27, ఏప్రిల్ 2020, సోమవారం

ప్రాయంలో అడుగిడుతున్న ప్రాంతీయ పార్టీ

(టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితం)

పందొమ్మిదేళ్ళ క్రితం 2001లో తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అయినప్పుడు తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కూడా అనేకమంది మెటికలు విరిచారు. గతంలో  తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో పుట్టిన పలు రాజకీయ పార్టీల గాటనే  టీఆర్ఎస్ పార్టీని కూడా కట్టి, ఆ పార్టీ భవిష్యత్తుపై  నైరాశ్యంతో  కూడిన ప్రకటనలు చేసారు. అయితే ఇటువంటి అనేకానేక  ఊహాగానాలను, అన్నిరకాల బాలారిష్టాలను అధిగమించి తెలంగాణా ప్రజానీకం పరచిన వెచ్చటి పొత్తిళ్ళలో ఈ పచ్చటి పసికూన పెరిగి పెద్దదయి ఇరవై ఏట అడుగు పెట్టింది.
సహజమైన బాలారిష్టాలను తట్టుకుని నిలబడ్డం వేరు, కావాలని పసికందును పసిగుడ్డుగానే చిదిమి వేయాలనే దుష్ట పన్నాగాలు వేరు. భాగవతంలో చిన్ని కృష్ణుడిని మట్టుబెట్టడానికి కంసాదిదానవులు అనేకవిధాలుగా ప్రయత్నాలు చేసినట్టు టీఆర్ఎస్ పార్టీని కూడా ఆదిలోనే అంతం చేయడానికి అన్ని రకాల రాజకీయ కుట్రలు జరిగాయి. కుట్రదారుల  ఉద్దేశ్యం ఒక్కటే. తెలంగాణా అనే భావన తెలంగాణా ప్రజల్లో లేదని, అది కొందరు అవకాశవాద లేదా నిరుద్యోగ రాజకీయ నాయకుల దుష్టపు ఆలోచన అని రుజువు చేసి, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని శాశ్వతంగా సమాధి చేయడం. ఇక ముందు ముందు ఎవరి నోటా ఆ మాట వినిపించకుండా చేయడం.
అయితే ఈసారి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదిన టీఆర్ఎస్ పార్టీకి కర్తా, కర్మా, క్రియా అయిన నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావడం వల్ల ఆ ప్రయత్నాలన్నీ  నిరర్ధకం అయిపోయాయి. కడకంటా కాడిని కింద పడవేయకుండా శ్రీ కేసీఆర్ తనదైన శైలిలో విలక్షణ౦గా ఉద్యమాన్ని నడుపుకు రావడంతో ఆ ఎత్తులన్నీ చిత్తయిపోయాయి. పుష్కరకాలానికి పైగా సాగిన ఈ మహోద్యమం వాడి, వేడి ఎక్కడా, ఎప్పుడూ, ఏమాత్రం  తగ్గకుండా చూడడానికి, దారితప్పకుండా కనిపెట్టి చూడడానికి  ఆయన ఎన్నో రకాల శ్రమదమాదులకు గురికావాల్సి వచ్చింది. అటు కేంద్రాన్ని,  ఇటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ  పార్టీలను రాజకీయంగా ఏకకాలంలో ఎదుర్కుంటూ, ఉద్యమదీప్తి కొడిగట్టకుండా చూడడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇతరేతర రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ, తెలంగాణా ఉద్యమాన్ని దారితప్పించాలని ప్రయత్నించే ‘విభీషణులను’ సయితం నిలువరించాల్సిన పరిస్తితి. అటువంటి వారి కారణంగా ఉద్యమంపై నీలినీడలు కమ్ముకుంటున్నప్పుడు లక్ష్యసాధన కోసం గొంగళి పురుగులను సయితం  ముద్దాడ వలసిన దుస్తితి.  వెలుగుతున్న పెట్రోమాక్స్ లైట్ లో వెలుగు తగ్గి, వత్తి ఎర్రబడుతున్నప్పుడల్లా,  పంపుతో గాలికొట్టి మళ్ళీ వత్తిని తెల్లగా  ప్రకాశవంతం చేసినట్టు, ఉద్యమకాలంలో కేసీఆర్ తన వ్యూహాలను, ఎత్తుగడలను  తాజా రాజకీయ పరిణామాలకు, పర్యవసానాలకు  తగినట్టుగా మార్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఆకాంక్ష ప్రజల్లో సజీవంగా వుండిపోయేట్టు చేయగలిగారు.  అందుకు ప్రధానంగా తోడ్పడ్డది అనర్ఘలమైన ఆయన ప్రసంగనైపుణ్యం ఒకటి కాగా, తెలంగాణా పట్ల ఆయనకు ఉన్న పరిపూర్ణమైన అవగాహన మరొకటి. ఆకాంక్ష నెరవేరి, తెలంగాణా స్వప్నం సాకారమై  ప్రత్యేక రాష్ట్రంగా  ఏర్పడ్డప్పుడు దాన్ని బంగారు తెలంగాణాగా రూపొందించడానికి ‘ఏమిచేయాలి, ఎలా చేయాలి’ అనే విషయంలో ఆయన కన్న కలలు, వాటిని సాకారం చేసుకోవడానికి రూపొందించుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాలికలు అన్నీఇన్నీ కావు.  ఇలా బహుముఖంగా ఆలోచించి చేసిన ప్రయత్నాలు కాబట్టే, పార్టీపరంగా చేపట్టిన  రాజకీయ ఉద్యమానికి ఇవన్నీ అవసరమైన ఊతాన్నీ, ఉత్తేజాన్నీ  ఇవ్వగలిగాయి. తెలంగాణా స్వప్నాన్ని సాకారం చేయగలిగాయి.
తెలంగాణా పురపాలక,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసీఆర్  లాగే చక్కని మాటకారి.  గతంలో ఒకసారి హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, ‘కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించింద’ని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమానాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటి  మీద రాత కాకుండా  రాతి మీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం.
తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఒక్క అనుమానం కూడా నిజం కాలేదు. సందేహాస్పదులు కోరుకున్నది జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా వచ్చి పడ్డ కరోనా లాక్  డౌన్ ఎండాకాలంలో కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న,  కేసీఆర్ సాధించిన ‘అద్భుతం’ ఇది.
అయితే, తెలంగాణా సాధన ఒక ఎత్తయితే, సాధించిన దానిని సమర్ధవంతంగా అనుకున్న రీతిలో మలచడం మరో ఎత్తు.
దీనికి  ప్రత్యక్ష సాక్ష్యం తెలంగాణాలో అనేక ప్రాంతాలలో గలగలా పారుతున్న గోదావరి నీళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు కనుబొమలు ముడిచినవాళ్ళే, ఇప్పుడు ఉప్పొంగి ఉరకలు పెడుతూ పరుగులు తీస్తున్న గోదావరమ్మను కళ్ళార్పకుండా చూస్తూ మురిసిపోతున్నారు.
టీఆర్ఎస్ ఇన్నేళ్ళ ప్రస్థానంలో అధికార పగ్గాలు అందుకోవడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. గతంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్న రాజకీయ పార్టీలు ప్రజలు అందించిన అధికారాన్ని నిలబెట్టుకోలేక చతికిలపడ్డ వైనాలు తెలుసు. కానీ తెలంగాణా రాష్ట్ర సమితి దీనికి మినహాయింపు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడ్డ తర్వాత రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి కంటే ఎక్కువ స్థానాలు కట్టబెట్టి టీఆర్ఎస్ నాయకత్వం పట్ల ప్రజలు తమకున్న నమ్మకాన్ని మరోసారి నిరూపించి చూపారు.
మరోసారి అధికార పీఠం అధిరోహించిన కేసీఆర్ తనదైన పద్దతిలో ముందుకు వెడుతున్న తరుణంలో కరోనా వైరస్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు పెనుసవాలుగా మారింది. అయినా ప్రజల ప్రాణాలు ముఖ్యం అనుకున్న ప్రభుత్వం, దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ముందుగానే స్పందించి లాక్ డౌన్ వ్యవధిని పొడిగించింది. కరోనాని కట్టడి చేయడానికి తెలంగాణా  ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను, చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ప్రశంసించారు.
ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గతంలో మాదిరిగా ఘనంగా జరుపుకోలేని పరిస్తితి.
అయితే, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో గలగలా పారుతున్న గోదావరి జలాల్లోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఆనందాలను తిలకించే అవకాశం ఈసారి లభించింది.   

4 కామెంట్‌లు:

  1. సమైక్య ఆంధ్రలో 67 ఏళ్లలో చేయలేని అభివృద్ధి పథకాలు 6 సంవత్సరాలలో కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలో చేయగలిగారు అన్నది నిండు నిజం.

    ఈ రోజున తెలంగాణా ధాన్యాగారం గా మారుతుంది. వ్యవసాయానికి రైతుకు పెద్ద పీట వేసే చోట సౌభాగ్యం ఉంటుంది. వ్యవసాయ ఆధారిత దేశం మనది.

    బంగారు పంటలు పండే భూములను నిర్వీర్యం చేసి వందల అంతస్తుల భవనాలు కట్టి తిండిగింజలు కరువైతే ఏమి ఉపయోగం.

    కేసీఆర్ కేటీఆర్ హరీశ్ రావు ప్రణాళికా బద్ధమైన పాలన వారి దక్షత వల్ల తెలంగాణా గొప్ప అభివృద్ది జరుగుతుంది.

    రిప్లయితొలగించండి
  2. @ Jai gottimukkala: మీరు చెప్పింది నిజం. రెండుసార్లు రిపీట్ అయింది. పోస్ట్ చేయడంలో జరిగిన సాకేతిక లోపం. అయినా క్షంతవ్యుణ్ణి. పొరబాటు ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. స్వర్గవాసి ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయుల దశానిర్దేశనలో మహోన్నత తెలంగాణా ఉద్యమంలో పని చేసే అదృష్టం దక్కడం కెసిఆర్ పూర్వజన్మ సుకృతం. రాష్ట్ర సాధన జనబలంతోనే సాధ్యం అయిందని & ప్రజలే చరిత్రకర్తలు అన్న వాస్తవాలను మాత్రం ఏనాడూ మరవొద్దు.

    పార్టీలు, పదవులు వస్తాయి, పోతాయి కూడా. తెలంగాణా ప్రయోజనాలు & ప్రజా ఆకాంక్షల అనుగుణంగా పని చేస్తూ ఉండమని సలహా (హెచ్చరిక అనుకున్నా ఫరవాలేదు).

    రిప్లయితొలగించండి