12, మార్చి 2023, ఆదివారం

జారుడు మెట్లు – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 12-03-2023, SUNDAY today)


ఏదైనా ప్రధాన పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మరో పార్టీలోకి జారిపోతే ఆ సందర్భాన్ని, 'పార్టీ మార్పిళ్ళకు పరాకాష్ట’  అని గిట్టని పార్టీల వాళ్లు వ్యాఖ్యానిస్తుంటారు. ఇదేదో కొత్త విషయం అయితే ఆశ్చర్య పడాలి. ఈ చేరికలకు, చీలికలకు ఇది మొదలూ కాదు, చివరా కాదు. అందుకే విమర్శించేవారు మరో సందర్భంలో సమర్ధించడానికి సిద్ధంగా ఉండడానికి సిద్ధపడి వుండాలి. సమర్ధించేవారు ఇంకో సందర్భంలో విమర్శించడానికి సంసిద్ధంగా వుండడం కూడా అంతే  అవసరం.  ఎందుకంటే ఈ పార్టీ మార్పిళ్ళు అనేవి అన్ని పార్టీలకి తప్పనిసరి అవసరం కాబట్టి.  ఎవరూ దీనికి అతీతులు కాదు కాబట్టి. మరో 'మార్పిడి' జరిగేవరకు పాత దానిపై దుమారం సాగిపోతుంది, ఆ  తరువాత అది పాత పడిపోతుంది. కొత్తది తెర మీదికి వస్తుంది. చర్చ మళ్ళీ మొదలవుతుంది. లేదా బయటకు వెళ్ళిన వాళ్ళే ఇదో విష చక్ర భ్రమణం.       

'నిలకడగా  నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా స్వచ్చంగా కనబడుతుంది'   

పార్టీ మార్పిడులను సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. మరి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా తీసుకోవాలేమో.  

పార్టీలు ఏర్పడినప్పుడే మార్పిళ్ళ సంస్కృతికి కూడా బీజాలు పడ్డాయంటారు. పార్టీలు వుంటేనే కదా మార్పిళ్ళు జరిగేది. అందుకే రాజకీయుల అవసరాలకు తగ్గట్టు పార్టీలు కూడా పుట్టుకొస్తుంటాయి.

1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశంలో అందరి నోళ్ళలో నానుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల పుణ్యమా అని అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. కొన్ని కాలపరీక్షకు తట్టుకున్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటూ తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి.

2014 జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విడిపోయింది. విడిపోవడానికి కొద్దికాలం  ముందు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు తెలంగాణాలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రాల చీలిక దరిమిలా తొలినాళ్లలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టవచ్చినట్టుగా కనిపించిన మార్పు ఒక్కటే ఒక్కటి,  పార్టీ మార్పిళ్ళు. రెండు రాష్ట్రాలమధ్య సహజంగా పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు అలాగే వుండిపోతే, కొత్తగా తెరమీదకు వచ్చిన ఈ పార్టీ మార్పిళ్ళ వ్యవహారం అన్ని సమస్యలను కారుమబ్బులా కమ్మేసి, అనేక అనైతిక, అవాంఛనీయ, అప్రజాస్వామిక పరిణామాలకు దారి తీయడమే కాకుండా వివాదాలు ముదిరి పాకానపడి చివరికి కేసులు, కోర్టుల వరకు వెళ్ళింది. దీనికి ముగింపు ఎప్పుడన్నది కాలమే చెప్పాలి.

పోతే, ఇన్ని సమస్యలకు మూలకారణంగా పేర్కొంటున్న పార్టీ మార్పిళ్ళు ముందే చెప్పినట్టు పార్టీలు పుట్టినప్పుడే పురుడు పోసుకున్నాయి. అసలు కొత్త పార్టీలు పుట్టుకు రావడానికి ప్రధాన కారణం పార్టీల్లో పుట్టుకొచ్చే  రాజకీయ అసంతృప్తులే అనే వాదం వుంది.     

సాధారణంగా  ప్రతిపక్షంలో వున్నవాళ్ళు, పాలకపక్షం వైపు చూడడం సహజం. కానీ,పాలక పక్షం నుంచి ప్రతిపక్షం వైపు దూకే సాంప్రదాయానికి ఎప్పుడో రామాయణ కాలంలోనే విభీషణుడు విత్తు నాటాడు. తటస్థులను తమవైపు తిప్పుకోవడం మహాభారతంలో కానవస్తుంది.      

స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ఏకపక్షంగా సాగిన వ్యవహారం ఏమీ కాదు. స్వతంత్రం తెచ్చిన ఖ్యాతి, తొలి ఎన్నికల్లో అ పార్టీకి బాగా ఉపయోగపడిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఇప్పటితో పోలిస్తే అప్పుడున్న పార్టీల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. జనత పార్టీ, స్వతంత్ర పార్టీ, జనసంఘం పేర్లు  ఈనాడు కొందరికి తెలిసి  వుండవచ్చునేమో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో సోషలిష్టు పార్టీ, ప్రజా సోషలిష్టు పార్టీ,  నేషనలిష్టు డెమొక్రాటిక్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కే.ఎల్.పీ, ఎన్.సీ.ఎఫ్,  జస్టిస్ పార్టీ,  ప్రజాపార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఇలా అనేక పార్టీలు వుండేవి. కమ్యూనిస్ట్ పార్టీ (అప్పటికి ఒక్కటే) సరేసరి. 

కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీల్లో కొన్ని పార్టీల పేర్లు చూడగానే, 'తల్లి పార్టీ ఏమిటి? అందునుంచి  వేరుపడి ఏర్పడ్డ కొత్త పార్టీ ఏమిటి?' అన్న విషయం సులభంగానే బోధపడుతుంది.  (ఉదాహరణకు కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్, జనతా, జనతా దళ్ వగైరా)

విచిత్రం ఏమిటంటే పార్టీ మార్పిళ్ళకు కూడా ముహూర్త బలం వుండాలి అనే వాదన ఒకటి వుంది.      

గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు. 

పార్టీ మార్పిడి కూడా లాటరీ వంటిదే. కొందరికి లాభం. కొందరికి ఖేదం, అని ఈ రకం వాదితులు చెబుతుంటారు.

పార్టీ మారిన వెంటనే చేరిన పార్టీలో తారాజువ్వలా పైకి దూసుకు పోయిన సందర్భాలు వున్నాయి. పార్టీ మారి పుష్కరాలు గడిచినా వేసిన గొంగడి చందంగా చతికిలపడి పోయిన ఉదాహరణలు వున్నాయి. పేర్లు చెప్పుకుంటూ పొతే జాబితా కొండవీటి చేంతాడు అంత అవుతుంది.

పార్టీ మార్పిళ్లలో అర్ధం కానిది ఒకటే.   

రాజకీయుల్లో ఎవరిని కదిలించినా గెలుపు తధ్యం అంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే మనసా, వాచా, కర్మణా సిద్ధమైపోయారని చెబుతారు. ఇంతాచేసి, తమమీద తమకే నమ్మకం లేనట్టు చొక్కాలు మార్చినట్టు  పార్టీలు మారుతుంటారు.

వాళ్ళ వేగం, ఉరవడి  చూస్తుంటే, ఏవిటో అంతా వరదలో కొట్టుకుపోతున్నట్టుగా అయోమయంగా  వుంటుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.

అన్నమైతే ఏమిరా! సున్నమైతే ఏమిరా!

అయినా ఈ పాడు పొట్టకు అన్నమే వేద్దామురా!  అని ఏదో పాత సినిమాలో ఓ గీతం వుంది. 

పార్టీ మారే వారిది కూడా ఇదే బాణీ.

ఆ పార్టీ అయితేనేం ఈ పార్టీ అయితేనేం

పనులు జరిగే అధికార పార్టీయే మేలు కదా! అనేది వాళ్ళ థియరీ.

మరి చేరిన పార్టీ రానున్న ఎన్నికల్లో ఓడిపోతే ఎలా! అన్న సందేహానికి వారి వద్ద ప్రశ్న రూపంలోనే  సమాధానం సిద్ధంగా వుంటుంది.

“తలుపు తీసుకుని  బయటకు వెళ్ళిన వాళ్లకు, లోపలకు వచ్చే దారి తెలియదని ఎలా అనుకుంటున్నారు?”    


షిర్డీ పుణ్య క్షేత్రానికి దగ్గరలో,  శని సింగాపూర్ లోని శనీశ్వర ఆలయం గురించి ఒక వింత విషయం ప్రచారంలో వుంది. ఆ ఆలయానికి కిలో మీటరు పరిధిలో దుకాణాలకు, ఇళ్లకు తలుపులు వుండవని, తాళాలు వేయరని ఆ క్షేత్ర పురాణం చెబుతుంది. పోలిక సమంజసం అనిపించక పోవచ్చు కానీ, రాజకీయ పార్టీల కార్యాలయాలకు కూడా తలుపులు, ద్వారబంధాలు వున్నట్టు లేవు. చేరదలచిన వాళ్ళు స్వేచ్ఛగా చేరవచ్చు. వదిలి పెట్టాలి అనుకున్నవాళ్ళు అలాగే బయటకు వెళ్లిపోవచ్చు. చేరడాలు, వదలడాలు రెంటినీ ఒక్క ట్వీట్ తో జనాలకు తెలియచేయవచ్చు. 

మనదేశానికి స్వతంత్రం రాగానే మనం స్వచ్చందంగా ఎంచుకున్న  ప్రజాతంత్ర స్పూర్తికి ఈ పోకడలు విఘాతం కలిగిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపధ్యంలో పరిశీలిస్తే, రాజ్యాంగపరంగా ఈ రుగ్మతకు సరైన చికిత్స చేయకుండా మనం నిర్మించుకుంటున్న  ప్రజాస్వామ్య సౌధం ఎలాంటి ప్రకంపనలకు తట్టుకోలేని బలహీన కట్టడం మాత్రమే  అవుతుంది. 

 

ముక్తాయింపు : 

ఎన్నికలకు  ముందు ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడే మాట:

"ఈరోజు ప్లస్సెంత ? (చేరినవారెందరు) మైనస్ యెంత? (జారినవారెందరు)"




(12-03-2023)

2 కామెంట్‌లు:

  1. ఇదివరకు కొందరు స్కూలు పరీక్షలలో సమాధానాలు పేజీలకు పేజీలు నింపేవారు. మీ వ్యాసాలు ఆ ధోరణి లో ఉంటాయి. అసలు విషయం గోరంత. ఊకదంపుడు వ్యాసం కొండంత.

    రిప్లయితొలగించండి
  2. బాగా చెప్పారు అజ్ఞాత గారు నా రాతలకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు కానీ కొన్ని ఇంగ్లీష్ పత్రికలు రాసిన పదాల సంఖ్యని బట్టి రచయితలకు పారితోషికం ఇస్తారని విన్నాను.

    రిప్లయితొలగించండి