28, డిసెంబర్ 2022, బుధవారం

అమ్మలాంటి కోడలు – భండారు శ్రీనివాసరావు

 కొన్ని విషయాలు చెప్పుకుంటే సంగతులు. కొన్నేళ్ళ తర్వాత అవే జ్ఞాపకాలు.

అలాంటిదే ఇది.

“శ్రీ ఆంజనేయం....”
‘............”
‘శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. చెప్పండి అత్తయ్యా! మిమ్మల్నే’
‘............’
‘మీరు దండకం చెప్పకపోతే నేను ఫోన్ చేసి మీ తమ్ముడి గారితో మీ చేత మాట్లాడించను. మరి చెప్పండి! శ్రీ ఆంజనేయం! ప్రసన్నాంజనేయం!..’
‘....ప్రభాదివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్య మిత్రం భజే రుద్రతేజం భజే బ్రహ్మ తేజం బటంచున్ ....’
అందుకున్న ఆమె గొంతునుంచి ఆంజనేయ దండకం తుదివరకు సాగిపోయింది.
ఆ స్వరం పీలగా, సన్నగా, ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్టు వున్నా ఉచ్ఛారణ లోపం లేకుండా, ఎనిమిది పదుల ఆ వృద్ధురాలు ఎక్కడా తడబడకుండా ఏ పదం మరచిపోకుండా ఆలపిస్తుంటే చూడడానికి ఆ దృశ్యం కమనీయంగాను వుంది. దయనీయంగాను వుంది.
వృద్ధాప్యం పైనపడి ఎక్కడ మతిమరపుకు లోనవుతారో అని ఉదయం సాయంత్రం ఆమె కోడలు దగ్గర వుండి ఆమె చేత చేయిస్తున్న అసాధారణ ధారణ కసరత్తు ఇది.
ఒకప్పుడు ఒంటి చేత్తో పదిమందివున్న సంసారాన్ని సరిదిద్దిన ఆ వృద్ధ మాత తుర్లపాటి భారతి. ఒక పక్కన కార్పొరేట్ ఉద్యోగాన్ని వర్క్ ఫ్రం హోం చేస్తూనే, మరో పక్క వృద్ధురాలు, ఆశక్తురాలు అయిన అత్తగారిని లాలించి, అవసరమయితే డబాయించి ఆమె చేత దండకాలు, లలితా సహస్రనామాలు వల్లె వేయిస్తున్న మహిళ ఆవిడ కోడలు స్వర్ణ.
దండకం చెప్పకపోతే మీ తమ్ముడితో ఫోనులో మాట్లాడించేదిలేదంటూ ఆ కోడలు బెదిరించిన ఆ తమ్ముడిని నేను.
కొన్నేళ్ళ క్రితం ఒక నాటి సాయంత్రం నా కొడుకూ, కోడలు నన్ను వెంటబెట్టుకుని సికింద్రాబాదులోని మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కానవచ్చిన ఈ దృశ్యం కమనీయంగా ఉన్నట్టా! దయనీయంగా ఉన్నట్టా!
హాట్సాఫ్ స్వర్ణా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి