5, నవంబర్ 2019, మంగళవారం

రేడియో రోజులు – 7 - భండారు శ్రీనివాస రావు

(Published in SURYA telugu daily on 05-11-2019, Tuesday)

ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.
ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి, ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది!  మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి,  ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే,  విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.  ఇందుకు నేనూ మినహాయింపు కాదని చెప్పడానికే.
అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి, విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా  నవ్వుతూ  ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.
`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో,  ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.
ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.
శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్‌ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు.
 ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల, అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన, అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్‌ సింగ్‌' అన్న విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.
ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా.
నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగలసెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని కాసేపు తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?
భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్‌ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!

(ఇంకా వుంది)

2 కామెంట్‌లు:



  1. - సమాచారాన్ని కాసేపు తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?

    Per contra ఇప్పుడొచ్చే టూ మచ్ ఓపెన్‌ న్యూస్ తో జనాలు అడ్జస్ట్ అయిపోయి నిర్వీర్యులై పోయి‌ ఓన్లీ ఫార్వాడ్ ఇ‌న్‌ సోషియల్ మీడియా లెవల్‌ కి‌ వచ్చేసి నట్టున్నారు ఏమే ఏ మెసేజి నిజమో ఏది కాదో తెలియని పరేషాన్ పరిపక్వత తో.



    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. యాదగిరి అని హెలికాప్టర్ కు పేరు పెట్టినవారిని అభినందించాలి.
    అంజయ్య జంబో మంత్రివర్గం ఆక్షేపనీయమే.
    కాంగ్రెస్ లో ఎన్ని లోపాలున్నా, సంజీవయ్య, అంజయ్య, పీవీ, రోశయ్య .. వీరు ఇతర పార్టీలలో ఉంటే ముఖ్యమంత్రులు అయ్యేవారు కాదేమో.
    జనహితం గురించి ఈ రోజుల్లో మీడియా ఆలోచించడం అసంభవం.

    రిప్లయితొలగించండి