22, సెప్టెంబర్ 2021, బుధవారం

నేనూ హిందువునే - భండారు శ్రీనివాసరావు

 (హిందూ అనగానే మనువును గుర్తు చేసుకోవద్దు. మనువు పుట్టక ముందే హిందూ మతం వుంది. నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం)

నేను ఆచరించి, పాటించే హిందూ మతం గురించి నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది వేరు. నేనిప్పుడు చూస్తున్నది వేరు.

ఎందరు గజనీలు దండెత్తి వచ్చినా, ఎందరు ఘోరీలు యుద్ధాలు చేసినా హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు కానీ హిందూ మత ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. వందల వేల సంవత్సరాలు విదేశీయుల ఏలుబడిలో వున్నా హిందూ మతం చెక్కుచెదరలేదు. అదీ ఈ మతం గొప్పతనం. అంచేత ఎవరో ఏదో చేస్తారనీ, చేస్తున్నారనీ అనుకోవడంలో సహేతుకత వుందని నేననుకోను.

సాధారణంగా నేను మతపరమైన, కుల పరమైన విషయాలపై వ్యాఖ్యానాలు చేయను. కానీ ఈ నడుమ సాంఘిక మాధ్యమాల్లో ఒకరకమైన మొండి ధోరణి కనబడుతోంది. ఇది మన మత విధానాలకే వ్యతిరేకం. హిందూ మతాన్ని మొండిగా సమర్ధించే వాళ్ళలో కనీసం కొందరు కూడా మతం చెప్పిన దాన్ని పాటించడం లేదు.

సహనావతు అనేది వేదవాక్యం. ఆ సహనం ఇవ్వాళ కనబడడం లేదు. ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారనే దానితో నిమిత్తం లేదు. ఏమి చేసినా ఏమీ కాదు. చరిత్రే ఇందుకు సజీవ సాక్ష్యం.

నా దృష్టిలో హిందూ మతం బలమైన పునాదులపై ఉద్భవించింది. తనని తాను కాపాడుకోగల సామర్ధ్యం, సత్తా ఈ మతానికి ఈనాటికీ పుష్కలంగా వుంది. అందుకు సందేహం లేదు.



4 కామెంట్‌లు:

  1. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం.
    ఈ విషయం అర్ధం చేసుకోకుండా, ఓట్ల కోసం రెచ్చగొట్టే వాళ్ళ మాటలు నమ్మి, మన మతానికి ఏదో అయిపోతోందని సోషల్ మీడియాలో అనవసరమైన మెసేజ్ లు పంచుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు.

    రిప్లయితొలగించండి
  2. "నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం"
    ఎవ్వరూ పాటించని జీవించవలసిన విధానం.

    రిప్లయితొలగించండి
  3. సీనియర్ జర్నలిస్ట్ మరియు ఏంతో అనుభవమున్న భండారు గారిని విమర్శించడం నాకు ఇష్టం లేదు, కానీ చెప్పక తప్పదు, లోతుగా ఆలోచించకుండానే పోస్ట్ రాశారనిపించింది.

    ఈ దేశంలో హిందూమతం ఇంకా బతికుందంటే కారణం హిందువులు మైనారిటీ కాకపోవడం. పక్కనున్న పాకిస్తాన్ లో చూడండి - ప్రతి ఊళ్ళో, ప్రతి వాడలో గుడులు ఉండేవి. 70 సంవత్సరాలలో అన్నీ నామ రూపాల్లేకుండా పోయాయి. బాంగ్లాదేశ్ లో కూడా ఇదే జరుగుతోంది. మన దేశంలో కాశ్మీర్ లో, ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో కూడా ఇదే జరిగింది.

    రిప్లయితొలగించండి
  4. ఆదేశాల్లో హిందూమతాన్ని అణచి నామరూపాలు లేకుండా చేస్తున్నారని మనదేశ మేతావులు నోరెత్తి ప్రశ్నించరు. ఇక్కడ మైనారిటీమతాలవాళ్ళు అన్నిరంగాల్లోనూ ఏవివక్షా లేకుండా ఉన్నారన్నది గమనించనట్లే ఉంటారు. ఎక్కడైనా చెదురుమదురు సంఘటన జరిగీతే చాలు భారతదేశంలో మైనారిటీలపై వివక్షగురించి నానాయాగీ చేస్తారు.

    రిప్లయితొలగించండి