7, ఆగస్టు 2022, ఆదివారం

తప్పెవరిది? – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha on 07-08-2022, Sunday, today)

 

‘నేను ఎవర్నీ పనికట్టుకుని చెడగొట్టలేదు, చెడిపోయిన వాళ్ళే నా దగ్గరకు 

వస్తారు’ అంటుంది ఓ విజయవంతమైన సినిమాలో ఓ వేశ్య పాత్ర.

అలాగే మోసపోవాలని కోరుకున్నవాళ్ళే కోరి, మోసగాళ్ళ చేతుల్లో మోసపోతుంటారని అనిపిస్తుంది ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.

నమ్మకానికి  అపనమ్మకానికి నడుమ జరిగేదే మోసం అని కొందరు నమ్మి మోసపోయినవారు చెబుతుంటారు. ఒకర్ని నమ్మడానికి, ఆ ఒకర్ని జన్మలో మళ్ళీ నమ్మరాదు అనే  అపనమ్మకం పెంచుకోవడానికి కారణం నమ్మి మోసపోవడమే కదా! 

మోసగించడాలు, మోసపోవడాలు ఏదో కలియుగానికి మాత్రమే పరిమితం కావు. త్రేతా యుగంలో కూడా ఈ మాయల మరాఠీలు వున్నారు. శ్రీరాముడి వనవాస సమయంలో  మారీచుడు గొంతు మార్చి హా లక్ష్మణా అని పెట్టిన కేకలు విని సీతాదేవి, తన భర్త  శ్రీరామచంద్రుడు  ఏదో చిక్కుల్లో చిక్కుకున్నాడు  అని నమ్మి  మోసపోయే కదా మరిది లక్ష్మణుడిని ఆశ్రమం నుంచి బయటకు పంపి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నది.   

మా చిన్నప్పుడు వారపత్రికల్లో ఓ చిన్న ప్రకటన బాక్స్ కట్టి ప్రచురించేవారు,  చదరపు గడులను అంకెలతో నింపి పంపండి, విజేతలకు పన్నెండు బ్యాండ్ల  రేడియో వీపీపీలో పంపుతాము, పోస్టల్ ఖర్చుల కోసం కొంత పైకం పంపండి అని. చాలామంది ఆ ప్రకటనలు నమ్మి, డబ్బు  పంపేవాళ్ళు. అన్నట్టుగానే పార్సెల్ వచ్చేది. విప్పి చూస్తే ఆ కార్డు బోర్డు పెట్టే నిండా గడ్డీగాదం, కాగితం ముక్కలు ఉండేవి.. అలాగే పువ్వు మీ అదృష్టం చెబుతుంది అనే ప్రకటనలు కూడా. చిరునామా మాత్రం పలానా  పోస్ట్ బాక్స్ నెంబరు, లూధియానా అనో, జలంధర్ అనో  వుండేది. వాటిని నమ్మి డబ్బు పంపినవాళ్ళ అదృష్టం ఎలా వుందో చెప్పడానికి ఏ  పువ్వులు అక్కరలేదు. చెవిలో పువ్వు పెట్టడం  అంటే ఇదేనేమో! 

చాలా ఏళ్ళ క్రితం ఎవరో ఉత్తరాది నుంచి వచ్చి ఊళ్ళో  ఖాళీగా వున్న దుకాణం అద్దెకు తీసుకునేవారు. స్టీలు సామాన్లు, రేడియోలు, ఇలా అనేక రకాల సామాన్లు ఆ దుకాణంలో  ఉండేవి. ఇక పత్రికల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. ‘మా దగ్గర ఏదైనా ఒక వస్తువు కొనండి. అదే వస్తువు మరోటి ఉచితంగా తీసుకువెళ్ళండి’ ఇదీ వాళ్ళ ప్రచారం. వరిగడ్డికి నిప్పు అంటుకున్నట్టు త్వరలోనే ఈ ప్రచారం ఆ నోటా ఈనోటా పడి నలుగురికీ చేరేది.  ఇక ఆ షాపు ముందు మైళ్ళ కొద్దీ క్యూలు. మొదట్లో  కొన్న వస్తువుకు మరో వస్తువు ఉచితంగా ఇచ్చేవారు. రోజులు గడుస్తున్నకొద్దీ  జనంలో  వేలంవెర్రి బాగా పెరిగిపోయేది. అందుకు తగ్గట్టుగానే ఆ షాపు ముందు క్యూలు పెరిగేవి. జనంలోని బలహీనతను ఆసరాగా చేసుకుని, ‘రావాల్సిన స్టాకు సమయానికి రాలేదు, రేపో ఎల్లుండో వస్తుంది అనుకుంటున్నాం. డబ్బు కట్టి వెళ్ళండి, సరుకు  రాగానే ఇస్తాము’ అని నమ్మబలికేవారు. జనం నమ్మే వారు. చివరికి ఓ శుభ ముహూర్తంలో వాళ్ళు  బిచానా ఎత్తేసిన తర్వాత కానీ జనాలకు  తత్వం బోధ పడేది కాదు. తమకు జరిగిన మోసం గురించి కధలు కధలుగా చెప్పుకునే వాళ్ళు. ఎప్పటిదాకా! మరో మోసం విషయం వెలుగు చూసేవరకు.  

మనమూ ఓ కధ చెప్పుకుందాం! ఇదీ మోసం కధే!

అనగనగా ఒక వూరు.

వున్నట్టుండి ఓ రోజున ముక్కూమొహం తెలియని వ్యక్తి ఒకడు తన సహాయకుడిని వెంటబెట్టుకుని ఆ వూరు వచ్చాడు. వచ్చీరాగానే రచ్చబండ దగ్గర వూళ్ళో వాళ్ళతో భేటీ అయ్యాడు.

‘నాది కోతుల వ్యాపారం. ఒక్కో కోతికీ పది వరహాల చొప్పున ఇస్తాను. పోయి కోతుల్ని పట్టుకు రండి.’ అని చెప్పాడు.

గ్రామస్తులకి మతి పోయింది. వూరికి వున్నదే కోతుల బెడద. పట్టుకువచ్చి ఒప్పచెబితే పది వరహాలంటున్నాడు. బేరం భేషుగ్గావుంది. కోతుల పీడా వొదలడంతో పాటు నాలుగు రాళ్ళు కూడా వొళ్ళో పడతాయి.

వూరి జనమంతా పొలోమని కోతుల వేటలో పడ్డారు. మాట ఇచ్చినట్టే ఆ కోతుల బేహారి, కోతికి పది వరహాల చొప్పున లెక్కకట్టి మరీ చేతులో పెడుతున్నాడు. తెచ్చిన కోతిని తెచ్చినట్టు ఒక పెద్ద బోనులో పడేసి మేపుతున్నాడు.

కొన్నాళ్ళకు వూళ్ళోనే కాదు చుట్టుపక్కల కూడా కోతుల సంఖ్య తగ్గడం మొదలయింది. దాంతో బేహారి ధర పెంచాడు. ఒక్కో కోతి రేటు ఇప్పుడు అక్షరాలా పదిహేను వరహాలు.

కొన్నాళ్ళకి కోతుల కొరత మరీ ఎక్కువయింది. పదిహేను కాదు పాతిక వరహాలన్నాడు. జనం పెరుగుతున్న ధర చూసారు కానీ, అందులోని మర్మం ఏమిటో ఎవ్వరికీ అర్ధం కాలేదు. బేహారి కూడా కొన్న కోతుల్ని మారు బేరానికి అమ్మడం లేదు. తెచ్చిన కోతుల్ని తెచ్చినట్టు బోనులోనే వుంచుతున్నాడు. మనకు రావాల్సింది మనకు చెల్లిస్తున్నప్పుడు అతడా కోతుల్ని ఏం చేసుకుంటే మనకెందుకు అని జనమే సర్దిచెప్పుకున్నారు

అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ వ్యాపారి రేటు యాభయి వరహాలకు పెంచాడు.

తమ పంట పండిందనుకున్నారు గ్రామస్తులు.

ఓ రోజు ఆ వ్యాపారి కోతుల కొనుగోలు వ్యవహారం సహాయకుడికి ఒప్పచెప్పి వ్యాపారపు పనులమీద పట్నం వెళ్లాడు.

అతడలా వెళ్ళగానే అతడి సహాయకుడు ఊళ్ళో వాళ్లని పిలిచి చెప్పాడు.

‘ఆ బోనులో మేం కొన్న కోతులన్నీ అలాగే వున్నాయి చూశారు కదా. నేను మీకు వాటిని ముప్పయ్ అయిదు వరహాల చొప్పున అమ్ముతాను. మా వాడు వూరినుంచి రాగానే మీరు వాటిని యాభయికి అమ్మేయండి. శ్రమలేకుండా మీకు పదిహేను వరహాలు మిగులుతాయి.’

గ్రామస్తులకు మతులు పూర్తిగా పోయాయి. కోతులు అమ్మి సంపాదించిందే వారి దగ్గర చాలా వుంది. ఇక ఇప్పుడు ఇలా ఇచ్చి అలా తెచ్చుకోవడమే. వ్యాపారి సహాయకుడు చెప్పిన మాటలతో వారికి కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరమైంది. పెళ్ళాం నగలు కుదువబెట్టీ,,  హెచ్చు వడ్డీలకు అప్పులు తెచ్చి కోతికి ముప్పయి అయిదు వరహాల చొప్పున ఆ సహాయకుడికి చెల్లించి వున్న కోతులనన్నింటినీ కొనుగోలుచేశారు.

అంతే. మర్నాటి నుంచి ఆ వ్యాపారి కానీ అతడి సహాయకుడు కానీ మళ్ళీ వాళ్లకు కనిపిస్తే వొట్టు.

ఆనాటి వరహాల రోజులనుంచి ఈనాటి రూపాయల కాలం దాకా మోసం చేసేవాడిదీ, మోసపోయేవాడిదీ ఇదే తంతు. ఏమీ మారలేదు. ఈ ఆట అలా అనంతంగా సాగుతూనే వుంది.

ఉపశ్రుతి:

“నగరంలో ఒక పెద్ద పారిశ్రామిక వేత్త ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత రాత్రి  దాడిచేసి పెద్దమొత్తంలో నల్ల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో పట్టుబడిన సొమ్ము, నగలు తదితర వివరాల  జాబితా ఇలా రాశారు.

‘ఇరవై కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు. పాతిక కిలోల బంగారం ఆభరణాలు, నాలుగు అతి ఖరీదైన కార్లు,  కోట్ల విలువచేసే  స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, నాలుగు బల్లితోకలు, మూడు జిల్లేడు మొక్కలు’

చివర్లో ఈ బల్లితోకలు, జిల్లేడు మొక్కలు ఏమిటి? ఒక వెబ్ సైట్ లో బాగా ప్రాచుర్యం పొందిన ఓ వీడియో మీద ఇది సెటైర్ అన్నమాట. 

ఆ వెబ్ ఛానల్ లో ఓ పెద్దాయన చెప్పాడట, బల్లితోకని జిల్లేడు మొక్కకి కట్టి చూడండి, మీకున్న అప్పులన్నీ అణాపైసలతో సహా తీరిపోతాయని. అది నిజమో కాదో తెలియదు కానీ, ఆ వీడియోకి మాత్రం  వేలల్లో వ్యూస్ వచ్చిన మాట నిజం.

కాబట్టి, కావున మనం తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే, ఈ లోకంలో మోసపోయేవాళ్ళు ఉంటేనే, మోసం చేసేవాళ్ళ ఆటలు సాగుతాయి. (07-08-2022)




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి