23, అక్టోబర్ 2022, ఆదివారం

డబ్బు కావాలా? దరిద్రం పోవాలా? – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha on 23-10- 2022, SUNDAY, today)

పాత కాలపు తెలుగు నాటకాల్లో కాబూలీవాలా పాత్ర గుర్తుండే వుండాలి.  ఆ నాటకాల ప్రభావం కావచ్చు, కాబూలీవాలా అనే పేరు వినగానే  వడ్డీకి డబ్బులు అప్పులిచ్చి అసలు ఫాయిదాలను ముక్కుపిండి మరీ వసూలు చేసే ‘రౌడీ’రూపం కళ్ళల్లో మెదిలేది. అయితే ఒక్క వడ్డీ వసూళ్ళ విషయంలో తప్ప, కాబూలీవాలాలు చాలా మంచివాళ్ళన్న మంచి పేరు వారికి వుండేది. కాలక్రమంలో కాబూలీవాలాల శకం అంతరించి అప్పులిచ్చే మహారాజులు ఒకళ్ళయితే,  వాటిని గోళ్ళూడగొట్టి వసూలుచేసే వసూలు రాజాల పాత్రను  స్థానిక గూండాలు  పోషించడం మొదలు పెట్టారు. ఇక కార్పొరేట్ సంస్కృతి వూడలు దిగిన తరువాత ప్రైవేట్  బ్యాంకుల వాళ్ళు ఈ వసూలు రాజాలను మంచి ఆకర్షణీయమైన వేతనాలు, అలవెన్సులు ఇచ్చి పెంచి పోషిస్తూ రావడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారిపోయింది.

అసలు అప్పులు ఇవ్వడం వాటిని వసూలు చేసే క్రమంలో అనేక అవస్థలు పెట్టడం అనేది పురాణ కాలం నుంచి వింటున్న కధే. ఈ విషయంలో సత్య హరిశ్చంద్రుడు పడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. ఎన్ని కష్టాలు పడ్డా చివరికి కధ సుఖాంతం అయ్యింది కాబట్టి పరవాలేదు.

యుగాలు మారినా మారని ఈ విషసంస్కృతి,  కాలక్రమంలో  బాగా ముదిరిపోయి, వూడలు దించుకుంటూ  రూపాలు మార్చుకుంటూ,  పేర్లు మార్చుకుంటూ  చివరకు తాజాగా  ‘మనీ యాప్ లు’  అనే నూతన నామం సంతరించుకుని   పేద, మధ్య తరగతి  ప్రజల ధన,మాన, ప్రాణాలతో ఆటాడుకునే అత్యంత హైన్య స్థితికి దిగజారి పోయింది. సరే! ఈ మనీ యాప్ ల కంటే ముందే కాల్ మనీ పేరుతొ  విచ్చల విడిగా సాగిన వ్యాపారపు ఉచ్చులో చిక్కుకుని అనేక నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.  

మంచి విలువలతో కూడిన సమాజాలు విలసిల్లిన కాలంలో కూడా విలువలకు విలువ ఇవ్వని మనుషులు వుండేవాళ్ళు. మానవ సమూహాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా మంచి చెడుల సమ్మిశ్రితాలే. మంచి చెడుల నిష్పత్తి మాత్రమే  ఆ సమాజపు గుణగణాలను  అంతిమంగా నిర్ణయిస్తుంది.

అప్పు ఇవ్వడం, ఇచ్చిన అప్పుకు వడ్డీ వసూలు చేయడం అనేది అనాదిగా సమాజం అంగీకరించిన వ్యవహారమే. మా చిన్నతనంలో కూడా ఊళ్ళల్లో అప్పులు ఇచ్చే ఆసాములు వుండేవాళ్ళు. నగలు, వస్తువులు తాకట్టు పెట్టుకుని అవసరంలో వున్న  బీదాబిక్కీకి అప్పులిచ్చేవాళ్ళు. కొందరు ధర్మ ప్రభువులు ధర్మవడ్డీ  వసూలు చేస్తే, మరికొందరు అధిక వడ్డీలతో బాకీదారుల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు. వర్తమాన కాలంలో కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా అప్పుల వసూళ్ళ కోసం  గూండాల మాదిరిగా వ్యవహరించే సిబ్బందిని నియమించుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. 

ముందే చెప్పుకున్నట్టు అప్పులు, వడ్డీలు అనేవి చట్ట వ్యతిరేకం కావు. దేశాలు సయితం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటాయి, వడ్డీ చెల్లిస్తాయి. బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు  తీసుకుంటాయి. ఐతే ఇవన్నీ చట్టం లేదా నిబంధనల పరిధిలో జరుగుతాయి. గ్రామీణ బ్యాంకుల ఆవిర్భావానికి పూర్వం, ఊళ్ళల్లో జనం తమ  రుణ అవసరాలకోసం స్థానిక వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడేవాళ్ళు. క్రమేణా, నోటి మాట మీద అప్పులిచ్చే రోజులు పోయి ప్రామిసరీ నోటు మీద సంతకం చేయించుకునో, వేలిముద్ర వేయించుకునో అప్పులిచ్చే కాలం  వచ్చింది. గతంలో కోర్టుల్లో చాలా కేసులు వీటికి సంబంధించినవే ఉండేవి. గ్రామీణ బ్యాంకులు రంగప్రవేశం చేసిన తరువాత చాలా చోట్ల వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్ళెం పడింది. అలా అని వారి పీడ పూర్తిగా విరగడ అయిపోయిందని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటె మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి, మారిపోతున్నాయి. లోగడ ప్రాణం మీదకు వచ్చిన సందర్భాల్లో అప్పులు చేస్తే ఇప్పుడు ఆడంబరాలకోసం అప్పులు చేస్తూ వుండడం రివాజుగా మారిపోయింది. 

నిజానికి ఇలాంటి దందాలతో పెద్ద పెద్ద వారికి ప్రత్యక్ష ప్రమేయం ఉంటుందని అనుకోలేము. ఐతే వారి అండాదండా  తమకున్నదని చెప్పుకుంటూ , అలా నమ్మించే ఏర్పాట్లు చేసుకుంటూ ఇలాటి అక్రమ వ్యవహారాలకు తెర తీస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వుండడం రివాజుగా మారింది. ఈ స్థాయిలో ‘నేర ప్రవృత్తి’ రెక్కలు విప్పుకుంటున్నదంటే, పెద్ద తలకాయల ప్రమేయం అంతో ఇంతో లేకుండా, పోలీసుల దన్ను లేకుండా ఈవిధమైన తంతు సాగించడం అసాధ్యం అని నమ్మేవాళ్ళూ వున్నారు. అందుకనే పాలకపక్షానికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పక తప్పదు. అవసరాలకు కాకుండా ఆడంబరాలకోసం అప్పులు చేసే  మనస్తత్వం జనాల్లో పెరగడం కూడా మరో కారణం.  

ఉపశృతి: మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాలరావు చాలా సంవత్సరాలక్రితం ఒక వ్యాసం రాసారు. “డబ్బు కావాలా? దరిద్రం పోవాలా” అనేది దాని శీర్షిక.

ఒకానొక గర్భ దరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.

ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.

దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.

దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు  పడతాయి.

దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, డబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని భక్తుడు తెలుసుకుంటాడు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి