“సేల్ డీడ్ పత్రాలు పోగొట్టిన బ్యాంక్ – రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా కమిషన్ తీర్పు”
ఇది ఈరోజు పత్రికలో వచ్చిన వార్త
ఇప్పుడు ఈ వార్త వెనక కధ చెప్పుకుందాం.
రవి, కళావతి ఇద్దరు వృద్ధ దంపతులు. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి
చేసి పంపారు. ఓ పాతికేళ్ళ క్రితం కాబోలు ఇప్పుడు మేముంటున్న అపార్ట్ మెంటులో ఒక
వాటా కొనుక్కున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో ఇంటి మీద రుణం తీసుకున్నారు. అప్పు
ఇచ్చింది బ్యాంకు ఆఫ్ మైసూరు. తీర్చే టైముకు దాన్ని స్టేట్ బ్యాంకులో
విలీనం చేశారు.
అసలు ఫాయిదాలు కట్టాము కనుక మా ఇంటి పత్రాలు మాకు వాపసు
చేయమని కోరారు. అవి కనబడడం లేదన్నారు బ్యాంకు వాళ్ళు. వున్న ఒక్క ఇంటికీ పత్రాలు
లేకపోతె ఎల్లా అని బ్యాంకు చుట్టూ
తిరిగారు. ఫలితం శూన్యం.
ఎవరో సలహా ఇస్తే ఇంటికి దగ్గరలో వున్న ప్రమోద్ అనే ఒక
లాయర్ను పట్టుకుని వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు.
తీర్పు వీరికి అనుకూలంగా వచ్చింది.
అయితే అసలు కధ ఇక్కడే మొదలయింది.
రెండు రోజుల క్రితం బ్యాంకు వాళ్ళం అంటూ ఎవరో ఫోన్
చేశారు. మీ కాగితాలు దొరికాయి, మీరు బ్యాంకుకు రాయనక్కరలేదు, మేమే వచ్చి ఇస్తాము’ అన్నారు.
వీళ్ళ సంతోషానికి అవధులు లేవు.
అన్నట్టే వచ్చారు. పత్రాలు ఇచ్చారు. ముట్టినట్టు సంతకాలు
చేయించుకుని వెళ్ళిపోయారు.
ఇది జరిగింది నిన్న. అంటే మే ఇరవై మూడున.
ఈరోజు ఈనాడు దినపత్రిక పదమూడో పేజీలో పైన చెప్పిన వార్త
వచ్చింది. వీళ్ళు పడిన మానసిక సంక్షోభానికి
పరిహారంగా అయిదు లక్షలు బ్యాంకు చెల్లించాలని.
వీళ్ళు ప్రతిరోజూ ఈనాడు పత్రిక తెప్పించుకుంటారు. కోవిడ్
బారిన పడినప్పటి నుంచి ఇంటి ముందు దాన్ని కొన్ని గంటలు ఎండలో వుంచి ఆ తరువాత
చదువుతారు. ఆవిధంగా అయిదు లక్షల నష్టపరిహారం వార్త ఆలస్యంగా తెలిసింది.
ఇన్నాళ్ళు కనబడని కాగితాలు నిన్న మొన్నట్లో ఎలా
దొరికాయి. సాధారణంగా బ్యాంకుకు వచ్చి తీసుకువెళ్ళమనే వాళ్ళు ఇంటికే వచ్చి
ముట్టినట్టు ఎందుకు రాయించుకు
వెళ్ళారు.
ఈ ప్రశ్నలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
కొద్దిసేపటి క్రితమే నాకీ సంగతి తెలిసింది. విషయం కనుక్కుందామని
ఈనాడు బ్యూరోలో పెద్ద బాధ్యతలు చూస్తున్న ఉండ్రు నరసింహారావు గారెకి ఫోన్ చేశాను. నా
గురించి ప్రవర చెప్పకుండానే, ఆయన నన్ను
గుర్తుపట్టి విషయం విని మా వాళ్ళ చేత మీకు ఫోన్ చేయిస్తామని చెప్పారు.
కొద్దిసేపటికే ప్రశాంత్ గారు ఫోన్ చేశారు. ఆయన కూడా ప్రశాంతంగా నేను చెప్పింది
విన్నారు.
చూడాలి ఈ కధ ఏ మలుపులు తిరుగుతుందో!
(24-05-2021)
సాధారణంగా అలా జరగకూడదు. బ్యాంకు మారడం, ఆ కారణంగా స్టాఫ్ మారడం, లేదా bank విలీనం తరువాత ఆ బ్రాంచ్ ని వేరే బ్రాంచ్ తో కలిపేసి ఉండడం వగైరా వగైరా కారణాలు ఉండచ్చు. ఏమైనప్పటికీ సుఖాంతం అయ్యింది కదా.
రిప్లయితొలగించండి