9, మార్చి 2022, బుధవారం

దృష్టి కోణాన్ని బట్టే ఆలోచనలు – భండారు శ్రీనివాసరావు

 “రేపు ఉదయం పదింటికి టీవీలు చూడండి. నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్యపోతారు”

నిన్న మంగళవారం సాయంత్రం వనపర్తి బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటన ఇది.

విషయం ఏమిటో తెలియకపోయినా, అసలు ఆ ప్రకటన చేసిన తీరే జనాలను ఆశ్చర్యపరచిన మాట నిజం. కేసీఆర్ లో ఉన్న వైచిత్రి అదే!

అన్నట్టుగానే కేసీఆర్ ఈ ఉదయం పదిగంటలకు శాసన సభలో ఆ ప్రకటన చేశారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటన. షరా మామూలుగా రాజకీయ ప్రకంపనలు సృష్టించే  ప్రకటన ఆయన నోటినుంచి వస్తుందని ఆశలు  పెట్టుకున్నవాళ్లు ఉసూరుమన్నారు. మరో పక్క ముఖ్యమంత్రి ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనాలు డప్పులతో నృత్యం చేస్తున్న దృశ్యాలు టీవీ తెరలపై దర్శనం ఇచ్చాయి. ఇవి మాత్రం ఆశ్చర్యం కలిగించాయి అని కొందరు చెప్పారు.

నిజం ఒప్పుకోవాలి. ఉసూరుమనిపించకపోయినా నాకు సయితం ఈ ప్రకటన ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళం  మన దృష్టి కోణం నుంచే ఆలోచన చేస్తుంటాం. పరిశీలన చేస్తుంటాం. వ్యాఖ్యలు చేస్తుంటాం.  రాజకీయ నాయకులు, ప్రత్యేకించి కేసీఆర్ వంటి ప్రజల నాడి పట్టుకోగల నాయకుడు  ఆలోచన చేసే తీరే విభిన్నం అని కొద్ది గంటల తర్వాత నాకే తెలిసి వచ్చింది.

మా ఇంట్లో వంట చేసే మనిషి వనిత, ఈ మధ్యాన్నం కొంత ఆలస్యంగా వచ్చింది. మావి అపరాహ్న భోజనాలు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఎండన పడి వచ్చింది కానీ మొహంలో సంతోషం కొట్టవచ్చినట్టు కనబడుతోంది.

“ఇన్నాళ్ళకు మా కష్టాలు గట్టెక్కేలా వున్నాయి. మా చిన్నోడు ఇన్నాళ్ళు  సరయిన ఉద్యోగం లేక రోడ్డు పట్టుకు తిరుగుతున్నాడు. తెలంగాణా వస్తే మా వాడికి కొలువు దొరుకుతుందని ఆశ పడ్డాము. ‘ఈరోజు కేసీఆర్ సారు చెప్పిండట. ‘ఏదో ఒక ఉద్యోగం తప్పక దొరుకుతుందమ్మా’ అన్నాడు, మా వాడు.  నాకు ఎక్కడలేని సంతోషం వేసింది. మా వాడికి కొలువు దొరికినంత ఆనందం అయింది. కేసీఆర్ సారు గురించి ఇంట్లో అందరం  మాట్లాడుకుంటూ వుండిపోయాము. అందుకే  పనికి రావడం ఆలస్యం అయింది” అన్నది మా వంట మనిషి.

నిజమే! కేకులు తినే నా వంటివారికి రొట్టెలు తినేవారి  ఆకలి ఎలా తెలుస్తుంది?

తోకటపా:

ప్రజాభీష్టం తెలుసుకుని తగిన ప్రకటనలు చేయడం ద్వారా వారి మనసులు గెలుచుకోవడం సరే! కానీ వారి నమ్మకాన్నికూడా  గెలవాలి అంటే కేవలం ప్రకటనలు సరిపోవేమో!

ఆచరణ కూడా వుండాలి.





(09-03-2022)

         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి