మా ఆవిడకు ‘ప్రత్యేక స్థాయి’ కల్పించిన
రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి
ప్రముఖులతో వ్యక్తిగత పరిచయాలు
లేకున్నా వారికి సంబంధించిన జ్ఞాపకాలు కొన్ని వుంటాయి.
అలాంటిదే ఇది.
నలభయ్ ఏళ్ళ కింద సంగతి. అప్పుడు నేను బెజవాడ ఆంధ్రజ్యోతి
దినపత్రికలో సబ్ ఎడిటర్ గా
పనిచేస్తున్నాను. ఆ రోజుల్లో యద్దనపూడి సులోచనారాణి నవల ‘మీనా’ ఆంద్రజ్యోతి వారపత్రికలో
సీరియల్ గా వచ్చేది. ఆ నవల మీద పాఠకుల ఆసక్తి ఎంతగా ఉండేదంటే ఖమ్మంలో ఉన్న మా
చుట్టాలు పత్రిక పార్సెల్ వచ్చే రోజున ఏకంగా రైల్వే స్టేషన్ కు వెళ్లి పార్సెళ్ళు
విప్పెదాకా వేచి వుండి వీక్లీ కొనుక్కుని అక్కడికక్కడే ఆ సీరియల్ చదివి ఇంటికి
తిరిగొచ్చేవాళ్ళు. అలా వుండేది మార్కెట్లో ఆమె రచనల డిమాండు.
ఇక విషయానికి వస్తే, అప్పట్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక, వారపత్రిక రెండూ హాండ్
కంపోజింగ్. కంపోజ్ అయినతర్వాత తీసిన ప్రూఫ్ గ్యాలీలో తప్పులు సరి దిద్దిన తర్వాత
ఎడిటర్ ఫైనల్ గా చూసే ఎస్ గ్యాలీ కొన్ని కాగితాల మీద హాండ్ ప్రింటు చేసేవాళ్ళు. ఆ తర్వాతే ప్రింటింగుకు
పంపేవాళ్ళు. సులోచనారాణి గారి నవల ఎస్
గ్యాలీని నేను మా ఇంటికి తీసుకుపోయేవాడిని, హైదరాబాదులో ఉంటున్న ఎడిటర్ నార్ల
వెంకటేశ్వర రావు గారి సతీమణికి కూడా
యద్దనపూడి రచనల పట్ల చాలా ఆసక్తి వుండేది. నిజమెంతో తెలియదు కాని, ఆవిడగారు చదువుకోవడం
కోసం ఆఫీసువాళ్ళు కూడా ఆ యస్ గ్యాలీని ముందుగా హైదరాబాదుకు పంపేవాళ్ళని చెప్పుకునే
వాళ్ళు.
మళ్ళీ విషయానికి వస్తే, యద్దనపూడి
రచనలంటే ప్రాణాలు పెట్టే వారికి నేను ఇంటికి తెచ్చే ప్రూఫు కాగితాలు చూడగానే
ప్రాణం లేచి వచ్చేది. మా ఆవిడ సరే సరి. ఆ రోజు అంతా మాఇంటికి చేరేవాళ్ళు, వారం
తర్వాత మార్కెట్లో కనబడే ఆమె సీరియల్ ను ముందుగా
చదవడం కోసం. ఆ విధంగా చుట్టపక్కాల్లో,
ఇరుగుపొరుగు వాళ్ళల్లో మా ఆవిడ స్థాయి ఒకింత పెరిగిందనే చెప్పాలి.
అలా ఒకానొక కాలంలో తెలుగు లోగిళ్ళలో ఇంటిల్లిపాదినీ సమ్మోహితులను చేసిన తెలుగు పాఠకుల కలల రాణి
యద్దనపూడి సులోచనా రాణి ఇక లేరని తెలిసి చాలా బాధనిపిస్తోంది.
నిజమా ? యండమూరి లాంటి వాళ్ళకి కూడా ప్రేరణ ఆమేనని ఆయనే వ్రాసుకున్నారు. ఉంగరాల జుట్టున్న ఆరడుగుల అందగాడు,ఓ బొచ్చుకుక్క,పొడవాటి పడవలాంటి కారు ప్రక్కన ఠీవీ గా సిగరెట్ త్రాగుతూ హీరో నిలబడి ఉంటాడని ఆవిడ వ్రాస్తే అలాగే ఉండాలి కామోసు అనేసుకుని ఒక కారు, బొచ్చుకుక్క కొనుక్కున్నారట !
రిప్లయితొలగించండిఆడవాళ్ళకి ముక్కు మీద కోపం,ఆత్మాభిమానం ఉండేది. ఇవి రెండూ దేనికీ పనికిరావడం లేదని వదిలేసాం.
ఆవిడ ఆత్మకి శాంతి కలగాలి.
ఆవిడ ఒక ట్రెండ్ సెటర్. ఒక డ్రీమ్ మర్చంట్. ఒక తరం అమ్మాయిలను ప్రభావితం చేసిన రచయిత్రి.
రిప్లయితొలగించండిఆవిడ ఆత్మకు శాంతి కలగాలి 🌼🌼.