గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో కె. విశ్వనాధ్ గారి అపూర్వ సృష్టి శంకరాభరణం సినిమాను ఇండియన్ క్లాసికల్ గా ఎంపిక చేయడం తెలుగు సినిమా రంగానికి గర్వ కారణం. ఈ వార్త టీవీ ఛానల్స్ లో ప్రసారం అవుతున్నప్పుడు ఎప్పటివో నలభయ్ ఏళ్ళకు పూర్వం సంగతులు గుర్తుకు వచ్చాయి.
1980వ సంవత్సరంలో ఒక రోజు.
మా పెద్దన్నయ్య కీర్తిశేషులు
పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా
టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్
నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు
ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్ వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి
లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు)
సినిమా మొదలయింది. హాలు హాలంతా
నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు
ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, కధానాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో
ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను
గొణుక్కుంటున్నట్టు.
ఆశ్చర్యంగా రెండోవారం నుంచే మంచి
టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.
కొన్నిరోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ
వేశారు. ప్రీ వ్యూ (PRE VIEW) కాదు, ఫ్రీ వ్యూ (FREE VIEW).
నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు
వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ
షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే
కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో
పడడానికి ఆయన గారికి కొంత వ్యవధి పట్టింది. అంతా
లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.
ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు
తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!
కట్ చేస్తే.....
మళ్ళీ 2017లో...
‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకా రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ
కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ గారు మాత్రమే. వరస
సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని రోజుల్ని
గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.
శంకరాభరణం గురించి కూడా చెప్పారు.
“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు
చూడడానికి అందులో ఏముందని అడిగాను. ‘ఏమోసారూ, ఆ
సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు.
జన్మధన్యం అవడం అంటే ఇదే కాబోలు”
చాలామంది చాలా మాట్లాడారు. మాజీ
ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.
సీన్ కట్ చేసి కొంత వెనక్కి వెడితే....
1987- 92 మధ్య రేడియో మాస్కోలో పనిచేసిన కాలం
నాటి జ్ఞాపకం. ఊలిచ్చవావిలోవాలోని మాస్కో రేడియో భవనంలో నివాసం వుండేవాళ్ళం. మా
ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. టికెట్స్ దొరకడం చాలా కష్టం.
దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో
రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో
తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం
లభించింది.
సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక
సినిమా హాలు కనబడింది. కాలక్షేపం కోసం టిక్కెట్స్ కొనుక్కుని లోపలకు
వెళ్లి చూద్దుము కదా, అది మన శంకరాభరణం సినిమా.
పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన
బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ
శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే
చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా
చూస్తే తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమాలో నటించిన నటీనటుల గాత్రానికి తగిన
స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల, సోమయాజులు
గారే కాకుండా, ఆ సినిమాలో నటించిన తదితర నటీనటులు
అచ్చు రష్యన్ భాషలో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.
సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో
వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు
ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను. ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు
అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.
(21-11-2022)
"ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు"...
రిప్లయితొలగించండిఅప్పట్లో ఆ కుర్రాడు ఇప్పట్లో ప్రసిద్ధ సినీ రచయిత జనార్ధన్ మహర్షిగారు
మహర్షి సంగతేమో గానీ సారూ, ఒకసారి విశ్వనాథ్ గారు ఇదే వాక్యాన్ని ఒక టాక్సీ డ్రైవర్ అన్నట్లుగా చెప్పారని ఎక్కడో చదివినట్లు జ్ఞాపకం.
రిప్లయితొలగించండిVetagaDu ceppimde history …
రిప్లయితొలగించండి