5, డిసెంబర్ 2021, ఆదివారం

చిత్తశుద్ధి – భండారు శ్రీనివాసరావు

 చిత్తం శివుని మీదా, భక్తి  చెప్పుల మీదా అనే సామెత వుంది.

మనుషుల్లో రకరకాలు. తాము ఒక్కరే పరిశుద్దాత్ములమని నమ్ముతూ, ఇతరులను గురించి నీచంగా మాట్లాడడం అనే హిపోక్రసీ వారి రక్తంలో వుంటుంది. దీనికి సంబంధించిన కధ ఒకటి చిన్నతనంలో మనలో చాలా మంది చదివే ఉంటాము.

  ఊళ్ళో పురాణ కాలక్షేపాలతో  ఊరి జనానికి మంచేదో, చెడేదో చెప్పే పండితుడు ఉండేవాడు. ఆయన అనునిత్యం  దైవనామ స్మరణలోనే జీవితం గడుపుతుంటాడు.  ఆయన ప్రవచనాలు చెప్పే ప్రదేశానికి దగ్గరలోనే ఒక వేశ్య ఇల్లు. ఆ ఇంటికి  వచ్చిపోయే విటులను చూస్తూ ఆ పండితుడు  బాధ పడేవాడు. ఇలా పాపకర్మలు చేసేవాళ్ళకు నరకం తప్పదు అని భావించేవాడు. ఆ వేశ్య ఇంటికి ఎవరు వచ్చినా ఒక గులక రాయి వేసి లెక్కలు పెట్టేవాడు. కొన్నాళ్ళకు ఆ గులక రాళ్లు ఓ చిన్న గుట్టగా తయారయ్యాయి. ఆమెని పిలిచి చెప్పాడు, చూసావుగా నీ పాపాల గుట్ట ఎలా పెరుగుతోందో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ పాపిష్టి జీవితానికి స్వస్తి చెప్పి రామా కృష్ణా అంటూ కాలం గడుపు అని సలహా ఇచ్చాడు.

మరి కొన్నాళ్ళకి ఆ ఇద్దరికీ అంత్యకాలం సమీపించింది. స్వర్గం నుంచి వచ్చిన దైవ భటులు ఆ వేశ్యను సకల మర్యాదలతో తీసుకువెళ్ళారు. పండితుడిని తీసుకుపోవడానికి యమభటులు పాశాలతో వచ్చారు.

“నిత్యం  దైవారాధనలో గడిపే నాకు నరకం ఏమిటి, యావత్ జీవితం పాపకర్మలతో గడిపిన ఆమెకు స్వర్గ ప్రాప్తి ఏమిటి అని నిలదీశాడు.

అప్పుడు ఆ యమ భటులు చెప్పిన సమాధానమే ఈ చిత్తశుద్ధి వ్యాసానికి కేంద్ర బిందువు.

‘నిజమే మీరు ప్రతి నిమిషం భగవన్నామస్మరణలోనే గడుపుతున్నారు. కానీ మీ చిత్తం మాత్రం ఆమె ఇంటికి వచ్చి పోయే విటులను లెక్కించడం పైనే వుంది. ఆమె తన దరిద్రపు బతుకును ఏవగించుకుంటూ, కనీసం వచ్చే జన్మలో అయినా తనకి మంచి జీవితం ప్రసాదించమని రోజూ పడుకునే ముందు దేవుడ్ని ఒకేఒకసారి  కోరుకునేది. ఆ క్షణంలో ఆమెకు వేరే ధ్యాస వుండేది కాదు. మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థించేది. ఆమె చిత్తశుద్ధికి భగవంతుడు కరుణించి స్వర్గం అనుగ్రహించాడు. ఎల్లప్పుడూ ఇతరులలోని  చెడును తప్పుబట్టే  చెడుస్వభావం కారణంగా నీకు నరకం ప్రాప్తించింది”    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి