్ళు గడిచిన తర్వాత కూడా లిఫ్ట్ బాయ్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు గుర్తు పట్టి పలకరించడం.

తోక టపా: మంత్రిగారికి పుష్పగుచ్చం ఇచ్చింది డాక్టర్ నాగభూషణం గారు. ఫోటో తీసిన కెమెరాలో పేరలాక్స్ దోషం కారణంగా కాబోలు, అది నేను ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి నేను కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి