(Published in Andhra Prabha today Sunday, 27-11-2022)
‘ఎందుకు అంకుల్ బ్యాంకు దాకా రావడం, ఇంట్లోనే కూర్చుని నెట్లో ట్రాన్సాక్షన్స్ చేసుకునే వీలుందిగా’ అన్నదా అమ్మాయి ఓచరుపై సంతకం చేయడానికి పెన్ను అడిగినప్పుడు. నిజమే. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా అన్ని పనులు చేసుకునే సదుపాయాలు వున్నాయి. అయితే బ్యాంకుకు వస్తే నాలుగు మొఖాలు కనబడతాయి. ఏమండీ ఎలా ఉన్నారని పలకరిస్తారు ఎవరో ఒకరు. ఈ బ్యాంకుతో నలభయ్ ఏళ్ళ అనుబంధం. ప్రమోషన్లు కాదనుకుని ఉండిపోయిన బ్యాంకు ఉద్యోగులు ఎంతో మంది గుర్తు పడతారు. అయితే కాలం తెచ్చే మార్పులు వింతగా వుంటాయి. నా కళ్ళ ముందే ఆ బ్యాంకు బ్రాంచి ఎన్నో హంగులు సమకూర్చుకుంది. కార్పొరేట్ ఆఫీసును తలదన్నేలా తయారయింది. కార్యకలాపాలు కూడా పెరిగాయి. అందుకు తగ్గట్టు ఉద్యోగులూ పెరిగారు. కంప్యూటర్ తెర వైపే చూస్తూ పనులు చేసుకుంటున్నారు. వచ్చిన కష్టమర్ మొఖాలను కూడా గుర్తు పట్టే పరిస్తితి లేదు. నన్ను ఏళ్ళ తరబడి చూస్తున్న వాళ్ళు మాత్రం పలకరింపుగా నవ్వుతారు. కాస్త వీలు చిక్కితే వారితో మాట కలుపుతాను. అయితే అది కూడా ఈ మధ్య తక్కువే. కాస్త విరామం దొరికినా వాళ్ళు కష్టమర్ల మొహం చూడ్డం లేదు. సెల్ ఫోను కబుర్లే సరిపోతున్నాయి.
‘ఎందుకు బాబాయ్ హైరానా పడుతూ దుకాణాలకు వెళ్లి సరుకులు కొంటావ్? సెల్లో ఆర్డరు చేస్తే వాళ్ళే మీ ఇంటికి తెచ్చి పడేస్తారు’ అంటాడు మా పక్క పోర్షన్ అబ్బాయి. అది నిజమే కానీ ఈ వయస్సులో మరి కాలక్షేపం ఎలా! కాలం దొర్లించాలంటే ఇలా ఏదో ఒక వ్యాపకం వుండాలి కదా! షాపు అతనికి నా అభిరుచులు తెలుసు. నా ఇష్టా ఇష్టాలు తెలుసు. సారుకు పలానా బ్రాండు కారం ఇవ్వాలిరా. మరచిపోకు అంటాడు తన పనబ్బాయితో. చేసేది వ్యాపారం అయినా ఎక్కడో సుతారంగా మనసుకు తాకుతాయి అతడి మాటలు. మొన్నీ మధ్య వెడితే ఆ షాపు కూల్చేశారు. దగ్గర్లో వున్న మాల్ కే వెళ్లాలి. అంతా కలయ తిరుగుతూ, ట్రాలీ తోసుకుంటూ, దాన్ని నింపుకుంటూ, అవసరం లేని వాటిని కూడా కనబడ్డాయని కొనుక్కుంటూ ....అలా అలా కాలం దొర్లించడమే. మనుషులు కనబడుతూనే వుంటారు, మాటలకే కరువు.
ఒక్క ఫోన్ కొడితే అన్నీ ఇంటికే వచ్చి పడుతున్నాయి. వెనకటి బేరసారాలు లేవు. ఎందుకో యాంత్రికం అనిపిస్తుంది. అలా మార్కెట్టుకు వెళ్లి బెండకాయలు లేతవా కావా అని చివర్లు విరుస్తూ, దోసకాయలు వగరువో కాదో ఒకటికి పదిసార్లు పరీక్షగా చూస్తూ, మరీ అంత మండిపోయే రేటేమిటి, కాస్త తగ్గించరాదయ్యా బాబూ అని చనువు తీసుకుని మాట్లాడడం, సర్లెండి మీకు ఎప్పుడూ ఇచ్చే ధరే ఇది, కాదంటే ఇంటికి వెళ్లి అమ్మగార్ని అడగండి అంటూ అంతకంటే చనువుగా మాట్లాడుతూ కూరలు తను అనుకున్న రేటుకే అమ్మడం, పోనీలీ తెలిసిన మొహం అని మనసుకు సర్దిచెప్పుకుని ఇంటి మొహం పట్టడం. ... అదో వ్యాపకం, అదో కాలక్షేపం, నిజం చెప్పాలి అంటే మనం ఇంకా మనుషుల లోకంలోనే ఉన్నాము అని మనకు మనం సర్ది చెప్పుకోవడం.
యాభయ్ ఏళ్ళ క్రితం ఆ మనుషులే. ఇప్పుడూ ఆ మనుషులే. తేడా ఎక్కడ వస్తోంది.
ఒకానొక కాలంలో ఊళ్ళో ఆడవాళ్ళు అలా భుజాన బిందెలు పెట్టుకుని మంచి నీళ్ళ బావి నుంచి నీళ్ళు పట్టుకుని వచ్చేవారు. ఇంట్లో మొదటిసారి నీళ్ళ పంపు పెట్టించినప్పుడు, అమ్మయ్య నీళ్ళ మోత బాధ తప్పిందని అనుకున్న వాళ్లకు, కాలం గడుస్తున్న కొద్దీ తాము కోల్పోయింది ఏమిటో తెలిసివచ్చింది. ఊరిబావి నీళ్ళు పట్టుకుని వచ్చేటప్పుడు నూతి దగ్గర అమ్మలక్కలు మంచీ చెడూ మాట్లాడుకునే వారు. కష్టం సుఖం ఒకరితో మరొకరు పంచుకునే వారు. నీళ్ళు మోసిన కష్టం దానితో ఆవిరి అయిపోయేది.
అలాగే పిల్లల్ని బడికి తీసుకువెళ్ళే రిక్షా అంకుల్, ఇంటి దగ్గరి గుడికి వెడితే మనం చెప్పకముందే మన పేరూ గోత్రం తానే చెప్పేసి స్వామి వార్లకు అర్చన చేయించే పూజారి, ఇలాంటి వాళ్ళు ఒకరా ఇద్దరా. ఇందిరతో పెంచుకున్న బంధాలు, అనుబంధాలకు కళ్ళముందే కట్లు తెగిపోతుంటే..
పోస్టు అనే పదం అటు పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ఒకరోజుల్లో అమృతతుల్యమైన పదం. పోస్ట్ మన్ బయట నుంచి పోస్ట్ అని కేక వేయగానే ఎవరో ఆపద్బాంధవుడు వచ్చినంత సంబరపడి పోయేవారు ఇంటిల్లిపాదీ. దూరాన ఉన్న కొడుకు ఉత్తరం రాశాడేమో అని గృహస్తు, మొగుడి నుంచి ఉత్తరం వచ్చిందేమో అని పుట్టింట్లో ఉన్న గర్భిణి, ఇలా ఎవరికి వారు ఆత్రంగా బయటకి వచ్చేవారు. తాము అనుకున్నది కాదు అని తెలియగానే నిరాశగా నిట్టూరుస్తూ లోపలకి పోయేవారు. ఇప్పుడేముంది? ఇలా ఫోన్ నొక్కగానే అమెరికాలో వున్న పిల్లలు కో అని పలుకుతున్నారు. కానీ ఆనాటి మధురిమ ఏదీ! ఆ ఎదురు చూపులు ఏవీ!
ఒకప్పుడు ఇంట్లో లాండ్ ఫోన్ మోగితే నేనంటే నేను ముందు అనుకుంటూ ఇంట్లో వాళ్ళు అందరూ ఫోన్ వద్దకు పరిగెత్తుకుని వెళ్ళే వాళ్ళు. ఒకప్పుడు అందరికీ ప్రియమైన ఫోన్ దిక్కు లేనిదానిలా ఇప్పుడు ఇంట్లో ఓ మూల పడివుంటోంది. మూగనోము నోచుకుంటోంది. పొరబాటున మోగినా దానిని పట్టించుకునే నాధుడు వుండడు ఇంట్లో. ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు తలదించుకుని కాలక్షేపం చేస్తూ వుంటారు.
అతకవు. అతిగా ఆశ పడకండి.
రిప్లయితొలగించండితిరిగి అతకనంతగా భ్రష్టు పట్టిపోయింది సమాజం.
ఇంత నైరాశ్యమేమిటి బ్రదర్స్?
తొలగించండికాలానుగుణంగా వచ్చే మార్పులను అంగీకరించక తప్పదు. చిత్రం ఏమిటంటే ఇప్పుడు ఉన్న సౌకర్యాలు వదులుకోలేము. అమెరికాలో ఉన్నవారితో చక్కగా చూస్తూ మాట్లాడే వెసులుబాటు ఉంది. వాట్స్ అప్ లో బంధు మిత్రులను పలకరించు కునే సౌలభ్యం ఉంది. పోస్ట్ మాన్, లాండ్ లైన్, ఉత్తరాలు etc. జ్ఞాపకాలుగా ఉంటాయి. అయితే ఆనాటి బాంధవ్యాలు, అనుబంధాలు, ప్రేమలు కొంచెం తగ్గాయి అనిపిస్తుంది.
తొలగించండిగతము తలచి వగచే కన్న సౌఖ్యమేలేదోయ్ అని ఒక పాటలో ఉంది.
గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్
రిప్లయితొలగించండిఆట్టే.వాడకంలేక మూలబడినా నెలనెలా అక్షరాలా పదునెనిమిది వందల రూపాయల బిల్లును BSNL వారు పంపుతూ ఉండటమూ ఆది చేతికి అందకపోతే వారి కార్యాలయం వద్ద డూప్లికేట్ బిల్లుకోసం అర్జీ పెట్టుకొని పడిగాపులుపడి మరీ కట్టటమూ ఆపైన ఆఫోను పడకేస్తే పక్షమేసి రోజులు మొత్తుకోవటం ఇదంతా మావల్లకాక లాండ్ లైను ఏనాడో పీకించేసి సుఖంగా ఉన్నాం.
రిప్లయితొలగించండి