9, మే 2018, బుధవారం

ఇలా గుర్తుకు వస్తుంటాయి – భండారు శ్రీనివాసరావు


దాదాపు పుష్కరం దాటింది అనుకుంటా డాక్టర్ రంగారావు గారికి ఈ ఆలోచన వచ్చి. అప్పటికే ఆయన రూపకల్పన చేసిన 108, 104 సర్వీసులు ఉమ్మడి రాష్ట్రంలో కుదురుకుంటున్నాయి. గత నెలలోనే ఆయన మరణించారు. కనుక  ఆయన మదిలో కదిలిన ఆ కొత్త ఆలోచనను ఎవరు ముందుకు తీసుకు పోతారో తెలియదు. ఈ గతం గుర్తుకు రావడానికికల  వర్తమానం గురించి చెప్పాలి.
నిన్న మమ్మల్ని ఒక సమస్య ఎదుర్కుంది. నిజానికి చాలా చిన్న సమస్య. కానీ పరిష్కారం వెనువెంటనే కనబడక పోవడంతో అది క్షణక్షణానికి పెరిగి పెద్దదయింది.
ముందే చెప్పినట్టు పెద్ద సమస్యేమీ కాదు. ఇంట్లో కరెంటు పోయింది. ‘ఇంట్లో’ అని ఎందుకు అంటున్నాను అంటే అపార్ట్ మెంట్లో వుంది. మా ఫ్లాట్ లోనే పోయింది. పోయిందా అంటే పూర్తిగా పోలేదు. ‘వస్తావు పోతావు నాకోసం’ అన్నట్టు ఒక క్షణం పోతుంది. మరు నిమిషం వస్తుంది. ఇలా దాగుడుమూతలు ఆడే కరెంటుతో, ఆ కరెంటుతో నడిచే ఉపకరణాలకు నష్టమని పూర్తిగా మెయిన్ ఆఫ్ చేసి చెమటలు కక్కుతూ నేనూ మా ఆవిడా అవస్థ పడుతూ పరిష్కారం ఎలా అని ఆలోచించాము. ఈ మధ్య కరెంటు అవస్థలు లేకపోవడంతో ఆపద్ధర్మ లైట్లు, కొవ్వొత్తులు ఇంట్లో కనబడకుండా పోయాయి. ఏ ఎలక్ట్రీషియన్ కు ఫోను చేసినా బిజీ బిజీ. ఎవ్వరూ దొరకలేదు. ఈ వచ్చీ రాని కరెంటుతో రాత్రి గడపడం యెట్లా అనుకుంటూ వుంటే మా వాచ్ మన్ ఎవరో ఇద్దర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు మా పక్క అపార్ట్ మెంట్లో మొన్నీ మధ్యనే దిగారట. ఏదో కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్లకి ఆ ఇల్లు మా వాచ్ మనే కుదిర్చిపెట్టాడుట. ఆ పరిచయంతో వాళ్ళని రాత్రి పదిగంటలకు వెంట బెట్టుకు వచ్చాడు. ఆ ఇద్దరు కాసేపు చూసి ఏం మాయ చేసారో కాని, మా ఇన్వర్టర్ లో ఒక లోపాన్ని పసికట్టారు. దాన్ని సరిచేసి ఇంట్లో వెలుగు నింపారు.
మా సమస్య తీరింది కానీ మరో సమస్య. చూడబోతే వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళలా వున్నారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వడం అంటే చిన్నబుచ్చినట్టు అవుతుందేమో. ఇవ్వకుండా ఉత్త చేతులతో పంపడం ఎలా!
చివరికి మా ఆవిడే కల్పించుకుని మాకు నిన్ననే ఎవరో ఇచ్చిన ఖరీదైన పళ్ళ బుట్టను వాళ్ళ చేతుల్లో పెట్టి సాగనంపింది.
మరి దీనికీ, రంగారావు గారి ఆలోచనకూ లంకేమిటంటారా!
ఆయన సరిగ్గా ఇదే ఆలోచించారు. మనుషులను ఎదురయ్యే పెద్ద సమస్యల్లో ఒకటి టెన్షన్. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్న సమస్య పెద్దదిగా కనబడి మరింత పెద్దది అవుతుంది.
ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న చిన్న సంసారాలు ఏర్పడుతున్న తరుణంలో ఎదురయిన సమస్యలని ఎవరికి వారే పరిష్కరించుకోవాల్సి వుంది. మునుపటి రోజుల్లో ఇంట్లోనే ఎవరో ఒకరు చేయి వేసేవాళ్ళు. ఫోను చేస్తే 108 అంబులెన్స్  వచ్చినట్టు, ఒక ఏకీకృత వ్యవస్థ ద్వారా మనకు కావాల్సిన ప్లంబర్లను, ఎలక్ట్రీషియన్లను మొదలయిన పనివాళ్ళని ఫోను చేసి ఇంటికి పిలిపించుకునే సౌకర్యం అన్నమాట. ఇలాటి వాళ్ళ వివరాలను ఆ రోజుల్లోనే ఏరియా వారిగా వారి టెలిఫోన్ నెంబర్లతో సహా సేకరించడం జరిగింది. 108, 104 లాగానే ఈ సర్వీసులకు కూడా ఒకే  టోల్ ఫ్రీ నెంబరు వుంటుంది. ప్రభుత్వం లేదా ఒక గుర్తింపు పొందిన వ్యవస్థ ఆధ్వర్యంలో కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చిన పని కాకుండా ఇంట్లో ఉన్న ముసలీ ముతక మీద అఘాయిత్యానికి పూనుకునే అవకాశం వుండదు. చిన్నా చితకా పనులు పెద్ద అవస్థలు పడకుండా జరిగిపోతూ ఉండడంలో జనంపై మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయి.
అయితే అనేక మంచి పధకాల మాదిరిగానే ఇది కూడా అటకెక్కింది.
ఇతి వార్తాః              

1 కామెంట్‌: