‘‘ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి’ అన్నారు. అంటే ఒక బ్రాహ్మణుడు శాపం ద్వారా కానీ, శరం ద్వారా కానీ యుద్ధం చేయగలుగుతాడు.
అయితే ఈనాటి ఈ వ్యాస ప్రేరకుడు అయిన బ్రాహ్మణుడు యుద్ధాలు చేసేవాడు కాదు, శాపాలు పెట్టేవాడూ కాదు. కేవలం సంభావనల దగ్గర పోట్లాటకు దిగేవాడు. అదీ ఆయన అడిగినంత సంభావన ఇవ్వకపోవడం వల్ల కాదు, మనం ఇచ్చే సంభావన ఆయనకు నచ్చకపోవడం వల్ల.
ఇందులో విశేషం ఏముంది?
చాలా సందర్భాలలో విన్నదే కదా అనుకోవచ్చు. కానీ ఈ పురోహితులవారి తరహానే వేరు. అందుకే ఆయన గురించి రాయాలని అనిపించింది.
వీరి పేరు ఇంగువ వెంకయ్య గారు. మా స్వగ్రామంలో మా ఇంటి పురోహితులు. శుభాశుభ కార్యక్రమాలన్నింటికీ ఆయనే బ్రహ్మ. మా అక్కయ్యల పెళ్ళిళ్ళు, మా పెద్దన్నయ్య పెళ్లి, ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా రెండో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా మూడో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు ఆయనే దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించారు. నా పెళ్లి నేనే చేసుకున్నా కాబట్టి ఆయన గారికి ఛాన్స్ దొరకలేదు. మా ఇంట్లో ఇన్ని పెళ్ళిళ్ళు చేయిస్తూ ఆయన తన పెళ్లి మాట మరచిపోయారేమో అలాగే చివరి వరకు ఘోటక బ్రహ్మచారిగానే వుండిపోయారు.
మనిషి మంచివాడే కానీ ఈయనతో రెండు సమస్యలు. అది వ్రతం కానీ, వడుగు కానీ, ఆబ్దీకం కానీ మొత్తం క్రతువు శాస్త్ర ప్రకారం జరిపించాల్సిందే. తూతూ మంత్రం వ్యవహారం కాదు. పూర్తిగా అంతా పద్దతి ప్రకారం చేయాల్సిందే. గంటలు గంటలు సాగే ఈ తంతు చూస్తూ బీపీలు, సుగర్లు వున్నవాళ్ళకు కళ్ళు తిరిగిపోయేవి. ‘అయ్యా వెంకయ్య గారూ, అందరూ పెద్దవాళ్లు, భోజనానికి ఆగలేరు, కాస్త త్వరగా లాగించండి’ అని మొత్తుకున్నా ఆయన వినిపించుకునే రకం కాదు.
మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి కొడుకు పెళ్ళి హైదరాబాదులో జరిగితే ఆయనే వచ్చి చేయించారు. వడుగు ముందు ఇంట్లో చేసుకుని తర్వాత కళ్యాణ మంటపానికి వెళ్ళాలి. వెంకయ్య గారు తెల్లవారుఝామునే వడుగు కార్యక్రమం మొదలెట్టారు. బారెడు పొద్దెక్కినా వడుగు తంతు సాగుతూనే వుంది. అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. కానీ వడుగు ఓ పట్టాన తెమిలేలా లేదు. సాధారణంగా సంయమనం కోల్పోని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఇక ఉండబట్టలేక ‘వెంకయ్యగారు మీరు ఇక్కడ వడుగు చేస్తూనే వుండండి, ఈలోపల మేము వెళ్లి ఆ పెళ్లి పని ముగించుకుని వస్తాం’ అనేసారు.
ఇక సంభావన దగ్గరికి వచ్చేసరికి వస్తుంది అసలు తంటా. ఇక్ష్వాకుల కాలం నాటి రేట్ల ప్రకారం పదో పరకో చాలనే తత్వం ఆయనది. (ఈ కధాకాలం ముప్పయ్యేళ్ళ నాటిది) తమతమ విభవానికి తగ్గట్టు ఎవరైనా వేయి నూట పదహార్లు ఇవ్వబోయినా ఆయన తీసుకోరు. తను తీసుకునే నూట పదహారు రూపాయలు లెక్కకట్టి తీసుకుని మిగిలిన డబ్బు గృహస్తుకు ఇచ్చేసి వెడతారు. కాదుకూడదు అంటే వస్తుంది తంటా. చూసేవారికి ఆయన అడిగినంత వీళ్ళు ఇవ్వడం లేదేమో, అందుకే పొట్టు పొట్టవుతున్నారు అని అపోహ పడే ప్రమాదం కూడా వుంది.
‘వెంకయ్య గారికి సంభావన ఇచ్చే వేళయింది. అందరూ లేచి అడ్డంగా నిలబడండి, ఆయనగారు సంభావన తీసుకోకుండా వెళ్ళిపోతారేమో” అని మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గారు అంటుండేవారు హాస్యోక్తిగా.
మా రెండో అన్నయ్య కుమారుడి పెళ్ళిలో సంభావన కింద మా అన్నగారు ఐదువేల నూట పదహార్లు ఇద్దామనుకుని కూడా వెంకయ్య గారితో తంటా ఎందుకని వేయి నూటపదహార్లు తాంబూలంలో పెట్టి ఇచ్చారు. ఆయన అది చూసి నాకు నూట పదహార్లు చాలు అని మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వబోయారు. ‘మా తృప్తి కొద్దీ ఇస్తున్నాం. కాదనకండి’ అని మా అన్నయ్య ఆయనకు నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తే వెంకయ్య గారు ఇలా అన్నారు. ‘లడ్డూలు రుచిగా వున్నాయని ఐదో ఆరో తినం కదా! సంభావన కూడా అంతే. నేనెంత తీసుకోవాలో అంతే తీసుకుంటాను’ ఇదీ ఆయన వరస.
గోదానాల వల్ల లభించిన ఆవులతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ వుండేది మా చిన్నప్పుడు. వాటిని మేపే శక్తిలేని వెంకయ్య గారి ఇంట ఆ కళకళలు ఎన్నాళ్ళు వుంటాయి. వాటిని అమ్మేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. వాటిని పుష్టిగా మేపడానికి ఆదాయం సరిపోదు. అయినా సరే వెంకయ్య గారు తను నమ్మిన సిద్దాంతానికే జీవితాంతం కట్టుబడే వున్నారు. తన సంపాదనలో కొంత ఆవుల మేతకు ఖర్చు చేసేవారు. నోట్ల రూపంలో వచ్చే సంభావనలు మినహాయిస్తే నాణాలుగా వచ్చిన వాటిని ఖర్చుచేయడం వారి ఇంటా వంటా లేదు. చిల్లర డబ్బుల రూపంలో వచ్చిన సంభావనలు అన్నీ ఓ రేకు డబ్బాలో పడేసేవారు. వేయి రూపాయలుకు సరిపడా చిల్లర పైసలు ఆయన దగ్గర దొరుకుతాయని వూళ్ళో చెప్పుకుకుని నవ్వుకునేవారు. (15-12-2020)
(కింది ఫోటో: 1985లో మా పెద్దన్నయ్య పెద్ద కుమారుడు రఘు వివాహం, తర్వాత వ్రతం చేయిస్తున్న వెంకయ్య గారు)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅది వెంకయ్య గారి సంస్కారం. ముక్కు పిండి వసూలు చేస్తున్న ఈ కాలంలో వెంకయ్య గారి లాంటి వారు అరుదు. కానీ ఎవరి బలవంతం లేకుండా గృహస్తు సంతోషంగా ఇస్తున్న దాన్ని వెంకయ్య గారైనా వద్దనక్కరలేదేమో?
రిప్లయితొలగించండిఫొటోలో చూస్తే వెంకయ్య గారు మీ సోదరులలో కొందరికయినా సమవయస్కుడు అయ్యుండవచ్చని తోస్తోంది.
మా వైపు కుటుంబాలలో కూడా అటువంటి పురోహితుడు ఒకాయన ఉండేవారు. మా నాన్నగారి సమవయస్కుడు, స్నేహితుడున్నూ. మా తండ్రి గారి వివాహంలో కూడా పెద్దపురోహితుల పక్కన కూర్చున్నారట. అలాగే మా మాతామహుల కుటుంబంలోని ఆస్ధాన పురోహితుడు మా ఒక మేనమామ గారి సమవయస్కుడు, కొంతకాలం ఎలెమెంటరీ స్కూల్ వరకు సహవిద్యార్ధిట. మా మేనమామల ఇళ్ళల్లో (ఏ వూరైనా కూడా వచ్చి) పౌరోహిత్యం ఆయనే చేశారు చివరి వరకూ.
మహానుభావులు 🙏.