24, జూన్ 2020, బుధవారం

ఇందిరాగాంధీకి తన మరణం గురించి ముందుగా తెలుసా!

హిందూ రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన సీనియర్ పాత్రికేయుడు దాసు కేశవరావుగారు రాత్రి  ఫోను చేసారు. ఆయన గుర్తు చేసిన దాకా నాకు జూన్ 23  సంజయ్ గాంధి విమాన ప్రమాదంలో మరణించిన రోజని జ్ఞాపకం రాలేదు. నిజానికి దాన్ని ప్రమాదం అనడం కంటే స్వయంకృతాపరాధం అనడం సరి ఏమో! ఎందుకంటే విమానాలు నడపడంలో సంజయ్ కి ఆసక్తి ఉన్న మాట నిజమే కానీ ప్రావీణ్యం లేదు. ఇందుకు సాక్ష్యం ఆయన భార్య మనేకా గాంధి. ఆ దుర్ఘటన జరగడానికి ఒక్క రోజు ముందు సంజయ్ ఆమెను వెంట తీసుకుని ఆ చిన్ని విమానంలో చక్కర్లు కొట్టారు. సంజయ్ విమానం నడుపుతున్న తీరు గమనించిన మనేకా గాంధి ఆ క్షణంలో భయంతో తల్లడిల్లిపోయారు. ఇంటికి రాగానే ఆమె ఇందిరాగాందీతో ఆ విషయం చెప్పారు. ‘దయచేసి మీ అబ్బాయికి చెప్పండి, విమానాలు నడపొద్దని. ఒకవేళ నడిపినా నన్ను తీసుకువెళ్ళిన ఆ చిన్న విమానాన్ని అసలు నడపొద్దని”.

మరునాడే సంజయ్ అదే విమానం నడిపి, అది కూలిపోవడంతో మరణించారు.

ఈ విషయాన్ని మనేకా గాంధి, సంజయ్ అకాల మరణం తర్వాత   టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.     

శ్రీమతి ఇందిరాగాంధీ ఆంతరంగికుడు పోతేదార్ రాసిన ఆత్మకధలో మరో విషయం  వెల్లడించారు.
భారత దేశపు తొలి మహిళా ప్రధాని శ్రీమతి గాంధి, 1984, అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీలో తన అధికార నివాసం ప్రాంగణంలోనే అంగరక్షకుల తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి కొద్ది రోజులముందుగానే తన తుది ఘడియలు దగ్గర పడుతున్నాయని ఆవిడకు తెలిసి వచ్చింది. దీనికి కారణం ఆవిడకు ఒక గుళ్ళో కనబడిన ఓ అపశకునం. హత్య జరిగిన అక్టోబర్ మాసంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ చాలా మనసుపడి కాశ్మీర్ పర్యటన పెట్టుకున్నారు. కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం అంటే ఆవిడ తెగ ముచ్చట పడేవారు. అంతేకాదు, కాశ్మీర్ లోయలోని ఒక హిందూ దేవాలయాన్ని, అలాగే ముస్లింల ప్రార్ధనా మందిరం అయిన ఒక ప్రముఖ మసీదును సందర్శించాలన్న కోరికతో కూడా ఆమె ఆ పర్యటనకు బయలుదేరివెళ్ళారు. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక అపశకునం కనబడింది. అది చూడగానే తన రోజులు దగ్గర పడ్డాయని ఆమెకు  తోచింది. ఆ సమయంలోనే ప్రియాంకా గాంధి తన రాజకీయ వారసురాలయితే బాగుంటుంది అని కూడా ఆమెకు అనిపించింది. కాకతాళీయం కావచ్చు కానీ, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆవిడ హఠాత్ మరణానికి గురయ్యారు. ప్రియాంక రాజకీయ వారసత్వం గురించి శ్రీమతి గాంధీ మనసులోని ఈ మాటను తదనంతర కాలంలో సోనియా గాంధి చెవిలో వేసినా, ఆవిడ దానికి ఇష్టపడలేదు.” (శ్రీమతి ఇందిరాగాంధీ మరణించే నాటికి ప్రియాంక గాంధి వయస్సు కేవలం పన్నెండేళ్ళే. మరి రాజకీయ వారసత్వం గురించిన ఆలోచన ఎలా వచ్చిందో!)


2 కామెంట్‌లు:

  1. జూన్ 23 సంజయ్ గాంధి విమాన ప్రమాదంలో మరణించిన రోజని జ్ఞాపకం రాలేదు. - అదేమైనా జాతీయ పండుగ దిన మా గుర్తు పెట్టుకొనీకి.

    ఏమి అపశకునం కనపడింది.

    రిప్లయితొలగించండి