5, మార్చి 2023, ఆదివారం

పొలిటికల్ టూరిజం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha daily today, 05-03-23, SUNDAY)


ఒక తెలుగు రాష్ట్రంలో కనుచూపు మేరలో ఎన్నికలు లేవు. మరో తెలుగు రాష్ట్రంలో ఈ ఏడాది చివరి వరకు ఎన్నికల కోయిల కూయదు. తొందరపడి కూస్తుందేమో అనే సందేహం కాబోలు, అన్ని పార్టీలకి చెందిన అనేకమంది నాయకులు ఏదో ఒక పేరు పెట్టుకుని జనం మధ్యనే గడపాలని అనుకుంటున్నారు. గడుపుతున్నారు కూడా. ‘సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నారు కీర్తిశేషులు, టీడీపీ సంస్థాపకుడు ఎన్టీఆర్. అంచేత ఓటరు దేవుళ్ల ఆశీస్సుల కోసం నాయకులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడంలో తప్పేముంది. మెడికల్ టూరిజం, రెలిజియస్ టూరిజం మాదిరిగా పొలిటికల్ టూరిజం అనుకోవాలి.
ఈ మార్పుకు కారణం ఒక్కటే, వెనుకటికీ ఇప్పటికీ రాజకీయ వ్యూహాల్లో వచ్చిన తేడానే!
కొన్ని దశాబ్దాల క్రితం విద్యార్ధులు పరీక్షల తరుణంలోనే పుస్తకాలు చేతపట్టి రాత్రీ పగలూ అనకుండా నైట్ అవుట్ చేస్తూ కష్టపడి చదివి గట్టెక్కాలని ప్రయత్నం చేసేవారు. మిగిలిన రోజుల్లో ఆటాపాటలతో కాలక్షేపం చేసేవారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి ప్రబలిన తరువాత విద్యార్ధులకు అనునిత్యం పరీక్షలే. ప్రతిక్షణం పరీక్షాకాలమే.
ఇప్పుడీ సంస్కృతి రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినట్టు వుంది. పూర్వం ఎన్నికల సమయంలో మాత్రమే కానవచ్చే హడావిడి ఇప్పుడు ఏడాది పొడుగునా కళ్ళకు కడుతోంది. నిత్యం జనాలతో అనుబంధం పెంచుకుంటూ ఆత్మ స్తుతి, పరనిందలతో పొద్దుపుచ్చుతున్నారు. ఎన్నికల ఘడియ దగ్గరలో లేకపోయినా నాయకులు కాళ్ళకు బలపాలు కట్టుకుని జనాలమధ్యనే తిరుగుతున్నారు.
అరవయ్యో దశకంలో ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘ కాలం లోకసభ సభ్యుడిగా పనిచేశారు. ఎన్నికలప్పుడు జనాలకు చూపించిన తన మొహాన్ని మళ్ళీ ఎన్నికల నగారా మోగేవరకు వరకు చూపించేవారు కాదు. అయినా వరసగా అయిదు సార్లు ప్రజలు ఆయన్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. గెలిచిన తరువాత ఢిల్లీలోనో, హైదరాబాదులోనో హాయిగా కాలక్షేపం చేసేవారు కాని నియోజకవర్గం వైపు తొంగి చూసేవారు కాదు. అయినా ఆ రోజుల్లో అలా నడిచిపోయింది.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి కొంత మారింది. జనాల్లో తిరగకుండా జనాలమీద పెత్తనం చేయడం కష్టం అన్న ఎరుక రాజకీయ నాయకుల్లో మొదలయింది. అయితే ఎన్టీఆర్ తరహా కూడా అదో మాదిరి. ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు, కనీసం ఏసీ సౌకర్యం కూడా లేని చైతన్య రధం మీద బయలుదేరి, ఎండావానల్ని లెక్కచేయకుండా, ఆకలిదప్పులు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని చుట్టబెడుతూ, రాత్రింబగళ్ళు ప్రజల మధ్యనే తిరిగేవారు. ఆ ఎండలకు అంతటి అందగాడి మొహం కూడా నల్లకప్పు వేసిపోయేది. ఒక్కసారి విజయం సాధించి, అధికార పీఠం ఎక్కడం తరువాయి, అంతే! ఎంతో ముఖ్యమైన రాచకార్యం వుంటే తప్ప రాజధానిని ఒదిలిపెట్టి అడుగు బయట పెట్టేవారు కాదు. జిల్లాల పర్యటనలు ఎక్కువగా పెట్టుకునేవారు కాదు. చంద్రబాబునాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన గురించిన కబురు చెవిలో పడడం ఆలస్యం, కాళ్ళకు రెక్కలు కట్టుకుని గాల్లో ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళేవారు. కొన్ని సందర్బాలలో స్థానిక అధికారుల కంటే ముందే అక్కడ వాలిపోవడం, లేదా ముఖ్యమంత్రి హైదరాబాదు నుంచి ఆ విషయం గురించి వారిని వాకబు చేయడం ఇలాటివన్నీ ఆ రోజుల్లో తమాషాగా చెప్పుకునేవారు. కొండొకచో సంచలనాత్మకంగా, కొండొకచో విమర్శనాత్మకంగా ఉండేవి అవి.
దరిమిలా ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డిది కూడా ఓ రకంగా ఇదే తరహా. పర్యటనల్లో వున్నా, రాజధానిలో వున్నా జనం మధ్య గడపడానికే ఆసక్తి చూపేవారు. ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారడానికి ఆయన చాలా కాలం పాటు చేసిన నిరీక్షణ ఫలించడానికి కారణం ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రే అనడంలో సందేహం లేదు. తదాదిగా అధికారం చేజిక్కించుకోవాలంటే పాదయాత్రలు చక్కని రాజమార్గం అన్న నమ్మకం రాజకీయ నాయకుల్లో కుదిరిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర అనంతరమే తొమ్మిదేళ్ళ పైచిలుకు సాగిన ప్రతిపక్ష అజ్ఞాత వాసం నుంచి బయట పడి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారు.
ఇక సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా జనం మీదనే ఆధారపడ్డారు. జనం అండ ఉంటుందనే నమ్మకంతో రాజకీయ ఎత్తుగడల్లో చూపించాల్సిన పట్టు విడుపుల్ని ప్రదర్శించకుండా ఓ మేరకు నష్టపోయారని కూడా ఆయన్ని గురించి చెప్పుకుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా ఆయనది అదే తీరు. తన సొంత పార్టీ నాయకులతో కంటే జనాల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతారనే పేరు ఆయన ఖాతాలో వుంది కూడా.
పొతే, రాజకీయ నాయకుల పాదయాత్రలు, రిలే పాదయాత్రలు, కిసాన్ యాత్రలు, రైతు భరోసా యాత్రలు, బస్సు యాత్రలు ఇంకా ఇలాటి అనేకానేక యాత్రలు, పర్యటనలు, ప్రదర్శనలు, ర్యాలీలు ప్రజలకు చేసే మేలు ఏమిటోకాని ఆయా పార్టీలకు మాత్రం పెద్ద మేళ్ళే చేస్తున్నాయని వాటి గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే ఎన్ని ఇబ్బందులు వున్నా, కష్టాలు వున్నా, బాగా డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా నాయకులు వెనుకడుగు వేయకుండా పాదయాత్రలతో ముందడుగు వేస్తున్నారు.
సరే! 'యాత్రాఫల సిద్ధిరస్తు' అని జనం వారిని ఆశీర్వదిస్తారో లేదో తెలియడానికి ఇంకా చాలా వ్యవధానం వుంది.
'ప్రజలు గమనిస్తున్నారు సుమా!' అని ఎదుటివారికి హెచ్చరికలు చేసే నాయకులు, తమను కూడా అవే జనాలు గమనిస్తున్నారని మరచిపోవడం రాజకీయ నాయకుల ఉమ్మడి లక్షణం. సామాన్య రైతుల కడగండ్లు తీర్చడం ఒక్కటే తమ ప్రధమ ప్రాధాన్యత అని జబ్బలు చరుచుకుంటూ, అసలా కష్టాలకన్నింటికీ ఆవలి పక్షం వారే కారణం అంటూ ఆరోపిస్తూ, అధికారంలో వున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తూ, అధికారం చేజారగానే అంతవరకూ ప్రతిపక్షాలు ఆలపిస్తూ వచ్చిన పాత పల్లవినే ఎత్తుకుంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకునేందుకు ఇలాటి యాత్రా వేదికలు ఉపయోగపడడం నిజంగా దారుణం అనిపిస్తుంది.
సమాజంలో వివిధ వర్గాల వారికి ఎన్నెన్ని సమస్యలు ఉన్నప్పటికీ, రైతు సమస్యలు మాత్రం ఒకే రకంగా వుంటాయి.
వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతోంది. వాళ్ళు విడిగా అయినా కలివిడిగా అయినా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఇంతవరకు ఏం చేసాము, ఏం చేయలేదు అన్నది కాదు ప్రశ్న. ఎవరి హయాములో ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది కాదు సమస్య. వందలు, వేలూ కాదు ఇకనుంచి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వ్యవసాయంలో నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకోకుండా ఏం చెయ్యాలి అన్నదే ప్రధానం అన్న ధోరణిలో ఆలోచించాలి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవేవీ జనాలకు అన్నం పెట్టే రైతుకు కూడు పెట్టవు.
ఒకటి మాత్రం నిర్వివాదాంశం. ఇన్నాళ్ళ అనుభవం తెలియచెప్పేది ఒక్కటే. ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేంతవరకు రైతు జపం చేస్తాయి. ఒక్కసారి గద్దె ఎక్కగానే, దుష్యంతుడికి శకుంతల మరపున పడ్డట్టు రైతులనే వాళ్ళు వారికి చివరి ప్రాధాన్యతగా మిగులుతారు. అప్పటివరకు రైతులు, రుణాలు, గిట్టుబాటు ధరలంటూ మాట్లాడిన వాళ్ళు, అవే నాలుకలతో కార్పొరేట్లు, ఉద్యోగాలు, భూసేకరణలు, భూ పందారాలు, మిషన్లు, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లు, దావోస్ విజిట్లు, గ్రోత్ కారిడార్లు అంటూ సామాన్యులకు అర్ధం కాని పద ప్రయోగాలు చేస్తుంటారు. ఏం సాధించారు అంటే లెక్కకు కొన్ని లెక్కలు చెబుతుంటారు. కానీ పెట్టిన ఖర్చుకు వచ్చిన ఫలితాలకు పొంతన వుండదు. ఈ విషయంలో ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారంలో వుండడం, అధికారంలో లేకపోవడం అన్న రెండు విషయాలే ఈ రెండు నాలుకల ధోరణికి కారణం. దీన్ని అర్ధం చేసుకోవడానికి చరిత్రలోని కొన్ని తాజా పుటలు తిరగేస్తే చాలు.
ఆరుగాలం కష్టపడే రైతుకు, జనాలకు మొదటి ముద్ద పెట్టి, తాను చివరి ముద్ద తినే రైతుకు కావాల్సినవి ప్రభుత్వాలు సకాలంలో ఇస్తే, అంతకు రెట్టింపు ప్రతిఫలం రైతు ఈ సమాజానికి అందిస్తాడు. అతడికి అవసరమైంది తాను దున్నేమన్నుకు, పదును చెడకముందే అదునులో దున్ని పైరు వేసుకోవడానికి వీలుగా సకాలంలో మంచి విత్తనాలు, ఎరువులు. సేద్యపు నీరు, పంట చేతికి వచ్చిన తరువాత కాసింత గిట్టుబాటు ధర. ఇంతకు మించి ఏ రైతూ ఆశించడు. రైతు పండించిన ధాన్యంలో ఆఖరి గింజ అతడి చేతిలోంచి మార్కెట్ లోకి వెళ్ళే వరకు స్తబ్దుగా, మన్ను తిన్న పాములా పెరగకుండా వుండిపోయే ధాన్యం ధరలు, ఆ తర్వాత ఒక్క మారుగా చుక్కల్ని తాకడం అనేది రైతులు ఎదుర్కునే సమస్యల్లో అతి ప్రధానమైనది. ప్రభుత్వాలు ఈ ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన కలిగితే, ధర్మో రక్షిత రక్షితః అన్నట్టు ఆ రైతే దేశానికి బాసటగా నిలబడతాడు. సకాలంలో ఇటువంటి సాయం అందితే ఏ రైతూ ఆత్మహత్య ఆలోచన చేయడు. నిస్సహాయ పరిస్తితిలోనే రైతులు నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. అలాటి కుటుంబాలను ఓదార్చడం, ఆదుకోవడం తప్పుకాదు. కానీ అసలు రైతులు ఈ స్థితిలోకి జారిపోకుండా ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయన్నదే సమాధానం లేని ప్రశ్న.
సరే! ఇక యాత్రల విషయానికి వస్తే.
ఏదైనా పుణ్యక్షేత్రానికి యాత్రకి వెళ్ళినప్పుడో, లేదా ఏదైనా పర్యాటక ప్రదేశానికి యాత్రకు వెళ్ళినప్పుడో ఏం చేస్తాం. ఉన్న వ్యవధిలో అక్కడి విశేషాలు పరిశీలిస్తాం. యాత్రలో ఎదురయ్యే ఇబ్బందులు, అనుకూలతలు గమనిస్తాం. అలాగే రాజకీయ యాత్రలు చేసేవాళ్ళు కూడా తాము తిరిగిన ప్రదేశాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కుంటున్న దినవారీ సమస్యలు తమ కంటితో గమనించి వాటికి పరిష్కార మార్గాలు ఆలోచించగలిగితే అంతకు మించిన మంచి మేనిఫెస్టో వారికి మరెక్కడా దొరకదు. యాత్రా ఫలం సిద్ధించడం అంటే ఇదే!



(05-02-2023, SUNDAY)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి