19, ఏప్రిల్ 2018, గురువారం

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాడు, నేడు – భండారు శ్రీనివాసరావు


(ఏప్రిల్ 20 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం)
నేను నిద్రపోనుమిమ్మల్ని నిద్ర పోనివ్వను
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడి డైలాగ్ ఇది. ఆ రోజుల్లో సంగతేమో కానీ2014 లో కొత్తగా ఏర్పాటయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దాదిగా ఆయన కంటినిండా కునుకు తీసిన దాఖలాలు కానరావడం లేదు. మొదటిది ఆయన రాజకీయ జీవితంలో స్వర్ణ యుగం. రెండోది ఏమిటన్నది కాలమే చెప్పాలి.
తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంలోకిఆయన భార్యగా  లక్ష్మీపార్వతి ప్రవేశం అనేదిఒక ప్రాంతీయ పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల జీవితాలను పెద్ద మలుపు తిప్పిందనే చెప్పాలి. అందులో ఒకరు ఎన్టీఆర్ కాగా రెండో వ్యక్తి చంద్రబాబునాయుడు. అయిదేళ్ళ విరామం తర్వాత అధికార పీఠం ఎక్కిన కొద్ది మాసాలకే ఒకరు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగా,  మరొకరు అనూహ్యంగా  ముఖ్యమంత్రి కాగలిగారు.
1995లో తెలుగు దేశం పార్టీలో ఊహకు అందకుండా జరిగిన  రాజకీయ పరిణామాల దరిమిలా ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఏడాది కాలాన్ని ఆయన తన అధికారాన్ని పదిలం చేసుకోవడం పట్లనే ఎక్కువ శ్రద్ధ చూపారు. రామారావు ఆకస్మిక మరణం కూడా పరిస్తితులు బాబుకు అనుకూలంగా మారడానికి దోహదం చేసింది. 1996 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని టీడీపీ మొత్తం 42 స్థానాల్లో 16 సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ అధినాయకుడిగా ఆయనకు ప్రజల ఆమోదం లభించినట్టయింది. ఈ విజయం ఆయనకు ఎంతో నైతిక బలాన్ని ఇవ్వడంతో ఆ తర్వాత,  పరిపాలనా వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ కనబరచడం మొదలుపెట్టారు. యువకుడు కావడంఆలోచనల్లో నవ్యత్వంవాటిని ఆచరణలో పెట్టడంలో కొత్తదనంవీటికి తోడు పత్రికల ద్వారా లభించే సానుకూల ప్రచారం చంద్రబాబును యువతరానికి ఆరాధ్య రాజకీయ నాయకుడిగా మార్చివేశాయి. ముఖ్యమంత్రి పేషీలో సమర్దులువిధేయులయిన అధికారుల సాయం కూడా ఆయనకు అక్కరకు వచ్చింది. కేంద్రంలో తన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వం వుండడం చంద్రబాబుకు కలిసివచ్చిన మరో అంశం.
ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ, 1983 లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ సమయంలో  మాదిరిగా ప్రజలనుంచి వ్యతిరేకత పెద్దగా వ్యక్తం కాకపోవడంతో, చంద్రబాబు అనేక కొత్త రకం పధకాలతోప్రణాళికలతో పనిచేయడం ప్రారంభించారు. ప్రజల కోసం తాను  రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నట్టు ప్రజలు నమ్మేలా చేయడంలో ఆయన కృతకృత్యులు కాగలిగారు. రాష్ట్రం కోసం అహరహం కృషిచేస్తున్న ముఖ్యమంత్రి అనే పేరు ఇంటాబయటా మారుమోగడంతో చంద్రబాబు ధైర్యం చేసి రామారావు ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయలకు సబ్సిడీ బియ్యం పధకంవ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీ పధకాలతో పాటు టీడీపీని తిరిగి అధికారంలోకి తేవడానికి దోహదం చేసిన సంపూర్ణ మద్య నిషేధాన్ని కూడా వీలువెంట ఎత్తి వేసారు. రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలకు  దిగినా,  అప్పటికే చంద్రబాబు సమర్ధత పట్ల నమ్మకం పెరిగిన ప్రజలు ఈ నిర్ణయాలపట్ల పెద్దగా విముఖత చూపలేదు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయి దుమ్ము కొట్టుకుపోతున్న ఫైళ్ళకు మోక్షం కల్పించడానికి ఉద్యమ రూపంలో చేసిన ప్రయత్నాలురేడియో దూరదర్సన్ ల ద్వారా ప్రజలతో వారం వారం ముఖాముఖిరైతులుఇతర బలహీన వర్గాల కోసం వినూత్నంగా ప్రారంభించిన  రైతుబజార్లుదీపం మొదలయిన పధకాలురాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా రెక్కలు కట్టుకుని హెలికాప్టర్ లో అక్కడ వాలిపోవడంరాజధాని నగరం పొలిమేరల్లో సైబరాబాదు పేరుతొ నవనగర నిర్మాణంప్రపంచ కంప్యూటర్ పఠoలో హైదరాబాదుకు స్థానం లభించేలా కృషి చేయడంప్రతిష్టాత్మక కంప్యూటర్ కంపెనీలు హైదరాబాదుకు తరలి వచ్చేలా చేయడం ఇవన్నీ కలిసి,  ఒక కొత్త తరహా ముఖ్యమంత్రిని చంద్రబాబులో చూస్తున్నామని జనం  అనుకునేలా చేయగలిగాయి.
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడతాననిమిగిలిన సమయాల్లో  రాష్ట్రాభివృద్ధి   మినహా తనకేదీ పట్టదని’  అప్పట్లో  ఆయన తరచూ చెబుతుండేవారు. పరిపాలనను మెరుగు పరచడానికి ఏమి చేస్తే బాగుంటుందని చంద్రబాబు తనను చూడవచ్చిన మేధావులనువిలేకరులను అడిగేవారు. తన వేగాన్ని పాలనా యంత్రాంగం అందుకోలేకపోతున్నదనివాళ్ళలో ఆశించిన  స్పందన కానరావడం లేదని మధనపడేవారు.
నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయన తరహా వేరు. చంద్రబాబుతో పనిచేసిన ఆనాటి అధికారులు అదే చెబుతారు.
ఆయన తన మనసులో మాట బయట పెట్టరు. నేనిలా చేద్దామనుకుంటున్నానుమీ అభిప్రాయం ఏమిటి అని అడగరు. కానీ కొన్ని కొన్ని అంశాల్లోముఖ్యులు అని ఆయన అనుకున్నవాళ్ళ సలహాలు తీసుకునేవారు. వాటన్నిటినీ కూలంకషంగా ఆలోచించుకుని ఒక అభిప్రాయానికి వచ్చేవారు. దాన్ని తన ముఖ్య సలహాదారులతో ముందు  పంచుకునే వారు. ప్రజలనుంచి,  పత్రికలనుంచి  ఎలాంటి వ్యతిరేకత వస్తుందో ఆరా తీసేవారు. ఈ రీతిలో బాగా ఆలోచించి  నిర్ణయాలు తీసుకునే చంద్రబాబును చూసి ఆయన ప్రజ్ఞకు వారందరూ ముగ్డులయేవాళ్ళు. అయితే ఈ క్రమంలో చాలా కాలయాపన జరుగుతోంది అనే విషయాన్ని  ఆయన అసలు పట్టించుకునేవారు కాదు’      
దేశ విదేశాల్లో చంద్రబాబు సమర్ధత గురించి మాట్లాడుకునేలా చేయడంలో కూడా ఆయన విజయం సాధించారు. బిజినెస్ వీక్  అనే  పత్రిక, 1999 జూన్ సంచికలో చంద్రబాబుపై  ప్రచురించిన ప్రత్యేక వ్యాసంలో ఆయన గురించి ప్రశంసలు గుప్పించింది. ఆయన్ని స్టార్ ఆఫ్ ఆసియా’ గా అభివర్ణించింది. అలాగేటైమ్ మేగజైన్,   తన సంస్కరణలతో దేశంలో ఇతర ప్రాంతాలను అధిగమిస్తూఆంధ్రప్రదేశ్ స్వరూపాన్నే మారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు’ అంటూ ప్రస్తుతించింది. ఈ రాజకీయ నాయకుడు షరా మామూలు రాజకీయ నాయకుడు కాదు. ఒక శాంతియుతమైన విప్లవకారుడు’ అని న్యూస్ వీక్ పత్రిక కితాబు ఇచ్చింది. లండన్ నుంచి వెలువడే ఫైనాన్సియల్ టైమ్స్ పత్రిక  ‘భారత దేశపు దార్శనికుడు’ అనే శీర్షికతో చంద్రబాబు గురించిన వ్యాసం ప్రచురించింది. ఆయన నిజాయితీఈ. గవర్నెన్స్ పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి రాజకీయ రంగంలో అగ్రభాగానికి చేరుకునేలా చేశాయి’ అని పొగిడింది. ఎకనమిస్ట్ పత్రిక మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబును ఆకాశానికి ఎత్తింది.డిజిటల్ విప్లవం పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్దత చాలా గొప్పది. నిజానికి ఈ విషయంలో  మొత్తం భారత దేశానికి ఉండాల్సిన తెగువను చంద్రబాబునాయుడు ఒక్కరే ప్రదర్శించి చూపారు’ అని రాసింది.
ఇలా వెల్లువలా వచ్చిపడుతున్న ప్రశంసల వర్షంలో చంద్రబాబు తడిసిముద్దయ్యారు. దేనికీ పడని  వారు పొగడ్తకు పడతారంటారు.  ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ పేరు ప్రఖ్యాతులు  ‘ఇంకా ఏదో చేసి చూపిద్దాం’ అనే యావను ఆయనలో రగిలించాయి. మరింత ముందుకు దూకేలా ప్రోత్సహించాయి. ఈ క్రమంలో ఒకవైపు ముందుకు దూసుకు పోతూమరో వైపు పాలకుడిగా నిర్వర్తించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో  వెనుకపడి పోతున్న విషయాన్ని ఆయన విస్మరించారేమో అనిపిస్తుంది.
చంద్రుడికి పున్నమిఅమావాస్యల మాదిరిగా చంద్రబాబు పాలనకు ప్రశంసలతో  పాటు విమర్శలు కూడా  తప్పలేదు. ప్రపంచ బ్యాంకు తాబేదారుగా ప్రతిపక్షాలు ముద్ర వేశాయి. సంస్కరణల వేగంలో తమకు అన్యాయం జరుగుతోందని అట్టడుగు వర్గాలు అనుమానించడం ప్రారంభించాయి. భుజాన ఒక కంప్యూటర్ బ్యాగ్ తగిలించుకుని వెడితే చాలు సచివాలయ గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయనీ,  ముఖ్యమంత్రి  దర్శనం ఇట్టే జరిగిపోతుందనే వ్యంగ్య వ్యాఖ్యానాలు వినబడడం మొదలయింది. ఈ ఆరోపణలువిమర్శల హోరులో ఆయన చేసిన మంచి కొట్టుకు పోయింది. చేయని మంచి’ సామాన్య జనాలకు కనబడింది. ఎందుకు చేయలేదనే ప్రశ్న ఎదురుగా నిలబడింది.
ఫలితం తెలిసిందే.
దాదాపు పదేళ్ళు దూరమైఇక చేతికి అందడం అసాధ్యమేమో అనుకున్న అధికార అందలం రాష్ట్ర విభజన కారణంగా చంద్రబాబుకు దక్కింది. దక్కిందనే సంతోషం తప్ప ఆనందించడానికి ఏమీ లేదు. రాష్ట్రం ఏర్పడింది కానీ రాజధాని లేదు. పాలకులు ఒక రాష్ట్రంలోపాలితులు మరో రాష్ట్రంలో అనే రీతిలో పాలన  కొన్నాళ్ళు సాగింది. ఎట్టకేలకు మంత్రులుఅధికారుల సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి చేరారు.
ఈ పదవి ఆయనకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఇరవై మూడు జిల్లాలతో పాలించిన రాష్ట్రం పదమూడు జిల్లాలకు పరిమితం అయింది. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలుఇచ్చిన హామీలు నిండుకున్న ప్రభుత్వ ఖజానా ఎదురుగా నిలబడి మా సంగతేమిటని అడుగుతున్నాయి. కేవలం చంద్రబాబు సామర్ధ్యాన్ని విశ్వసించి రైతులు మూడుపంటలు పండే భూములు ముప్పయివేల ఎకరాలకు పైగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నారు. ఏళ్ళు గడుస్తున్నా అరకొర భవనాలు తప్పిస్తే ప్రకటనల్లో కనిపించిన రమ్య హర్మ్య భవంతులు కలికానికి కూడా కానరావడం లేదు.
ఏం చెయ్యాలో తెలియదు. ఒకప్పుడు హైదరాబాదులో కూర్చుని ఢిల్లీలో ఫైళ్ళు కదిలించిన చాతుర్యంఇప్పుడు ఎన్నిసార్లు హస్తిన చుట్టూ తిరిగినా కొరగాకుండా పోతోంది. ఏదో చెయ్యాలనే తాపత్రయం. ఏమీ చేయలేని నిస్సహాయ స్తితి.
కాళ్ళూ చేతులూ కట్టేసి కబాడీ ఆడమన్నట్టుగా వుంది పరిస్తితి.
మరో పక్క రాజకీయంగా కలవరపెడుతున్న పరిణామాలు.
చంద్రబాబుకు ఉన్నచంద్రబాబుకు మాత్రమే ఉన్న సమర్ధత అనే ఒకే ఒక్క కారణంతో నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రజానీకం ఆయనకు పాలనా పగ్గాలు అప్పగించారు.
కానీ సమర్ధత రాణించాలి అంటే పరిస్తితులు కూడా అనుకూలించాలి. అనుకూలించిన పరిస్తితుల నేపధ్యంలో చంద్రబాబుకు ఉన్న సమర్ధత అలనాడు రాణించింది. అది విశదం చేయడానికే ఇంతటి ఉపోద్ఘాతం అంత వివరంగా చెప్పాల్సి వచ్చింది.
ఈనాడు అలనాటి పరిస్తితులు లేవు. ఆ రోజుల్లో విశ్వసనీయంగా పనిచేస్తూతమకూ తమ ముఖ్యమంత్రికీ మంచి పేరు తెచ్చిన అధికార యంత్రాంగం ఈనాడు వుందో లేదో తెలవదు. ఇక ప్రభుత్వ యంత్రాంగం మనసు పెట్టి పనిచేయడం లేదని నేతలే అంటున్నారు. ఒక నిబద్ధత కలిగిన పార్టీగా  ఆనాడు ఉన్న మంచి పేరు ఇప్పుడు లేదని పార్టీవాళ్ళే చెప్పుకుంటున్నారు. పొతే,  ఒక స్థాయిలో అవినీతి గురించి వెలువడుతున్న  వార్తలు నమ్మతగ్గవేనా అని సందేహించేంతలోబ్యాంకు స్ట్రాంగ్ రూములను,  బంగారు దుకాణాలను తలపించేలా మీడియాలో బయట పడుతున్న అవినీతి చేపల కధనాలు. పట్టుపడ్డ అవినీతి సొమ్మును లెక్కించడానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు  కరెన్సీ కౌంటింగ్ మిషన్లను వాడాల్సిన పరిస్తితులు వచ్చాయంటే పరిస్తితులు ఎంతగా దిగజారిందీ  అవగతం అవుతుంది.
అయితేగుడ్డిలో మెల్లగాఆనాడు చంద్రబాబుకు  అయాచితంగా లభించిన విశేష ప్రచారంఈనాడు కూడా  లేకపోలేదు. కాకపొతేఇంతటి బృహత్తర పార్టీ వ్యవస్థ, ప్రచార యంత్రాంగం  వుండి కూడా తన గురించి తనే చెప్పుకోవాల్సిన స్తితి రావడం ఏ నాయకుడికి అయినా బాధాకరమే. పైగాచంద్రుడిలో  మరో కోణం చూపించే మీడియా ఈనాడు పుష్కలంగా వుంది. దానికి తోడు ఎవరి అదుపాజ్ఞల్లో ఇమడని సోషల్ మీడియా రంగప్రవేశం చేసింది.  అప్పటికీ ఇప్పటికీ కొట్టవస్తున్నట్టు కనబడే తేడా ఇది. పులిమీది పుట్రలా, అదురూ బెదురూ లేని ఏకైక ప్రతిపక్షం. కలిసిరాని మిత్రపక్షం. ఆ బంధమూ మొన్నీమధ్యనే  తీరిపోయింది.
ఇప్పుడు రాష్ట్రంలో రెండే జట్లు. చంద్రబాబు వర్సెస్ రెస్టాఫ్ ఆంధ్రప్రదేశ్!
కలిసిరాని కాలంతో చంద్రబాబు నాలుగేళ్ళు నెట్టుకువచ్చారు. ఇంకా ఎన్నికలకు ఏడాది గడువే వుంది.  పరిణామాలు గమనిస్తుంటే ముందు ముందు రాజకీయమైన ఆరోపణలకు, విమర్శలకు మరింత  పదునెక్కడం తప్పిస్తే సర్దుకునే అవకాశాలు లేశ మాత్రంగా కూడా కానరావడం లేదు. కిందటి ఎన్నికల్లో పనిచేసిన అనేక అనుకూల అంశాలు ఈనాడు అంతర్ధానం అయిపోయాయి. ఒకరకంగా యుద్ధాన్ని మళ్ళీ మొదటి నుంచీ మొదలు పెట్టాల్సిన స్తితి.
పూర్తి శక్తియుక్తులు, సమస్త వనరులు సంపూర్ణంగా  ప్రయోగిస్తే మరోసారి అధికారం చిక్కవచ్చునేమో. అతి కష్టమైనా సాధ్యం కావచ్చునేమో. ఏమో అనే సంశయమే కాని, ఖచ్చితంగా చెప్పలేని పరిస్తితి.
కానీ ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా, ప్రత్యేకించి దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబుకు  లభించిన ఆదరణ ఈనాడేదీ! మరోసారి ముఖ్యమంత్రి అయిన  తరువాత కూడా లభిస్తుందన్న పూచీ ఏదీ!
ఏవి తల్లీ  నిరుడు కురిసిన హిమసమూహములు!
ఈ పుట్టిన రోజున అయినా పాత వైభవం రావడానికి ఏదైనా చేయకపోతారా అని  ఆయనకున్న అసంఖ్యాక అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానులు కదా! వారి ఆశలు అలాగే వుంటాయి. విరుద్ధంగా జరిగితే, వారి నిరాశ కూడా అదే స్థాయిలో వుంటుంది.
తాను పాత చంద్రబాబునే అని నిరూపించుకోవడం ద్వారా ఈ తడవ తన పుట్టిన రోజు కానుకను  ఆ రూపంలో వారందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీదే వుంది.
కానీ, ప్రస్తుత పరిస్తితులు గమనిస్తుంటే  అంతటి వ్యవధానం వున్నట్టు కనిపించడం లేదు. (EOM)     
(రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,  మొబైల్: 98491 30595)        

3 కామెంట్‌లు:

  1. పచ్చ మీడియా చేస్తున్న వ్యక్తిత్వ హననాల గురించి మానసిక సామాజిక అత్యాచారాల గురించి మీరు ఏమి చెప్పరు సార్. తెలుగు జనాటికి పట్టిన దరిద్రం పచ్చ మీడియా వాళ్ళ కుల పిచ్చి.

    రిప్లయితొలగించండి
  2. పై అజ్ఞాతా, అయితే జఫ్ఫా బ్యాచ్ కి కుల పిచ్చి, మత పిచ్చి లేదంటావా?

    రిప్లయితొలగించండి
  3. మీరు చాలా నిఖచ్చిగా రాసారు..మీ విశ్లేషణ రాజకీయంగా..బాబు వ్యక్తిత్వ్వానికీ కూడా సరిపోయింది...తన పాట cm రోజుల్లో ముఖ్యం గా మహిళా, మధ్యతరగతి వోటర్ల కి దగ్గరైన బాబు..ఇవాళ పరిస్ధితులలో దూరం కొంతవరకు అయాడు....బాబు గారు తొందరగా శత్రువులని తయారు చేసుకుంటారు అన్న విషయం మీరు చెప్పలేదు..అతని మీద అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా ...అన్నింటిలో స్టే లు ఎలా తెస్తున్నారో తెలియదు..ఒకసారి స్టే వస్తే ఇంకా జీవితాతం ఆ కేసు కోర్టు లో దశాబ్దాల తరబడీ రాదా? నా కైతే అర్ధం కాదు..

    రిప్లయితొలగించండి