22, ఆగస్టు 2019, గురువారం

A honest Confession Of A Husband


‘ఇంతగా ప్రేమించారు. చాలా గొప్ప విషయం’ అంటూ మితృలు కొనియాడుతున్నారు. ఇది కలలో కూడా నేను అంగీకరించను. ఒకవేళ నేను అలా గొప్పలు చెప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే.
మా ఆవిడ స్నేహితురాలు శ్రీమతి వనం గీత ఎప్పుడూ అంటుండేది. ‘నువ్వు మీ ఆయన్ని బాగా గారాబం చేసి చెడగొడుతున్నావు. అందరికీ మొగుళ్ళు లేరా! అందరూ ఇలానే మాలిమి  చేస్తున్నారా! నీకు ఒంట్లో బాగా లేకపోయినా నువ్వే కాఫీ కలిపి ఆయనకు ఇవ్వాలా! వంటింట్లోకి పోయి ఓ కప్పు కాఫీ కలుపుకుని తాగలేరా, మరీ విడ్డూరం కాకపొతే!’
అవును. గీత గారు చెప్పింది అక్షరాలా నిజం. నన్ను చెడగొట్టి ఎందుకూ పనికిరాని ఓ మొగుడ్ని చేసింది. స్టవ్ అంటించడం కూడా రాని మొగుళ్ళ జాబితాలో చేర్చేసింది. సిగ్గు లేకుండా చెబుతున్నాను. నా బనీను సైజు కూడా నాకు తెలియదు. పొరబాటున ఏదైనా వూరు వెళ్లినప్పుడో, స్నేహితులు షాపింగ్ చేస్తున్నప్పుడు కొనుక్కున్నానా ఇక అంతే! లొడుంగు బుడుంగు. ప్యాంటు పైకి లాక్కుంటూ తిరుగుతుంటే తనే తీసుకువెళ్ళి వాటిని ఆల్టర్ చేయించేది.
ఇంటికి ఎవరు  వచ్చినా ‘ఇదిగో ఎక్కడున్నావ్? రెండు కాఫీలు ఇస్తావా?’ అని కేక పెట్టి అడిగే పనే లేదు. వచ్చిన సమయాన్ని బట్టి, వాళ్ళు ఎవ్వరయినా సరే!  కాఫీలో, టిఫిన్లో, భోజనాలో కనుక్కుని పెట్టేది. ఇన్నేళ్ళుగా ఆమె నిరంతరంగా చేస్తున్న  సేవలను నేను ఎన్నడూ గుర్తించలేదు. ఓ మంచి మాట తనతో అన్నదీ లేదు. అందరూ అన్నపూర్ణ తల్లి అంటుంటే గర్వంగా ఫీలయ్యేవాడిని. పైగా అలా చేయడం ఆమె బాధ్యత అనుకునేవాడిని.
నేను పొద్దున్నే టీవీ షోలకు వెళ్ళాలి అంటే ఆ పాట్లేవో తనే పడేది. నాకంటే ముందే లేచి కార్న్ ఫ్లేక్స్ తయారు చేసి తినిపించి  బీపీ మాత్తర్లు ఇచ్చి పంపేది. డాక్టర్ రాసిచ్చిన ఆ మాత్ర పేరేమిటో నాకిప్పటికీ తెలవదు.
ఒక్కోసారి ‘వుండండుండండి! ఆ టీవీ వాళ్లకు ఈ చొక్కా రంగు పడదు. తీరా పోయిన తర్వాత గ్రీన్ మ్యాటో, బ్లూ మ్యాటో అని వేరే ఎవరి చొక్కానో  తగిలిస్తారు. ముందే మార్చుకుని వెళ్ళండి’ అంటూ జాగ్రత్తలు చెబుతుంది.
అలా  అన్నీ ఆమే నాకు అమర్చి పెట్టేది.  కంటికి రెప్పలా కనుక్కుంటూ వుండేది. ఇంట్లో నేనొక మహారాజుని. ఆవిడ జీతం భత్యం లేని మహామంత్రి. నన్నలా మురిపెంగా, మన్ననగా, లాలనగా  చూసుకుని, నా కళ్ళముందే  అలా దాటిపోయింది.
ఇప్పుడు అర్ధం అయివుంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్!  ఆమెను పోగొట్టుకుని  కాదు, నేను ఇంతగా బాధ పడుతోంది. ఇలా చేసే మనిషి లేకుండా ఎలా బతకాలి దేవుడా అనే స్వార్ధం నా చేత ఇలా రాయిస్తోంది. కాబట్టి స్నేహితురాలా! నిలువెల్లా స్వార్ధం నిండిన ఈ వ్యక్తికి ఊరడింపు వాక్యాలు, హిత వచనాలు పలికి మీ మంచితనాన్ని వృధా చేసుకోకండి ప్లీజ్!

4 కామెంట్‌లు:

  1. శ్రీనివాసరావు గారు, మీ తరందాకా ఇవ్వటం ద్వారానే సంతోషాన్ని పొందొచ్చు అని నమ్మిన వాళ్ళు ఎక్కువ. ముఖ్యంగా ఇంటి పట్టున ఉన్న స్త్రీలు. మీ శ్రీమతిగారు ఆ ఆదర్శన్ని పుణికి పుచ్చుకున్నారు. మీకు తోడుండంలో సంతోషాన్ని పొందారు. అందుకని మిమ్మల్ని నిందించుకోవడం తగదు. ఆమాటకొస్తే భార్యకి తోడుండంలో తెలుగుమగవాళ్ళు తొంభైఐదు శాతం వెనుకబడే ఉంటారని నా నమ్మకం. ఆవిడకి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి

  2. భండారు వారికి

    Take care of yourself.

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. పుణ్యాత్మురాలు గారి ఆత్మ శాంతి చేకూరాలి.

    రిప్లయితొలగించండి