22, సెప్టెంబర్ 2021, బుధవారం

పొరబాట్లు జరిగాయి, దిద్దుకోవాలి. – భండారు శ్రీనివాసరావు


మళ్ళీ చెబుతున్నాను. జరిగినవి పొరబాట్లు మాత్రమే. తప్పులు కావు. అంచేతే సరి చేసుకోవడానికి అవకాశం వుంది.
మా స్వగ్రామం కంభంపాడు ఓ కుగ్రామం. నా వయసు డెబ్బయి అయిదు అంటే నేను పుట్టేనాటికే మా ఊళ్ళో ఓ మిషనరీ పాఠశాల వుండేది. అది పూరిపాకలో కాదు. మంచి భవంతిలో. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.
నేను చదువుకున్న బడి నడి ఊళ్ళో వుంది. పూరిల్లు. వర్షం వస్తే సెలవు. అలా వుండేది.
మా తాతగారు భండారు సుబ్బారావు గారు కాశీ యాత్ర చేసివచ్చిన ఓ స్వామీజీకి తనకున్న భూమిలో ఇరవై ఎకరాలు దానం చేసి ఆయనకు ఓ ఆశ్రమం కట్టించి ఇచ్చారు. ఊళ్ళోని రైతులు కూడా, మరో ఇరవై ఎకరాల దాకా సాయం చేశారు. కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని స్వామీజీ ఆ ఆశ్రమంలో ప్రతిష్టించి ఓ చిన్న గుడి కట్టించారు. కొన్నాళ్ళు వైభవంగానే రోజులు గడిచాయి.
కాలక్రమంలో స్వామీజీ కాలం చేశారు. ఆశ్రమం పాడు పడింది. మా తాతగారు చనిపోయారు. గుళ్ళో దీపం పెట్టేవాళ్ళు కరువయ్యారు. ఆశ్రమానికి సాయం చేసిన మా కుటుంబంలోని వాళ్ళు కూడా పై చదువులకు, ఉద్యోగాలకు నగరాలకు తరలిపోవడంతో పరిస్థితి మరింత అధ్వాన్నం అయింది. మా తాతగారు దత్తు తీసుకున్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు ఓ ఇరవై ఎకరాలు గుడి పేరున వుంచి, దాన్ని ఆ పూజారికే వదిలివేశారు. దానిపై వచ్చిన ఆదాయం (కౌలు డబ్బులు) తో జీవనం గడుపుతూ, గుడి బాగోగులు చూడమని అప్పగించారు. ఆ భూములపై ఇప్పుడు మాకు ఎటువంటి హక్కులు లేవు.
మిగిలిన ఇరవై ఎకరాలను ప్రభుత్వానికి అప్పగిస్తూ అక్కడ ఓ ఎస్సీ కాలనీ నిర్మిస్తే బాగుంటుందని నాటి జిల్లా కలెక్టర్ కు ఓ లేఖ రాసారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన జంధ్యాల హరినారాయణ గారు అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్.
ఆ ఉత్తరం చూసి ముందు ఆయన నమ్మలేదు. ఎస్సీ కాలనీల కోసం భూముల సేకరణకు తమ సిబ్బంది కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతుంటే ఒక్కళ్ళూ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఎవరీయన ఏకంగా ఇరవై ఎకరాలు దఖలు పరుస్తూ ఉత్తరం రాశారని ఆశ్చర్యపోతూ మా ఊరు వచ్చి స్వయంగా పరిశీలించి వెళ్ళారు. బహుశా ఆయన హయాములోనే అనుకుంటా జిల్లా మొత్తంలో ఓ పెద్ద ఎస్సీ కాలనీ మా ఊళ్ళో వెలిసింది.
ఇదంతా ఎందుకు అంటే..
పొరబాట్లు ఎక్కడ ఎలా జరిగాయో తెలిపేందుకు. అప్పటికే మూడు గుళ్ళు వున్న మా ఊళ్ళో మరో గుడి కట్టడానికి భూములు ఇచ్చిన రైతులు తర్వాత ఆ గుడిలో దేవుడిని పట్టించుకోలేదు. ఊళ్ళో బడి దిక్కూ మొక్కూ లేకుండా వుంటే దాని సంగతి పట్టించుకోలేదు.
అదే సమయంలో మిషనరీ వారు ఎక్కడో విసిరేసినట్టున్న మా ఊరువంటి ఓ మారు మూల గ్రామంలో ఓ మంచి పాఠశాల కట్టించారు. అక్కడ చదువుకున్న పిల్లలు జీవితంలో ఎంతో ఎదిగి వచ్చారు.
గుడి ప్రాధాన్యతను నేను తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ సమాజానికి కావాల్సిన వాటిని అందించడంలో మన ధార్మిక సంస్థలు తగినంత కృషి చేయడం లేదు. కోట్ల కోట్ల ఆస్తులు కలిగిన సంస్థలు కూడా చదువుకూ, ఆరోగ్యానికీ ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ఏదైనా అంటే అది ప్రభుత్వాల బాధ్యత అంటారు.
కంచిపీఠం, రామకృష్ణ మఠం వంటివాళ్ళు చక్కని విద్యాలయాలు, వైద్యాలయాలు నిర్వహిస్తున్న సంగతి వాస్తవమే. కానీ విస్తృత హిందూ సమాజపు విద్య, వైద్య అవసరాలని అవి తీర్చగలిగే స్థాయిలో లేని మాట కూడా నిజమే. ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణ అనేది మొదటి ప్రాధాన్యంగా అవి కార్య కలాపాలు నిర్వహిస్తున్నాయి.
విద్య, వైద్య రంగాల ప్రాధాన్యత గుర్తించిన మిషనరీ సంస్థలను నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు మతం మారితే మనం తప్పుపడుతున్నాము. వాళ్ళని దూరం చేసుకుని, వాళ్ళే దూరం జరిగారని అనుకుంటే లాభం ఏమిటి?
అయితే, మతం మార్చుకుని కూడా ప్రభుత్వ సదుపాయాలను, సౌకర్యాలను అనుభవించడం అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఇందులో భేదాభిప్రాయం లేదు. ఉండరాదు.
(22-09-2021)

5 కామెంట్‌లు:

  1. >>మతం మార్చుకుని కూడా ప్రభుత్వ సదుపాయాలను, సౌకర్యాలను అనుభవించడం అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం.

    Perfect

    రిప్లయితొలగించండి
  2. అవి పొరపాట్లు కావచ్చు,తప్పులు కాకపోవచ్చు.కానీ, సరిచేసుకోవడం కుదురుతుందా!దశాబ్దాల హిందువుల మందకొడి తనం వల్ల జరిగిన మార్పులు మాత్రం సరిచేసుకోవడానికి వీల్లేని దశకి చేరుకున్నాయి.

    అబ్రహమిక మతాల వారు కొత్త చోట్లకి వ్యాపించేటప్పుడు అక్కడి జనసాంద్రతలో 20 శాతం అయ్యేవరకు చాలా సంయమనంతో వ్యవహరిస్తారు.చర్చిలో కానీ మసీదులో కానీ నమోదు తప్పనిసరి కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్లకి లెక్కలు తెలుస్తూనే ఉంటాయి.ఇక 20 శాతం అయ్యాక ఒక్క రోజు కూడా ఇతర మతస్థుల రాజ్యాధికారానికి కట్టుబడరు.పెరుగుతున్న క్రైస్తవీకరణ యొక్క ప్రమాదం హిందువులకి తెలియనివ్వని దాపరికం కోసం హిందూ ఐడెంటిటీతోనే చెలామణీ అవుతున్న డబల్ ఏజెంట్లని ముందుకు తోసి మైనారిటీ కార్డు వాడుతూ బతిమిలాట నుంచి బెదిరింపుల దాక అన్ని ఎత్తుగదల్నీ ఉపయోగించి తక్షణ ప్రయోజనాలని పొందుతారు.మతాంతరీకరణల జోరును కూడా పెంచుతారు.హిందువుల్లో ఉన్న మీలాంటి ఆదర్శవాద సెక్యులర్ మహాత్ములు మతాంతరీకరణ చేస్తున్న వాళ్ళ మీద పోరాడుతున్న హుందువుల్ని విమర్శిస్తూ హితబోధలు చేస్తూ మళ్ళీ ప్రమాదాలని గురించి హెచ్చరిస్తూ ఉంటే హిందువులు యుద్ధంలో గెలవదం ఎలా సాధ్యం?

    మీకు ఎంతో ఇష్టమైన రాజశేఖర రెడ్డి గారి హయాములోనే క్రైస్తవీకరణ విపరీత స్థాయిలో చెలరేదిందని మీకు తెలుసా!రాజశేఖర రెడ్డి గారు కాన్స్టాంటినోపుల్ తర్వాత అంతటి హద్దులెరుగని స్థాయిలో క్రైస్తవ మతవ్యాప్తి చేసిన మొదటి ప్రభుత్వాధినేత, ఆధునిక సెక్యులరిస్టు సిద్ధాంతం అమలులోకి వచ్చిన తర్వాత సెక్యులర్ చట్రాన్ని బద్దలు కొట్టి మరీ క్రైస్తవ మతవ్యాప్తి చేసిన మొదటి ప్రభుత్వాధినేత అన్న ఖ్యాతిని గడించారు.

    2006 August నెలలో GO MS. No: 21 విడుదల చేసి Rs. 80, 000/- ప్రభుత్వ ధనాన్ని చర్చిల మరమ్మతుల కోసం ఖర్చు చేశారు.Deccan Chronicle తన 2006 August 23నాటి సంచికలో "CM Reddy okays public money for churches" అనే వార్త వేసింది కూడాను.ఇదే ఆజ్ఞలో కొత్త చర్చిలు కట్టుకోవాలనుకునే వారికి ఒక్కో చర్చికీ 1.5 lakhs కేటాయించాలనే ఆదేశం కూడా ఉంది.ప్రభుత్వానికి అవసరమైన నిధుల కోసం సుమారు Rs.20,000 crores విలువ గల 7000 ఎకరాల విస్తీర్ణం ఉన్న హిందూ ఆలయ భూముల్ని అమ్మేశారు.వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడమే కాక కొన్నింటిని పాస్టర్లు ఆక్రమించుకుంటున్నప్పటికీ చూసీ చూడనట్టు ఉండిపోయారు.ఒక్క 2004 నుంచి 2009 మధ్య వేల సంఖ్యలో కొత్త చర్చిలు కట్టేశారు.ప్రతి ఏడుగురు క్రైస్తవులకీ ఒక చర్చి ఉండాలనే లెక్క చొప్పున 1,48,000 చర్చిలు తయారయ్యాయి!మరి, హిందూ ఆలయాలు?ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ అప్పటికి ప్రతి 350 మంది హిందువులకీ ఒక ఆలయం చొప్పున కట్టినట్టు 1,90,000 మాత్రమే ఉన్నాయి.

    ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే తేడా లేకుండా ఈ తరం తెలుగువాళ్ళలోని మేధావులు అందరూ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న religious polarization వల్ల జరగబోయే ప్రమాదాన్నీ తెలంగాణా ఏర్పాటులోని మత ప్రాతిపదికనూ గుర్తించడంలో ఎందుకు విఫలమయ్యారో అర్ధం కావడం లేదు నాకు."2001 నాడు 1.5% ఉన్న క్రైస్తవ జనసంఖ్య అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 నుంచి 12% పెరిగితే పాస్టర్లు 35% పెరిగినట్టు చెప్పుకున్నారు" అనేది తెలిసిన వెంటనే చర్చిల సంఖ్య తెలంగాణ వైపుకన్న ఆంధ్ర వైపునే ఎక్కువున్నాయని గుర్తొచ్చి "హిందువులు ఎక్కువున్న తెలంగాణను విడదీస్తే ఆంధ్రప్రాంతంలోని క్రైస్తవుల సంఖ్య ఆమాంతం రెండింతలు పైకి లేస్తుంది!" అనేది తళుక్కున మెరిసింది నాకు.మరి, ఎన్నికల్లో గెలుపు కోసం కులాల వారీ సీట్లు కేటాయించడం కోసం ఏ ప్రాంతంలో ఏ కులంవాళ్ళు ఎంతమంది ఉన్నారని కాకి లెక్కలు వేసుకుంటున్నవాళ్ళకి ఇది తెలియకపోవడం విచిత్రం కాదూ?

    వాస్తవానికి తెలంగాణ ఏర్పాటుకు దారి తీసిన ఆంధ్రప్రదేశ్ విభజన వెనక ఉన్నది మతపరమైన కారణమే!ఇప్పుడిక ఆంధ్రలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఈశాన్య రాష్ట్రాల మాదిరి మ్యానిఫెస్టోలో బైబిలు రాజ్యం తెస్తామని రాసుకోవాల్సిందే, ప్రస్తుతానికి అది కొంచెం అతి అనిపించినప్పటికీ ఇప్పటికే ఆంధ్రలో పాస్టర్లకు ఇష్టం లేని వ్యక్తి ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి దాపరించిందనేది నిజం - రాష్ట్ర విభజన అన్న ఒకే ఒక దెబ్బకి ఆంధ్ర ప్రాంతంలో నాన్-హిందూ వోటర్ల శాతం 30 నుంచి 40కి పెరిగంది.

    నిజానికి పీడనకి గురయిన కింది కులాలు మతం మారడం వల్ల కాదు, అసలైన ప్రమాదం రాయలసీమలోని భూస్వామ్య కుటుంబాలకి చెందిన రెడ్డి కులస్థులూ కృష్ణా జిల్లాలోని భూస్వామ్య కుటుంబాలైన కమ్మ కులస్థులూ క్రైస్తవాన్నీ కమ్యూనిజాన్నీ ప్రోత్సహించడం వల్లనే కలుగుతున్నది.మొత్తం సమాజం మీద వీళ్ళకున్న ఆర్ధికపరమైన రాజకీయపరమైన అధిపత్యమే హుందువులని ఇంత దయనీయమైన పరిస్థితిలో నిలబెట్టింది.

    గడియారం ముళ్ళు వెనక్కి తిప్పితే కాలం వెనక్కి నడుస్తుందా?గతజలసేతుబంధనం వల్ల సతతహరితవనాలు పెరుగుతాయా!ఇవ్వాళ హిందూమతాన్ని బలోపేతం చెయ్యాలంటే అంతర్యుద్ధం తప్పదు.

    జై శ్రీ రాం!

    రిప్లయితొలగించండి
  3. "పొరబాట్లు జరిగాయి, దిద్దుకోవాలి."
    ఎవరి డబ్బులో ఎవరో వాళ్ళకు తెలిసిన/ఇష్టమైన విధంగా ఇస్తే/దానం చేస్తే మీరు దాన్ని పొరబాటు జరిగినదని చెప్పటం ఏమిటి? మా తాతలు కూడా వారికి తోచిన విధంగా దానాలు చేశారు అవన్నీ తప్పు అంటామా ? అందుకే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇష్టమైన విధంగా పంచినా కూడా సంసారాల్లో గొడవలు !

    రిప్లయితొలగించండి
  4. మరి, 22, సెప్టెంబర్ 2021, బుధవారం నాడు "నా దృష్టిలో హిందూ మతం బలమైన పునాదులపై ఉద్భవించింది. తనని తాను కాపాడుకోగల సామర్ధ్యం, సత్తా ఈ మతానికి ఈనాటికీ పుష్కలంగా వుంది. అందుకు సందేహం లేదు." అని గొప్పలు చెప్పుఇకోవడం దేనికి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను హరి గారు. సీనియర్ జర్నలిస్ట్ మరియు ఏంతో అనుభవమున్న భండారు గారిని విమర్శించడం నాకు ఇష్టం లేదు, కానీ చెప్పక తప్పదు, ఆయన లోతుగా ఆలోచించకుండానే ఆ పోస్ట్ రాశారనిపించింది.

      ఈ దేశంలో హిందూమతం ఇంకా బతికుందంటే కారణం హిందువులు మైనారిటీ కాకపోవడం. పక్కనున్న పాకిస్తాన్ లో చూడండి - ప్రతి ఊళ్ళో, ప్రతి వాడలో గుడులు ఉండేవి. 70 సంవత్సరాలలో అన్నీ నామ రూపాల్లేకుండా పోయాయి. బాంగ్లాదేశ్ లో కూడా ఇదే జరుగుతోంది. మన దేశంలో కాశ్మీర్ లో, ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో కూడా ఇదే జరిగింది.

      తొలగించండి