(ఈరోజు 12-06-2022 ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ ఒక చక్కని మాట చెప్పారు.
“ఒక మంచి వాడిని, సద్గుణ సంపన్నుడిని ఎంపిక చేసుకోండి. అతడికి అధికారం ఇచ్చి చూడండి, ఇక అతడెలా మారిపోతాడన్నది మీరే చూస్తారు.”
చాలామందికి అర్ధం కానిది ఇదే. అధికారంలో లేని సమయంలో ఎలాంటి బందోబస్తూ లేకుండా ప్రజల నడుమ అరమరికలు లేకుండా స్వేచ్చగా తిరిగిన రాజకీయ నాయకులు, పదవిలోకి రాగానే చుట్టూ భద్రతా వలయాలు నిర్మించుకుని ప్రజలకు ఎందుకు దూరం అవుతారన్నదే జవాబు లేని ప్రశ్న.
ఉన్నత స్థానాల్లో వున్న వ్యక్తులకు భద్రత కల్పించడం ఆక్షేపణీయం యెంత మాత్రం కాదు. అయితే ఆ పేరుతొ చేస్తున్న హడావిడీ, అనవసర వ్యయం గురించి ఎవ్వరూ ప్రశ్నించకూడదు అనడం కూడా సబబు కాదు.
కొన్నేళ్ళ క్రితం చైనా అధ్యక్షుడు అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. ఆయన వెళ్ళే మార్గాలనే కాకుండా చుట్టుపక్కల దారులను కూడా దిగ్బంధించారు. ఆ క్రమంలో పార్కింగ్ చేసివున్న కొన్ని వాహనాలను పోలీసులు క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. పార్కింగు చేసి వున్న ఒక కారులోని మహిళను కిందికి దిగే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. క్రేన్ తో పైకి లేపిన వాహనంలో ఆ మహిళ చిక్కుకు పోయిన సమాచారం బయటకు పొక్కి, పోలీసులను చిక్కుల్లో పడేసింది.
అసామాన్యులకోసం అధికారులు అసాధారణ రీతిలో చేసే భద్రతా ఏర్పాట్ల కారణంగా సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ విషయం ఆ ప్రముఖులకు తెలుసో లేదో తెలవదు. శ్రీలంక అధ్యక్షుని హోదాలో మహీంద్ర రాజపక్సే వెంకన్న దర్శనం కోసం ఓ సారి తిరుపతి వచ్చారు. స్వామి సేవ చేసుకుని తిరిగి వెళ్ళారు. అయితే అయన రాకను పురస్కరించుకుని చేసిన భద్రతా ఏర్పాట్లు సామాన్య భక్తులకు చుక్కలు చూపించాయి. కొండ ఎక్కకుండానే వారికి దేవుడు కనబడ్డాడు. తిరుపతి అలిపిరి సెక్యూరిటీ గేటు వద్ద అసంఖ్యాకంగా వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. మరునాడు పత్రికల్లో వచ్చిన ఆ ఫోటోలు చూసే అవకాశం ఆ విదేశీ అతిధి దేవుడికి ఎలాగూ వుండదు. అంచేత తన భద్రత కారణంగా జనాలు ఎంతగా ఇక్కట్లకు గురయిందీ తెలిసివచ్చే అవకాశం ఆయనకి బొత్తిగా లేదు.
ఆర్భాటపు భద్రతా ఏర్పాట్లకోసం ప్రజాధనం ఖర్చయినా ప్రజలు సహిస్తారు, ఎంతవరకు అంటే, తమ దినవారీ పనులకు ఆ ఏర్పాట్లు అడ్డం రాకుండా ఉన్నంత వరకు.
పొతే, ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత, పటాటోపం, అధికార దర్పం ప్రదర్శించడానికే తప్ప వారి ప్రాణరక్షణకు సరిగా ఉపయోగపడడం లేదన్న అభియోగాలు వున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రముఖుల పేరుతొ కొందరికి కల్పిస్తున్న భద్రత అపహాస్యానికి గురవుతున్న మాటా నిజమే.
ఉదాహరణకు 2014 లో ఒక వ్యక్తికి అసాధారణ భద్రత కల్పించారు. అతడికి ఏర్పాటు చేసింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. అతడికి పహరా కాయడానికి కేంద్ర భద్రతా దళానికి చెందిన పాతికమంది సాయుధ పోలీసులను నియోగించారు. ఇంతకీ ఆ వీ.వీ.ఐ.పీ. వున్నది ఒక ఆసుపత్రిలో చావుబతుకుల నడుమ. వెంటిలేటర్ల సాయంతో అతగాడి ప్రాణాలను ఏ క్షణానికి ఆ క్షణం డాక్టర్లు నిలిపి వుంచుతున్న స్తితిలో. వెంటిలేటర్లు ఎప్పుడు తొలగిస్తే అప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు హరీ అంటాయి. అయినా పోలీసు భద్రతమాత్రం కొనసాగించారు. ఇది అవసరమా అంటే అవుననే అంటారు అధికారంలో వున్నవాళ్ళు.
ముప్పయ్యేళ్ళ క్రితం జరిగిన ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుందాం.
స్వీడన్ దేశపు ప్రధాన మంత్రి పామే ప్రతి రోజూ మాదిరిగానే ఆఫీసునుంచి ఓ సాయంత్రం ఇంటికి వచ్చారు. సినిమాకు పోదామన్న కోరికను భార్య వెలిబుచ్చింది. సరే అన్నారు ప్రధాని. వారిద్దరూ కాలినడకన బయలుదేరి భూగర్భంలో వున్న మెట్రోలో ప్రయాణించి గ్రాండ్ సినిమా థియేటర్ కు చేరుకున్నారు. (మన దేశంలో ఇలాటివి కలలో కూడా ఊహించలేము). సినిమా చూసి, పామే దంపతులు తిరిగి నడుచుకుంటూ ఇంటికి చేరుకునే క్రమంలో దారిలో ఒక దుండగుడు చాలా దగ్గర నుంచి కాల్పులు జరపడంతో పామే అక్కడికక్కడే మరణించారు. ప్రధాని భార్య ఈ సంఘటనలో గాయపడింది. ఈ దుర్ఘటన కారణంగా స్వీడన్ దివంగత ప్రధాని నిరాడంబర జీవన శైలి ప్రపంచానికి తెలిసివచ్చింది.
పలానా దేశపు ప్రధాన మంత్రి విమానాశ్రయంలో తోటి ప్రయాణీకుల మాదిరిగానే క్యూలో నిలబడి బోర్డింగు పాసులు తీసుకున్నారనీ, మరో దేశపు ప్రధాని, కొడుకును స్కూల్లో దింపి రావడానికి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాడనీ ఇలాటి వార్తలు విన్నప్పుడు, ఫోటోలు చూసినప్పుడు కూడా ఆశ్చర్యం అనిపించక మానదు. మన దేశంలో కూడా ఇటువంటి రాజకీయ ప్రముఖులు లేకపోలేదు. కాకపోతే వారి సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.
చూసి నేర్చుకోవాల్సిన ఒక ఉదంతం గురించి చెప్పుకుందాం.
ఇది జరిగి చాలా ఏళ్ళయింది.
అదొక సువిశాల భవన ప్రాంగణం.
సుదూరంగా కెమెరా కన్ను నుంచి చూస్తే అంతా నిర్మానుష్యంగా వుంది. ఆ భవనం ప్రవేశ ద్వారం వద్ద ఓ వ్యక్తి వొంటరిగా నిలబడి వున్నాడు. కనుచూపుమేరలో ఎవరూ లేరు. ఇంతలో ఓ పొడవాటి నల్లటి మోటారు వాహనం అక్కడికి చేరుకుంది. దానికీ వెనుకా ముందూ ఎలాటి వాహనాలు లేవు. అందులో నుంచి ముందుగా డ్రైవర్ దిగి వెనుక వైపు డోరు తెరిచిపట్టుకున్నాడు. ఒకే వ్యక్తి ఆ కారునుంచి దిగాడు. కోటు బొత్తాములు సవరించుకుంటూ ముందుకు నడిచాడు. అప్పటివరకు అక్కడ వొంటరిగా వేచివున్న వ్యక్తి, రెండు అడుగులు ముందుకు వేసి కారులో నుంచి దిగిన వ్యక్తితో ఆప్యాయంగా కరచాలనం చేశాడు. ఆదరంగా ఆహ్వానించి సాదరంగా ద్వారం వైపు చేయి చూపించి ఇతర అతిధుల రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడి పోయాడు. ఆ వచ్చిన వ్యక్తి కూడా ఎవరికోసం ఎదురు చూడకుండానే, ఎవ్వరూ తోడు లేకుండానే వొంటరిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
చాలా దూరంనుంచి ఈ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్న అనేక టెలివిజన్ కెమెరాలు దాన్ని ప్రపంచ వ్యాప్తంగా తమ చానళ్ళలో ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఎందుకంటే ఆ ఇద్దరూ సామాన్యులు కారు. కారునుంచి దిగివచ్చిన వ్యక్తి ఈ ప్రపంచాన్ని తన కనుసన్నల్లో ఆడిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆయనకు స్వాగతం పలికిన వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యాలోని సెంట్ పీటర్స్ బర్గ్ నగరంలో 2013 జరిగిన ఇరవై దేశాల అగ్ర నాయకుల (G-20) సదస్సులో పాల్గొనడానికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా అక్కడికి వెళ్ళినప్పటి ముచ్చట ఇది.
ఇదంతా యెందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీఐపీ భద్రత పేరుతో ఎంతో హడావిడి చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలుచేసే అనుభవాలకు అలవాటుపడిన ప్రాణాలకు ఈ రకమైన దృశ్యాలు నిజంగా ఎంతగానో వూరట కలిగిస్తాయి. అలా అని వాళ్లు భద్రతా చర్యల పట్ల ప్రమత్తంగా వుంటున్నారని కాదు. ఆధునిక సాంకేతిక పరికరాలను సమర్ధవంతంగా వుపయోగించుకుంటున్నారని వేరే చెప్పనక్కరలేదు కూడా.
మన దేశంలో ఈ దృశ్యం మరోరకంగా కానవస్తుంది. ఒక స్థాయి కలిగిన నాయకులు కలుసుకున్నప్పుడు సయితం కళ్ళు తిరిగే హడావిడి. మందీ మార్బలం, పుష్పగుచ్చాలతో సంసిద్ధంగా వుండే వ్యక్తిగత సిబ్బంది, ఏకే 47 వంటి తుపాకులు ధరించిన బ్లాక్ క్యాట్ బాడీ గార్డులు, ఎటుచూసినా అడుగడుగునా సాయుధ పోలీసు అధికారులు. ఇక విదేశీ ప్రముఖులు వస్తే చెప్పనక్కరలేదు. భద్రత పేరుతొ జనాలను కాల్చుకు తింటారు. చెప్పొచ్చేది ఏమిటంటే ఇలాటివాటిని చూసి నేర్చుకునేది ఏమైనా వుంటుందా అన్నదే.
ప్రముఖుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా, ఏదైనా జరగరానిది జరిగితే అది సంచలన వార్త అవుతుందని, అంచేత సెక్యూరిటీ విషయంలో తాము చెప్పినట్టు విని తీరాల్సిందే అని భద్రతా విభాగం వారు నొక్కి చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే కావచ్చు. మరి వందల కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతున్న ఈ భద్రతా ఏర్పాట్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవచ్చు కదా, తద్వారా ప్రముఖుల రాకపోకల సందర్భంలో బందోబస్తు పేరుతొ సామాన్యుల రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులను ఓ మేరకు తగ్గించవచ్చు కదా! అనేది మామూలు మనుషులకు కలిగే సందేహం. ప్రస్తుతం అలా కూడా చేస్తున్నారు. అంగరక్షకుల చేతుల్లో చిన్న సైజు బ్రీఫ్ కేసులు కనిపిస్తుంటాయి. వాటిల్లో ఇటువంటి పరికరాలే వుంటాయి. అయినా ప్రముఖుల రాకకు ముందు, అది వివాహ వేడుక కావచ్చు, సాధారణ సమావేశం కావచ్చు పోలీసు జాగిలాలతో, బాంబులను నిర్వీర్యం చేసే దళాలతో క్షుణ్ణంగా తనిఖీ చేయడం తప్పనిసరి. అలాగే ప్రముఖులు ప్రయాణం చేసే మార్గాల్లోనే కాకుండా భద్రతాధికారులు ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ మార్గాల్లో సయితం వాహనాల కదలికలపై ఆంక్షలు విధించడం కద్దు. ఇంత శ్రమ పడ్డా, ఇంతటి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలేదు. దరిమిలా సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించి వాటిని మరింత పటిష్టం చేయడం ఒక్కటే జరుగుతోంది. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతూనే వస్తోంది.
ఇది అవసరమా అనేది సామాన్యుల ప్రశ్న. అవసరమే అనేది అసామాన్యుల సమాధానం కావచ్చు.
రాజకీయనాయకులకులకి హడావిడి ఎంత ఎక్కువుంటే అంత వాల్యూ ఎక్కువ ఇక్కడ.
రిప్లయితొలగించండిఅ మధ్యొక కార్టూన్ చూశాను. విఐపి అంటూ ట్రాఫిక్ ఆపేశారట పోలీసులు. ఓ వాహనదారుడు పోలీసుతో కోపంగా అంటాడు - ఇవాళ వస్తున్న విఐపి హెలీకాప్టర్ లో మీటింగు స్థలానికి వెడతారని పేపర్లో వ్రాశారు. అయినా కూడా నేల మీద రోడ్డు ట్రాఫిక్ ఆపడమేమిటి - అని. పోలీసుల అత్యుత్సాహం, అతిజాగ్రత్త అలా ఉంటాయన్నమాట?
రిప్లయితొలగించండిసరే. మీరన్నట్లు విదేశీ విఐపి కి తెలియకపోవచ్చు. కానీ కారులో కూర్చున్న ఆ స్వదేశీ / లోకల్ ప్రముఖుడికి రోడ్డు మీద పరిస్ధితి గమనించరా / కనబడదా? పైన చిరు గారన్నట్లు హడావుడి కావాలి. చిన్నపాటి కార్పెరేటర్ కూడా షో చెయ్యాలి.
వీళ్ళంతా తమ వార్డుకి / ఊరికి / నియోజకవర్గానికి మకుటం లేని మహారాజులం అని, అన్నీ తమ కనుసన్నల్లోనే జరగాలనీ అనుకుంటున్నట్లుంది.
మీడియా వారు ఉపయోగించే పదాలు కూడా అలాగే ఉంటాయి - “పట్టాభిషేకం”, “కొలువు తీరారు” … వగైరా.
ఇది పూర్తిగా భ్రష్టు పట్టిన వ్యవహారం. బాగుపడుతుందనే నమ్మకం నాకయితే లేదు.