కరోనా కారణంగా చనిపోయిన వారి భౌతిక శరీరాలను ముట్టుకోవడానికి కూడా జనం భయపడుతున్నారనే అర్ధరహిత వదంతులను నమ్మి కొందరు వాటికి అంతిమ సంస్కారాలు జరపడానికి సంకోచిస్తున్నారనే బాధాకరమైన వార్తలు వినవస్తున్నాయి. అనాధ ప్రేత సంస్కారానికి మించిన పుణ్య కార్యం మరోటి ఉండదంటారు. కానీ కరోనా భయానికి సొంత మనుషులు కూడా వెనుకాడుతుండడం విచారకరం. ఈ నేపధ్యంలో ఒక సూచన,
ఈరోజు పత్రికల్లో ఒక వార్త చదివాను. కరోనా పేషెంట్లను తరలించడానికి ఆరు అంబులెన్సులు విరాళంగా ఇస్తామని తెలంగాణా మంత్రి శ్రీ కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. దాన్ని స్పూర్తిగా తీసుకుని మరికొందరు కూడా అంబులెన్సులు సమకూరుస్తామని వాగ్దానం చేసినట్టు ఆ వార్తలు తెలుపుతున్నాయి. చాలా హర్షదాయకం.
గతంలో కేటీఆర్ మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ‘నేను ఒక మొక్కను నాటాను, మీరూ నాటండి’ అనే ఛాలెంజ్ విసిరిన తరహాలోనే, వేరే ఎవరైనా సెలెబ్రిటీ (ఎందుకంటే ఇటువంటివి త్వరగా జనంలోకి వెళ్ళాలి అంటే వారివల్లే సాధ్యం) ముందుకువచ్చి, ‘ఒక కరోనా మృతుడి కుటుంబానికి ఇరవై పీ.పీ.ఈ. కిట్లు ( Personal Protection Equipment Kits) ఇస్తాను, మీరూ ఇవ్వండి’ అనే పోటీ మొదలుపెడితే బాగుంటుంది. (ఇరవై మంది సమీప బంధువులు మాత్రమే అంత్యక్రియలకి హాజరు కావడానికి వీలుంది) ఈ కిట్లు ప్రస్తుతం ఒక్కొక్కటి అయిదు వందలకంటే తక్కువకే మార్కెట్లో లభిస్తున్నాయని నాకు తెలిసిన సమాచారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి