4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

కోర్టు గుమ్మం జైలు గడప – భండారు శ్రీనివాసరావు


“మీ కేసులో బలం వుంది, కానీ ఈ కేసును కడకంటా తీసుకువచ్చే శక్తి మీలో లేదని అనుకుంటున్నాను” అన్నాడా లాయరు గారు.
అనుకుంటాం కానీ ప్లీడర్లలో, వైద్యుల్లో అందరూ పీడించేవాళ్లే వుండరు. ఈయన కూడా అలాంటి అరుదైన వాడే అనిపించింది.
నేను 1975లో ఆలిండియా రేడియోలో చేరినప్పుడు ఏడాది తిరగకుండానే పే కమిషన్ సిఫారసులు అమలు చేశారు. ఆ చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగి నాకు రావాల్సిన గ్రేడు రాలేదు. కొన్నేళ్ళ తర్వాత న్యూస్ ఎడిటర్ గా వచ్చిన ఆకిరి రామకృష్ణా రావు నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని సర్వీసు వ్యవహారాల్లో దిట్ట అయిన ఒక ప్లీడరు గారి దగ్గరకు తీసుకువెళ్లాడు.
విషయం మొత్తం తెలుసుకుని ఆ వకీలు గారు చెప్పిన మాట ఇది.
అంతే కాదు కొన్ని పాయింట్ల రూపంలో గీతా బోధ కూడా చేశారు.
“మీ ప్రొబేషన్ పూర్తి కాలేదు. అంచేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తె కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రభుత్వం ఒక కాంక్రీటు గోడ లాంటిది. దాన్ని డీకొడితే గోడ పగలడం కంటే డీ కొట్టిన తల పగిలే అవకాశాలే ఎక్కువ. మనం ఒక కోర్టులో గెలిస్తే వాళ్ళు పై కోర్టుకు వెడతారు. అలా మనం ఎక్కలేనన్ని మెట్లు వాళ్ళు సులువుగా ఎక్కేస్తారు. మనమూ ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ శక్తి ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఇటువంటి పొరబాటే ఓ వందా రెండు వందల మందికి జరిగి వుంటే తలా కాస్త ఖర్చు పెట్టుకుని పోరాడవచ్చు. కానీ ఇది ఇండివిడ్యువల్ కేసు. పొరబాటు జరిగినా అది అంగీకరించరు. అంచేత వాళ్ళు లిటిగేషన్ కొనసాగిస్తారు. అంత ఆర్ధిక స్థోమత మీకు వుందని అనుకోను. ప్రొబేషన్ పూర్తి కాలేదు కాబట్టి కేసు తేలే వరకు మీకు పే కమిషన్ ప్రయోజనాలు నిలిపేసినా ఆశ్చర్యం లేదు. కేసు తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టవచ్చు. అప్పటిదాకా తట్టుకోగల శక్తి మీకు వుందని నేను అనుకోవడం లేదు.”
వచ్చిన క్లయింట్లని ఇలా నిరుత్సాహ పరిచే లాయర్లు ఉంటారని నాకు తెలియదు. ఆయన నా మీద సానుభూతితో చెప్పాడా లేక ఈ జర్నలిస్టులు అడిగిన ఫీజు ఇవ్వరు అనే అనుమానంతో చెప్పాడా అదీ తెలియదు. తెలిసినదల్లా అతడిలో సందేహించడానికి ఏమీ లేదనే. ఓ నమస్కారం పెట్టి వచ్చేసాము.
తర్వాత అనేక పే కమిషన్లు వచ్చాయి. నా సర్వీసు చివరాఖర్లో వచ్చిన పే కమిషన్ సిఫారసులతో కేంద్ర సిబ్బంది వేతనాలు ముందెన్నడూ లేని విధంగా పెరిగాయి. కాకపొతే, 2005 డిసెంబరు 31 సాయంత్రం నేను రిటైర్ అయ్యాను. మర్నాడు అంటే 2006 జనవరి ఒకటి నుంచి ఆ సిఫారసులు అమల్లోకి వచ్చాయి. అంటే ఒక్క రోజు తేడాతో పెన్షన్ లో పెద్ద వ్యత్యాసం వచ్చింది. చాలా పెద్ద మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.
కానీ నేను ఆకాశవాణిలో గడించిన అనుభవాలు, మాస్కో జీవితం, పిల్లలు ఎదిగిరావడం ఇవన్నీ ఇచ్చిన తృప్తిని ఎన్ని పే కమిషన్లు ఇవ్వగలుగుతాయి? ఆనాడు ఆ లాయరు నన్ను ఆ కేసు గెలిపించి వుంటే నాకీ అవకాశాలు లభించి ఉండేవి కావేమో! ఒకటి తీసుకోవడం అంటే మరోటి ఇవ్వడం అనే లెక్క ఆ పైవాడిది.
“గోదావరిలో ఎన్ని నీళ్లున్నా మనం చెంబు తీసుకువెడితే చెంబెడు, బిందె తీసుకువెడితే బిందెడు. ఏదైనా ప్రాప్తాన్నిబట్టే” అనే మా అన్నయ్య భండారు పర్వతాలరావు గారి మాటలు నాకు ఊరట. ఆయన ఇంకో మాట అనేవారు.
‘కోర్టు గుమ్మం ఎక్కకుండా, జైలు గడప తొక్కకుండా వెళ్లదీయగలిగితే దాన్ని మించిన ప్రశాంత జీవితం మరోటి వుండదు”
అదృష్టవశాత్తు ఈ రెండూ నా అనుభవంలోకి రాలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి