7, మార్చి 2022, సోమవారం

ఆరు రాత్రులు, ఆరు పగళ్ళు - భండారు శ్రీనివాసరావు

ఇదేమీ వెనుకటి రోజుల్లోని మళయాళం డబ్బింగు సినిమా టైటిల్ కాదు. అచ్చంగా నా సొంత గొడవ. ఎవరితోనూ పెట్టుకున్న గొడవ కాదు, నాకై నేను నాతో పెట్టుకున్న గొడవ.
అసలు సంగతి ఇది కాదు, మనిషికి రాయాలనే ఇచ్చ కలగనిదే ఏది రాసినా అందులో సారం వుండదు. ఇన్నాళ్ళు అలాంటి చేవ లేని రచనలే చేస్తూ వస్తున్నాను అనే సంగతి ఈ మధ్యకాలంలో తరచూ మనసును పీకుతోంది.
ఇదిగో ఈ క్రమంలో ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ అనుభవం అన్నమాట.
ఈ నేపధ్యంలోనే నేను మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి మూడో అబ్బాయి ఉంటున్న అపర్ణా కౌంటీకి వెళ్లి దాదాపు వారం రోజులు వున్నాను. పెద్ద ఇల్లు, విశాలమైన పడక గదులు, అన్నింటికీ మించి అతి విశాలమైన మనసులు కలిగిన దంపతులు దీప, లాల్ బహదూర్, తమ మాటలతో చేతలతో ఆకట్టుకునే వారి పిల్లలు స్పురిత, హసిత. నాకు తోడుగా నా మేనల్లుడు రామచంద్రం, అతడి భార్య కరుణ. అందరికీ ఎవరి పడక గదులు వారికే వున్నాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అందరం ఎడం ఎడంగా సోఫాల్లో కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా విశాలమైన హాలు. ఇంటి చుట్టూ పూలమొక్కలు, కూరగాయల పాదులు, అన్ని రకాల ఫలవృక్షాలు. సకల ఆధునిక వసతులతో ఒక చక్కని పల్లెటూరులో వున్నట్టు వుంటుంది. వాళ్ళు ఆ విల్లా కొనుక్కున్నప్పటినుంచీ నన్నూ మా ఆవిడనూ వారి దగ్గరికే వచ్చి కొన్నాళ్ళు గడపాలని పోరుపెట్టేవారు. కానీ కుదరలేదు. ఈ నేపధ్యంలో
ఓ శుక్రవారం వచ్చి నన్ను కారులో తీసుకుపోయారు. తెలిసిన ఇల్లే. తెలిసిన మనుషులే.
అక్కడ ఉండగానే నాకేమీ తెలియదనే నిజం ఒకటి తెలిసివచ్చింది. అది తెలియగానే సెల్ ఆఫ్ చేసాను. పత్రికలు ముట్టుకోలేదు. టీవీ వార్తలు చూడలేదు. ఇన్నాళ్ళూ జీవించిన ప్రపంచానికి దూరం జరిగాను.
మరో కారణం, నాలో మరో 'నేను' వున్నాడు అనే సంగతి తెలియరావడం.
ఆ 'రెండో నేను' నాలో ఉన్నాడని తెలిసింది కాని, ఎవరో ఏమిటో తెలియదు.

అది తెలియడానికే ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళు ఖర్చు చేయాల్సివచ్చింది. తెలిసిందా అంటే ఏమి చెప్పాలి, మహామహులకే సాధ్యం కాలేదు ఆ సంగతి తెలుసుకోవడం. నాకెలా వీలుపడుతుంది?

ఆధ్యాత్మికం, ఆముష్మికం ఈ పదాలు చిన్నతనం నుంచి అనుక్షణం వినబడే కుటుంబ నేపధ్యం అయినప్పటికీ వాటిపట్ల అభిలాష కానీ అనురక్తి కానీ ఏర్పడలేదు. అలా అని వాటిని తృణీకరించే స్వభావమూ నాకు అలవడలేదు. జీవితంలో అనేక విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. వాటిల్లో ఇవీ ఒక భాగమే అనే తత్వం.
“సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి:”
మంచి మనసున్న మనుషులతో సాంగత్యం మనసుపై మంచి సానుకూల ప్రభావం చూపుతుంది. ఆది శంకరాచార్యులు తన భజగోవింద స్త్రోత్రంలో చెప్పిన ఈ శ్లోకం అంతరార్ధం ఇదే.
ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ కాలంలో మంచి మాటలు వినడానికీ, మంచి రచనలు చదవడానికీ, మంచి మనుషులతో గడపడానికీ ఓ మంచి అవకాశం లభించింది. సందేహాలు, సమాధానాలతో కూడిన అర్థవంతమైన చర్చలకు ఆస్కారం దొరికింది. గూడుకట్టుకుని ఉన్న సందేహాలు తీరాయా, దొరికిన సమాధానాలు సంతృప్తి ఇచ్చాయా అంటే చప్పున జవాబు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు దాదాపు డెబ్బయి సంవత్సరాల సంచితం మెదడులో నిక్షిప్తమై గడ్డకట్టి వుంది. ఇలా అయిదారు రోజుల ప్రయత్నంతో దాన్ని పెకలించడం కష్టం.
వయసులో పెద్ద అయిన నావి పెద్ద సందేహాలు. నాకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడయిన నా మేనల్లుడు రామచంద్రం వాటిని తీర్చే ప్రయత్నం చేసేవాడు. ఇదో వైచిత్రి.
ఉదయం మొదలయిన వాదసంవాదాలు ఒక పెట్టున తేలేవి కావు. అపరాహ్నం వరకూ సాగి వాటి నడుమనే ఉపాహారాలు, అల్పాహారాలు, మధ్యాన్న భోజనాలు. ఇక సాయంసమయంలో మొదలయితే అర్ధరాత్రివరకూ అంతువుండేది కాదు. ఇద్దరు ప్రాసంగికులే. ఇద్దరూ శ్రోతలే. జవాబుల అన్వేషణలో ప్రశ్నలు, సందేహాల నివృత్తిలో మరిన్ని ప్రశ్నలు.
మా మేనల్లుడు రామచంద్రానికి పూర్వజన్మ వాసనలతో కూడిన ఆధ్యాత్మిక భావజాలం వుంది. అది బహుశా వారి నాన్నగారు కొమరగిరి అప్పారావు బావగారి నుంచి వారసత్వంగా లభించి వుంటుంది. చేసింది గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం అయినా రామాయణ, భారత భాగవతాలు నాలుకపై ఆడుతుంటాయి. చిన్నవయసులోనే ఇలాంటి అధ్యాత్మిక వాసనలు ఉన్న వారిని తోటివారు చిన్నచూపు చూడడం కద్దు. కానీ రామచంద్రం విషయం కొంత విభిన్నం. అందరికీ రామచంద్రం చెప్పే విషయాలు వినడంలో ఆసక్తి వుంది. నా ఒక్కడికీ కొంత మినహాయింపు ఇవ్వాలేమో. ఎందుకంటే నాదంతా అనుమానాలతో కూడిన ఆరాలు. దేవుడు అంటే భక్తీ లేకా కాదు, దేవుడు అంటే నమ్మకం లేకా కాదు. ఏ విషయాన్ని వెంటనే నమ్మేయడం ఎందుకనే సాధారణ ప్రాపంచిక విషయ పరిజ్ఞానం తాలూకు ప్రభావం నామీద ప్రబలంగా ఉన్న కారణంగా వచ్చిన తిప్పలు ఇవి. మూఢ నమ్మకాల మీద అతిమూఢ౦గా పెంచుకున్న అయిష్టత, ఏహ్యత ఒక కారణం కావచ్చు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే మా ఆవిడ గర్భవతిగా వున్న సమయంలో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో ఆమెని సాంప్రదాయక విశ్వాసాల ప్రకారం చీకటి గదిలో పడుకోబెట్టకుండా ఆమె చేత అఢవా చాకిరీ చేయించిన చరిత్ర నాకుంది. తొలిచూలు అయినా మూఢ నమ్మకాల మీద నా యుద్ధానికి ఆమె మౌనంగా సహకరించింది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కదలకుండా విశ్రాంతిగా పడుకోని పక్షంలో వారికి పుట్టే బిడ్డలు అవకరంగా జన్మిస్తారనే నమ్మకాలు ప్రబలంగా వున్న రోజుల్లోనే నా నిర్వాకం ఇది.
ఈ నేపధ్యంలో ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ అధ్యాయం మొదలయింది.

భండారు శ్రీనివాసరావు అనే నేను ...
బాగానే వుంది, నువ్వే శ్రీనివాసరావువి. మరి ఆ ఆ పేరు తీసేస్తే నీవెవరు?
నిన్ను గుర్తు పట్టేది ఎల్లా? నీ రూపం చూశా? నీ మాటలు వినా? నీ రాతలు చదివా? ఎలా?
ఈ శరీరానికి ఆ పేరు ఉందా! లేదా పేరును బట్టి శరీరానికి శ్రీనివాసరావు అనే అస్తిత్వం వచ్చిందా!
ఈ నేను కాని దాన్ని నేను, నేను అనుకోవడం అజ్ఞానం అవుతుందా!
అంటే ఈ నేను, నేను కాదని బోధపరచుకోవాలా!
సత్యం బోధ పడడానికి ఎంత దూరం దృష్టి సారించాలి. అంత దూరం దృష్టి ఆనుతుందా!
పెంజీకటి కావల అన్నాడు పోతన,
అంటే పెనుచీకటికావల వెలుగు ఉంటుందా! అసలు ఈ కటిక చీకటిని చీల్చి చూడడం ఎల్లా!
దేహంలో ఆరు కోశాలు అని అంటారు.
అన్నమయ కోశం (అన్నంతో జీవించేది), ప్రాణమయ కోశం ( శరీరంలో వున్న వ్యవస్థ), మనోమయ కోశం(ఆలోచింప చేసేది), విజ్ఞానమయ కోశం ( జ్ఞానం కలిగించేది), ఆనందమయ కోశం ( దివ్యానుభవం కలిగించేది).
మొదటి అయిదు దాటి చూస్తే చివరిదానికి చేరుకుంటాడు మానవుడు. దాన్ని కూడా దాటి చూడగలిగితే సర్వం ఆనందమయం. అక్కడ గోచరిస్తుంది ప్రకాశంతో విరాజిల్లే ఆత్మ.
అదే అసలయిన నేను అంటారు భగవాన్ రమణ మహర్షి.
ఉన్నది ఒకే ఒక్క నేను. అదే అసలు నేను. కానీ మనలోని అవిద్య ఈ రెండో నేనును సృష్టిస్తుంది. అదే అసలు నేను అనే భ్రాంతి లో ఉంటాము. దీనినే దేహాత్మ భ్రాంతి అంటారు (ఈ దేహమే నేను అనే భ్రాంతి). దీనికే మిథ్యా నేను అని పేరు. మిథ్య అంటేనే లేనిది ఉన్నట్లు అనిపించడం. వాస్తవంగా చెప్పాలంటే అటువంటిది ఏమీ లేదు. ఇది ఎలా ఉంటుందంటే సముద్రంలో లేచిన అల తిరిగి సముద్రంలోనే కలుస్తుంది. అది లేచినప్పుడు అల అంటాం, పడినప్పుడు సముద్రం అంటాం. అంతా నీరే. ఉన్నది సముద్రం ఒక్కటే కదా. అలాగే ఈ నేను కూడా. మనలో ఉన్న అవిద్య తొలగించి చూస్తే ఉన్నది ఒకే నేను, అదే అసలు నేను.

గీతలో చెప్పినట్టు చంపేదెవరు? చచ్చేదెవరు?
అంతా నీ భ్రమ.
అన్నీ నేనే అనే పరమాత్మ ఒకటి వుంది. మిగిలినవన్నీ భ్రాంతులే.
నేనెవరు అని ఓమారు మనల్ని మనం ప్రశ్న వేసుకుని నిశ్చల ధ్యానంతో జవాబు వెతుక్కుంటే ..
ప్రతి మనిషి శరీరంలో మూడు భాగాలు. ఒకటి ఉపాధి (శరీరంతో కూడిన నేను), రెండోది స్థూల శరీరం (రక్తమాంసాలు కలిగినది), మూడోది సూక్ష్మ శరీరం (జీవుడు)
కంటికి కనబడే స్థూల శరీరాన్నే నేను అనే ఓ మిథ్యా భావనలో, భ్రమలో ఉంటాము.
జీవుడు అనే సూక్ష్మ శరీరము, జన్మజన్మల కర్మఫలాలను అనుభవించడానికి స్థూల శరీరాన్ని ధరిస్తుంది. ఆ కర్మ ఫలాలు కూడా మూడు.
ప్రారబ్ధం, ఆగామి, సంచితం.
ప్రస్తుత శరీరంలో జీవుడు అనుభవిస్తున్న కర్మని పుణ్యం, ప్రారబ్ధం అంటారు.
అనాదిగా తెచ్చిపెట్టుకున్న కర్మని ఆగామి అంటారు.
కర్మశేషం వుంటే అది సంచితంగా మరో జన్మలో దఖలు పడుతుంది.
కర్మశేషం తొలగిన రోజున జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. అంటే పాపపుణ్యాలు రెండింటినీ క్షయం చేసుకోవడం అన్నమాట.
ఏమి అర్ధం అయింది? అంత తేలికగా అర్ధం కానిది, అంతం లేనిది కనుకే వేదాంతం అన్నారు.
అర్ధం అయినా కాకపోయినా ఈ వయస్సులో అప్పుడప్పుడైనా కొన్ని ఆముష్మిక విషయాలు గురించి ఆలోచించడం మంచిదనిపించి ఈ రాతలు. అంతే!

“అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం”
(శ్రీ మద్భగవద్గీత, పంచ దశాధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము)
తాత్పర్యం: నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని ప్రజ్వలింప చేసే ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనే నాలుగు విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను.
ఇప్పుడీ గీతా ప్రవచనం ఎందుకంటే నేను ఓ అరవై ఏళ్ళు వెనక్కి పోవాలి.
నా చిన్నతనంలో మా బామ్మగారు రుక్మిణమ్మ గారు ప్రతిరోజూ అపరాహ్ణకాలంలో భోజనానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్ద చేతిలో పట్టుకుని ఈ గీతా వాక్యాన్ని చదివేది. అది ఎందుకు చదివేదో అప్పుడు నాకు అర్ధం అయ్యేది కాదు.
సనాతన సాంప్రదాయాలు నిష్టగా పాటించే ఇళ్ళల్లో వైశ్వదేవం చేసేవాళ్ళు. భోజనం చేయడానికి ముందు బలిహరణం అనే ప్రక్రియ వుంటుంది. దీని ఆంతర్యం చాలా గొప్పది. సమస్త భూత రాశులను, కోటానుకోట్ల జీవ రాశులను భోజనానికి ముందు, తర్వాత ఆపోసన, ఉత్తరాపోసనల ద్వారా తృప్తి పరచడం ఇందులోని విశిష్టత.

“అర్ధం చేసుకోగలిగితే వేదాంతం చాలా గొప్పది.
పారమార్ధికం, పారలౌకికం ఈ రెంటినీ సరైన పాళ్ళలో కలిపితే అదే వేదాంతం అవుతుంది. గీతలో భగవానుడు బోధించింది అదే.
“నీ పని నువ్వు చెయ్యి. ఫలితం నాకు వదిలేయ్”
ఎవరి పని వాళ్ళు చేయడం పారలౌకికం. ఫలితాన్ని పరమాత్ముడికి వదిలేసి దేనికీ తాపత్రయ పడకపోవడం పారమార్ధికం.
ఇలా చేస్తే స్వార్ధరహిత కర్తవ్యపాలన జరుగుతుంది. దాన్ని పరిపాలన అనండి, ఉద్యోగం అనండి, కుటుంబ బాధ్యతలు అనండి, ఇంకేదైనా అనండి. అన్నిటికీ ఈ సూత్రాన్ని పాటిస్తే సమాజానికి మేలు జరుగుతుంది.
కానీ జరుగుతున్నది తద్విరుద్ధం. పారమార్ధిక భావాలు బాగానే ప్రబలుతున్నాయి. అలాగే పారలౌకిక భావనల్లో స్వార్ధ తలంపులు కూడా.
భగవద్గీతను భక్తిగా తలమీద పెట్టుకుంటాం కాని, అందులో చెప్పిన దాన్ని నిబద్ధతతో తలకెక్కించుకో౦!
కలివిడిగా వున్నప్పుడు కూడా మనసును విడిగా ఉంచుకోగలగాలి. విడిగా వున్నప్పుడు సైతం నలుగురితో కలిసివున్నామన్న భావన పెంచుకోవాలి.
ఏమిటో శంకరాభరణం శంకర శాస్త్రిగారి మాటల్లాగా ఒక్కటీ అర్ధం కావడం లేదనిపిస్తోందా!
అందుకే దాన్ని వేదాంతం అన్నారు.

ధ్యానం అంటే ఓ పాత సంగతి గుర్తుకు వస్తోంది.
2003లో మౌంట్ అబూలోని బ్రహ్మకుమారీల ఆశ్రమానికి హైదరాబాదు నుంచి తీసుకువెళ్ళిన బృందంలో నేను మా ఆవిడ కూడా ఉన్నాము.
“మర్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి, ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మ కుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యాన ముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో, ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తి కాగానే బ్రహ్మ కుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. మధుర ఘడియలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే, నేను మాత్రం ఆ వాతావరణాన్నీ, అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానంలో ఏదయినా వుందా?”

'మీకు శత్రువులు ఎవ్వరూ లేరా స్వామీ?' అని అడిగాడు ఓ ఆసామీ ఓ స్వామివారిని.
'లేకేం! నా నాలుకే నా శత్రువు' అన్నారా స్వామి.
తరచి చూస్తె అందులో ఎంతో నిజం వుందని అనిపిస్తుంది.
ఒకసారి పరిపూర్ణానంద స్వామి ఉగాది పంచాంగ శ్రవణానికి వెళ్ళాము. ఆయన కంఠం కంచుగంట. చెప్పే విషయం ఏదయినా ఓ కధలా వినసొంపుగా వుంటుంది.
భార్యాభర్తల సంబంధాలు, విడాకుల ప్రస్తావన దొర్లింది. స్వాములేమిటి? విడాకుల గొడవేమిటి అనుకునేవాళ్ళకు ఆయన ప్రసంగమే సమాధానం. ఈ (ఆ) ఏడాది (మన్మధ) విడాకుల కేసులు బాగా పెరిగిపోతాయని స్వామి ఉవాచ. మరి ఏమిటి మార్గం. ఉందన్నారు ఆయనే. నాలుకను అదుపులో ఉంచుకోవడం ఒక్కటే శరణ్యం ఆన్నారాయన. సరిగ్గా ఇలాగే కాకపోయినా దాదాపు ఇదే అర్ధం వచ్చేలా చెప్పారు.
'మొగుడొకటి అంటాడు. భార్య ఒకటి అంటుంది. ఆ ఒక్కటే విడాకులదాకా వెడుతోంది. వెనుకటిలా ఈనాటి తరానికి మంచీచెడూ చెప్పే పెద్దవాళ్ళు ఇళ్ళల్లో వుండడం లేదు. చెప్పినా వినిపించుకునే పరిస్తితి కూడా లేదు. చిన్న విషయాలు పెద్దవి అవుతున్నాయి. మునుపటి రోజుల్లో కూడా ఇలా జరక్కపోలేదు. కానీ కుటుంబ సంబంధాలు కట్టి పడేసేవి. ఇప్పుడలా కాదు. అప్పటికప్పుడే వేడిమీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే కాస్త నాలుకను అదుపులో పెట్టుకుంటే ఇలాటి సమస్యలు అన్నీ అదుపులోకి వస్తాయి. లేకపోతే అదుపుతప్పి పోతాయి'
స్వామి వారు చెప్పింది అందరూ విన్నారు. బాగా చెప్పారు అని కూడా అనుకున్నారు. ఆ హితవచనాలను ఇంటిదాకా ఎంతమంది మోసుకెళ్లారన్నది అనుమానమే.
నేనూ దీనికి మినహాయింపు కాదని మర్నాడు ఓ టీవీ చర్చలో కూర్చున్నప్పుడు తెలిసిపోయింది.
నా నాలుకే నా శత్రువు. నిజానికి ఈ శత్రువును జయించాల్సిన పనిలేదు. స్వామి చెప్పినట్టు అదుపులో వుంచుకుంటే చాలు.
కానీ అయ్యే పనా!

కురుపాండవ యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు సంధికోసం కౌరవుల వద్దకు వెడతాడు. సంధి పొసిగే సంగతి కాదని కృష్ణుడికి ముందే తెలుసు. అంతేకాదు, యుద్ధం జరగాలని కోరుకున్నదీ ఆయనే, జరిగి తీరుతుందనీ తెలిసిందీ ఆయనకే. ఫలితం వుండదని తెలిసి చేసిన ప్రయత్నం అది. ఫలితం ఎలా వుంటుందో తెలిసి చేసిన యత్నం అది. సంధి పట్ల, యుద్ధం పట్ల సంబంధం వున్న అన్ని పక్షాల లేదా వ్యక్తుల వైఖరులు, అభిప్రాయాలు బయట పెట్టడానికి చేసిన రాజకీయం అనుకోవాలి.
ఫలితం రాకపోయినా, ఫలితం లేకపోయినా ప్రయత్నం మాత్రం వృధా కాదు. ఎవరు ఏమిటనేది అనేది, ఎవరి మనసులో ఏముందనేది జనాలకు తెలిసొచ్చేలా చేయగలిగితే ఆ ప్రయత్నం ఓ మేరకు విజయవంతం అయినట్టే.

మరణం అంటే ఏమిటి?
మహామహులే ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు. ఇది కూడా సరయిన జవాబు కాకపోవచ్చు కానీ చాలా సంవత్సరాల క్రితం ఓ కధలోనో, నవలలోనో చదివాను.
“నువ్వు కూర్చునే కుర్చీ వుంటుంది. పక్కనే అతిధులు కూర్చునే సోఫాలు వుంటాయి. గోడమీద గడియారం వుంటుంది. టేబుల్ మీద టీవీ వుంటుంది. ఇంతెందుకు మీ ఇల్లు ఎలా వుండాలని అన్నీ అమర్చుకున్నావో అవన్నీ అలాగే వుంటాయి.
“ఒక్క నువ్వు తప్ప”

ఇలా ఇలా ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక చర్చలు, వాదనలు, ప్రతి వాదనలతో, పాత జ్ఞాపకాలతో పరస్పర అనుభవాల మార్పిడితో ఆరు రాత్రులు, ఆరు పగళ్ళు ఇట్టే గడిచిపోయాయి.
కారులో మళ్ళీ నన్ను ఇంట్లో దింపుతున్నప్పుడు దారిలో ఓ పాత పాట జ్ఞాపకం వచ్చింది.

నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో ....... 




(Courtesy Image Owner)




 

(13-09-2020)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి