27, జూన్ 2022, సోమవారం

తప్పులపై కత్తి దూసిన పాత్రికేయుడు

 ఈ సంగతి చెప్పింది ఆంధ్రభూమి ఎడిటర్ గా పని చేసిన శ్రీ ఎం.వీ.ఆర్. శాస్త్రి.

సందర్భం : వయోధిక పాత్రికేయ సంఘానికి నిన్న మొన్నటివరకు అధ్యక్షులు, పాత్రికేయ కురువృద్ధులు (తొంభయ్ ఏళ్ళు) శ్రీ గోవర్ధనం సుందర వరదాచారి సన్మాన సత్కార సభ.

ఈ సభలో మాట్లాడుతూ శాస్త్రి గారు తాను ఆంధ్రభూమిలో పనిచేసేటప్పుడు  ఓ వింత ఆలోచన కలిగిందనీ, దాన్ని ఆచరణలో పెట్టడానికి వరదాచారి గారు ఒక్కరే సమర్ధులని నిర్ణయించుకుని ఆ బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంచామని చెప్పుకొచ్చారు. అదేమిటంటే వివిధ తెలుగు దినపత్రికల్లో వస్తున్న భాషా  దోషాలను, సంపాదకీయాల్లో దొర్లే  గుణదోషాలను ఎత్తి చూపే ఒక శీర్షిక నిర్వహణ అన్నమాట. దిద్దుబాటు అనుకుంటా ఆ కాలమ్ పేరు.   

ఈ రోజుల్లో శాస్త్రిగారు చెప్పిన సంగతి పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే పత్రికల నడుమ జరుగుతున్న కలం పోట్లని జనం అందరూ గమనిస్తున్నారు.  కానీ ఇది పాతకాలం  ముచ్చట. విలువలు, మశానము అంటూ దేవిరించే రోజులు అవి.

వరదాచారి గారి నాలుకకే పదును ఎక్కువ అనుకుంటే, ఇక ఆయన కలానికి ఉన్న పదును ఎలాంటిదో వేరే చెప్పాలా!

శాస్త్రి గారి మాటపై ఆయన కలాన్ని ఝలిపించారు. అన్ని పత్రికలు ముందేసుకుని చిత్రిక పట్టారు. ఎక్కడ ఏ దోషం వున్నా దాన్ని ఉతికి ఆరేసేవారు. పక్క పత్రికల మీద రాతలు కదా! భూమిలో పనిచేసేవాళ్ళు వరదాచారి గారి చెణుకులను  బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఆ వరద హస్తం మన వైపు చూపిస్తే, కొంపలు అంటుకుంటాయి అనే భయం కూడా మనసు మూలల్లో వుండేది.

అన్నంత పనీ జరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకా అనేక ఇతర ప్రముఖ పత్రికల భరతం పట్టిన తర్వాత వరదాచారి గారు ఆంధ్రభూమి వైపు దృష్టి సారించడమే కాదు, బాణం ఎక్కుపెట్టి గురిచూసి కొట్టారు. భూమిలో వచ్చే రాతలపై చీల్చి చెండాడారు. దొర్లుతున్న స్ఖాలిత్యాలను ఎత్తి చూపారు. ఈ విషయంలో ఆయనకు స్వపరబేధం లేదు.

ఆ దూకుడు రాతలు చూసి భూమి సిబ్బందే నివ్వెరపోయారు.  

ఇలాంటి రాతలు వరదాచారి గారు మాత్రమే రాయగలరు.

ఇలాంటి మాటలు ధైర్యంగా చెప్పగలిగేది శాస్త్రి గారే!

వయసులో తేడా వున్నా ఇద్దరిదీ కంచుగొంతే! గొంతులోనుంచి వచ్చే ప్రతి మాటా వారి గుండెల్లోనుంచి వస్తుంది కనుక దానికి అంత పవర్.



(27-06-2022)

1 కామెంట్‌: