21, అక్టోబర్ 2023, శనివారం

రోల్ మోడల్ - భండారు శ్రీనివాసరావు

 మీ రోల్ మోడల్ ఎవరు? అనే ఈ ప్రశ్న మా కుటుంబంలో ఎవర్ని అడిగినా దాదాపు ఒకే సమాధానం వస్తుంది, రావులపాటి సీతా రాం రావు అని. సీనియర్ ఐ.పి.ఎస్. అధికారిగా రిటైర్ అయ్యారు. అయితే మా వాళ్ళు ఎవరూ ఆయన్ని, ఆయన మీద వున్న గౌరవంతో పేరుతొ పిలవరు, బావా అనో, మామయ్యా అనో. బాబాయ్ అనో పిలుస్తుంటారు.  ఈ మధ్య తాతయ్యా అని కూడా అంటున్నారు. నన్నే అలా అంటున్నప్పుడు నాకంటే మూడు నాలుగేళ్లు పెద్ద అయిన ఆయన్ని అనడంలో ఆశ్చర్యం ఏముంది?

ఇటు అధికార గణంలో, అటు  పాఠకలోకంలో ఆయన పేరు చిరపరిచితం. పోలీసు ఉద్యోగంలోకి రాకముందు నుంచి కూడా ఆయనకు  రచనలు చేయడం అలవాటు. నిజానికి అది ఆయన ప్రవృత్తి. సీనియర్ ఐ.పి.ఎస్. అధికారిగా రిటైర్ అయిన తర్వాత లాఠీ పక్కన పడేసినా, కలాన్ని మాత్రం వదలకుండా పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాస్తున్నారు, ఆధ్యాత్మిక సంబంధ మైన రచనలు చేస్తున్నారు. పుస్తకాలు ప్రచురిస్తున్నారు. రాయడంతో పాటు చదవడం ఆయనలో ఉన్న మరో సుగుణం. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆయన నిరంతర అధ్యయనశీలి.  రచయితలు రాస్తారు కానీ ఇతరులవి చదవరు అనే అపప్రథ వుంది. అది అపప్రథ కాదు, నిజమే అంటాడు మిత్రుడు జ్వాలా.

ఈ ఉపోద్ఘాతానికి కారణం రావులపాటి సీతారామారావు గారు స్వయంగా రాసి, ( ఈమాట ఎందుకు అంటున్నాను అంటే ఆయన కాగితాల బొత్తి తొడపై పెట్టుకుని, కలంతో రాస్తారు, కంప్యూటర్ వాడరు)  సాహితి ప్రచురణలు ప్రచురించిన ‘పోటీ నీకే జయం నీదే’ అనే నూరు పేజీల పుస్తకం.      

ఇది నా చేతికి వచ్చి వారం, పది రోజులు దాటింది. చదవడం తొందరగానే అయిపోయింది. కానీ ఏమి రాయాలి అనేదే మీమాంసగా మిగిలిపోయింది.  ఆయన ఈ పుస్తకాన్ని నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజుల్లోనే రాసిఉంటే ఎంత బాగుండేదో అని చాలాసార్లు అనిపించింది.  పోలీసు ఆఫీసరుగా ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకున్నామే కానీ అంతకు మించి మా తరం ఏమీ చేయలేక పోయాము. దానికి కారణం, స్పూర్తి కలిగించే ఇటువంటి  పుస్తకాలు తెలుగులో అప్పుడు అందుబాటులో లేకపోవడం. ఇదే పుస్తకం ఆయన ఆ రోజుల్లో రాసిఉంటే, మేమందరం కూడా ఆయన లాగా అయివుండేవాళ్ళం అని చెప్పే ధైర్యం చేయను కానీ, జీవితంలో మరింత ఎదిగి వుండేవాళ్ళం కనీసం మానసికంగా అయినా  అని గట్టిగా  చెప్పగలను. అంత సుబోధకంగా,  సరళంగా, ఉత్తేజితంగా ఆయన ఈ పుస్తకం రాశారు. తన జీవితంలోని, తనకు తారసపడిన కొందరు ఉన్నతాధికారుల జీవితాల్లోని వాస్తవ సంఘటనలను ఆయన సోదాహరణంగా ఇందులో అక్షరబద్ధం చేశారు. తన అపజయాలు గురించి కూడా నిబద్ధతతో నిజాయితీగా రాసారు.  అవన్నీ ఈ సమీక్షలో రాయడం కంటే ఈ పుస్తకంలోని ప్రతి పేరాను  తిరిగి రాయడం సులభం అనిపించింది. అంతకంటే కూడా ఎవరికి వారు అంటే ముఖ్యంగా ఈనాటి యువతరం, మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు తమకు తాముగా చదివి తెలుసుకోవడం మంచిది అని కూడా అనిపించింది.

పోటీ పరీక్షలకు హాజరు అయ్యేవారికోసం ఈ పుస్తకంలో అనేక సలహాలు, సూచనలు వున్నాయి. ఇది చదివి ఆచరణలో పెట్టుకోగలిగితే లక్ష్య సాధన సులభం అవుతుంది. అయితే రచయితే స్వయంగా ఇందులో పేర్కొన్నట్టు, విజయం సాధించాల్సింది మాత్రం  పోటీ పరీక్షను ఎదుర్కుంటున్న అభ్యర్ధే!

ఇంతవరకు కధలు, నవలల పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు రాసిన రావులపాటి సీతారాంరావుగారు, భవిష్యత్ తరానికి మార్గ నిర్దేశనం  చేసే ఇటువంటి ఉపయుక్తమైన పుస్తకం రాయడం ముదావహం.



(పోటీ నీకే! జయం నీదే! పోటీ పరీక్షల గైడ్, రచన: శ్రీ రావులపాటి సీతారాం రావు, వెల: తొంభయ్ రూపాయలు, సాహితి ప్రచురణలు, విజయవాడ. ఫోన్: 8121098500           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి