14, జనవరి 2021, గురువారం

విప్లవ తపస్వి పీవీ : సమీక్ష (మూడో భాగం)

 


పీవీ గారి మల్లే రచయిత కృష్ణారావు గారికి కూడా తెలుగు భాషపై మంచి పట్టున్న సంగతి ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. అక్కడక్కడా,సందర్భోచితంగా పాత కవుల పద్యాలను ఉటంకించడం ఇందులో కనబడుతుంది.

‘తనపై వచ్చిన ఆరోపణలను పీవీ ఎప్పుడూ పెద్దగా లెక్క చేయలేదు. రాజకీయాల్లో మనకు సరైనది అనిపించినవి న్యాయ వ్యవస్థ సరైనవి అనుకోకపోవచ్చు కదా!’ అనేవారు.

తనకు గుర్తింపు రాకపోయినా తన కర్తవ్యాన్ని నేరవేర్చాలనుకున్నారు.

‘ఏ గతి రచించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!’ అని చేమకూర వెంకట కవి విజయ విలాసంలో అన్న మాటలు ఆయనకు బాగా తెలుసు. ఒక స్తిత ప్రజ్ఞుడిలా తనకు సరైందనిపించినది అమలు చేస్తూ వెళ్ళారు.

“పదవ లోకసభ విశిష్టమైనది. అది ఎన్నాళ్ళో సాగదని అనుకున్నారు. నెలలోపే పడిపోతుందనుకున్నారు. నన్ను మధ్యలో ఖాళీ భర్తీ చేయడం కోసం తాత్కాలికంగా నియమించిన ప్రధాని అన్నారు. కానీ నేను అయిదేళ్ళ పాటు ఆ ఖాళీని పూరించాను. మూడు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కున్నా చెక్కు చెదరకుండా వున్నాను. కనపడని స్నేహితుల వల్ల అది సాధ్యపడింది.” అని పీవీ 1996 మార్చి  12వ తేదీన లోకసభ చివరి రోజున అన్నారని రచయిత రాశారు.

(కనపడని స్నేహితుల వల్ల తన ప్రభుత్వం నిలబడగలిగింది అని పీవీ లోక సభ సాక్షిగా చేసిన ప్రకటన ఆసక్తికరం. కానీ ఆ స్నేహితులు ఎవరన్నది కృష్ణారావు గారు పాఠకుల ఊహకే వదిలేశారు. కనీసం ఈ తరం వారికోసం అయినా కొంచెం వివరంగా రాసివుండాల్సిందేమో!)

జెఎంఎం కేసులో ముడుపులు చెల్లించి ఎంపీలను కొనుగోలు చేశారన్నఅభియోగాలు ఎదుర్కున్నప్పటికీ పీవీపై ఎలాంటి అవినీతి ఆరోపణలు వ్యక్తిగతంగా రాలేదు. ‘నా వరకు మాత్రం నేను డబ్బు ముట్టుకోలేదు. కానీ పార్టీ నడపాలంటే, ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు కావాలి కదా! వాటి బాధ్యతలు వేరొకరికి అప్పచెప్పేవాడిని’ అన్నారు పీవీ ఒకసారి నాతొ. అవిశ్వాస తీర్మానం విషయంలో ఇక ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి నేను ప్రయత్నించలేదని రాశారు రచయిత. (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి