26, ఏప్రిల్ 2020, ఆదివారం

యాదమ్మ సొంతిల్లు


ఈ కరోనా గొడవ లేకపోతె తప్పక వెళ్ళాల్సిన శుభ కార్యం.
యాదమ్మ పిల్లలు కొత్త ఇల్లు కట్టుకుని ఆ ఇంటి ఫోటోలు వాట్సప్ లో పంపారు. లాక్ డౌన్ కారణంగా ఫంక్షన్ ఏమీ చేయడం లేదని, మీ ఆశీస్సులు కావాలని కోరారు. అంతటితో అయితే ఈ పోస్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఏనాడో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఈనాడు, ఇల్లు కట్టుకున్నామని, అసలీ ఇల్లు అమ్మ (మా ఆవిడ) పట్టు పట్టి కట్టేదాకా ఊరుకోలేదని, కానీ ఇది పూర్తయిన తర్వాత చూడడానికి అమ్మలేదని వాళ్ళు బాధ పడ్డారు. 



ఈ యాదమ్మ ఎవరంటే....
199
1 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో అద్దెకు  ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. అద్దె పద్దెనిమిది వందలు. మా నలుగురి కోసం కాకపోయినా, రష్యా నుంచి ఓడలో  వచ్చే సామాను కోసం అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో కాపురం ఉంటున్న యాదమ్మ మా ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం. ఆ దంపతులకు అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ, తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో మేము అనేక ఇళ్ళు మారుతూ వచ్చినా, ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. సందీప్ ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్నాడు. అతడికి ఓ  ఏడాది తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది. అతడే వాళ్ళింట్లో కంప్యూటర్ మాస్టర్. అతడే ఇంటి ఫోటోలు పంపాడు.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్ లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు.
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
నువ్వేం చేస్తున్నావని తిరుమలమ్మను అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్. ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను అనేది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి