5, డిసెంబర్ 2021, ఆదివారం

రోశయ్య గారితో కాసేపు – భండారు శ్రీనివాసరావు

 పాత విషయాలు కదా తేదీలు సంవత్సరాలు సరిగా గుర్తుండడం లేదు.

తిరుపతికి దగ్గరలో, మరీ అంత దగ్గర కాదు, శ్రీ సిటీ అనే ఒక సెజ్ రూపు దిద్దుకుంటోంది. ఆ సంస్థ పీఆర్వో కి మాకు ఆ సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలనే సత్సంకల్పం కలిగింది. ఈ బృందంలో  జర్నలిస్టు అవుట్ లుక్ ఎమ్మెస్  శంకర్, జ్వాలా నేను. తిరుపతిలో స్వామి దర్శనం అనే మాట మమ్మల్ని మరో మాట మాట్లాడనివ్వలేదు. హైదరాబాదు నుంచి విమానంలో చెన్నై వెళ్లి, అక్కడి నుంచి శ్రీ సిటీవాళ్ళు ఏర్పాటు చేసిన కారులో అక్కడికి చేరడం మా ప్రోగ్రాం.

సుమారు ఏడుగంటల ప్రాంతంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగానే జ్వాలా రాజ్ భవన్ కు ఫోన్ చేసి తుల్జానంద్ సింగ్ తో మాట్లాడాడు. ఆయన వెంటనే రాజ్ భవన్ కు ఆహ్వానించారు. ఒక రకంగా చెప్పాలంటే చెన్నైలో దిగేంతవరకు ఈ రాజ్ భవన్ సందర్శన కార్యక్రమం లేదు. ఏ వూరు పోయినా ఆ వూళ్ళో ఎవరెవరు తెలిసిన వాళ్ళు వున్నారో వాళ్లకి ఫోను చేయడం కాని, వీలయితే కలిసిరావడం కానీ జ్వాలా పీఆర్ లో ఒక భాగం.

తుల్జానంద్ రండి రండి అంటూ ఆహ్వానం పలకడం, మేము ప్రయాణిస్తున్న వాహనం రూటు మార్చుకుని రాజ్ భవన్ లోకి దూసుకుపోవడం జరిగింది. లోపలకు వెళ్ళగానే అప్పుడే వాకింగ్ నుంచి వస్తూ గవర్నర్ రోశయ్యగారు కనబడ్డారు. అందర్నీ పేరు పేరునా పేరుతొ పలకరించి, ఎలావున్నారు, ఎప్పుడొచ్చారు ఎన్నాళ్ళు వుంటారు అని కుశల ప్రశ్నలు వేసారు. వెంటనే వెళ్ళాలని చెప్పాం. కుర్చీలు తెప్పించి బయట లాన్ లో వేయించారు. రాజ్ భవన్ కదా మర్యాదలు మామూలే. టీ తాగుతూ పిచ్చాపాటీ. ఒకరకంగా గత కాలపు ముచ్చట్లే. పాత కబుర్లు చెబితే రోశయ్యగారే చెప్పాలి. ఆయన ధారణ శక్తి అసాధారణం. ఎప్పటెప్పటివో సంగతులు చెప్పారు. తెనాలి, గుంటూరు, విలేకరులను ఆయన పేర్లతో సహా గుర్తు పెట్టుకోవడం గమనించి ముచ్చటేసింది.

పనిలోపనిగా చెన్నై రాజ్ భవన్ ముచ్చట్లు. ఒకప్పుడు అది సుమారు పదమూడువందల ఎకరాల్లో వుండేది. చాలావరకు దట్టమైన అడవి. మేము కూర్చున్న చోటుకు దగ్గర్లో కొన్ని హరిణాలు తచ్చాడుతూ కనిపించాయి. ప్రస్తుత రాజ భవన్ విస్తీర్ణం బాగా కుదించుకుపోయినా, ఇంకా వంద ఎకరాల పైమాటే. రాజ్ భవన్ లో విశాలమైన ప్రాసాదాలు గవర్నర్ నివాసంకోసం వున్నప్పటికీ, రోశయ్య గారు వాటి జోలికి పోకుండా పక్కనే వున్న ఓ చిన్న గెస్ట్ హౌస్ లో మకాం చేస్తున్నారు.

'వుండేది నేనూ నా భార్య ఇద్దరమే. మరీ పెద్ద ఇళ్ళల్లో అయితే ఒకరినొకరం వెతుక్కోవాలి.'

చిన్న భవనంలో వుంటున్నందుకు రోశయ్యగారు ఇచ్చుకున్న సంజాయిషీ అది.

కాసేపు కబుర్లు చెప్పుకుని, తుల్జానంద్ సింగ్ ఫోటోలు తీయగా తీయించుకుని, రోశయ్య గారికి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్పి మళ్ళీ రోడ్డున పడ్డాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి