17, ఏప్రిల్ 2018, మంగళవారం

స్వర తారల సంగమం – భండారు శ్రీనివాసరావు



ఆకాశవాణిలో తమ స్వరాల ద్వారా అశేష తెలుగు ప్రజల అభిమాన నీరాజనాలు అందుకున్న మాజీ అనౌన్సర్లు, కళాకారులు ఈరోజు హైదరాబాదులో కలుసుకుని పాత ముచ్చట్లు కలబోసుకున్నారు. ఆలిండియా రేడియో సీనియర్ న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య పూనికపై ఈ సమ్మేళనం జరిగింది. తనతో కలిసి పనిచేసిన ఒకనాటి రేడియో సహచరులను ఒక్క చోటకు చేర్చాలనే సంకల్పంతో  విందు భోజనసమేత సంగమాన్ని ఈ మధ్యాహ్నం కూకట్ పల్లి లోని చట్నీస్ కాన్ఫరెన్స్  హాలులో ఏర్పాటు చేశారు.
శ్రీ వెంకట్రామయ్య పిలుపుకు స్పందించి, అనౌన్సర్లనుంచి అడిషినల్ డైరెక్టర్ జనరల్ వరకు గతంలో రేడియోలో పనిచేసిన దిగ్గనాధీరులు ముప్పయి మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు మూడు దశాబ్దాలు కలిసి పనిచేసిన వీరందరూ ఎప్పుడో పదవీవిరమణ చేసారు. అందరికంటే పెద్దవారు రేడియో చిన్నక్కగా ప్రసిద్దులయిన శ్రీమతి రతన్ ప్రసాద్. ఆమె గారి వయసు అక్షరాలా ఎనభయ్ అయిదు సంవత్సరాలు.  అందరికంటే వయసులో చిన్నవారు శ్రీ సుధామ సతీమణి శ్రీమతి ఉషారాణి. ఆలిండియా రేడియో అడిషినల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన డాక్టర్ ఆర్.ఏ. పద్మనాభరావు, మాజీ స్టేషన్ డైరెక్టర్లు శ్రీ ఆర్. విశ్వనాధం, డాక్టర్ పి. మధుసూదనరావు, డాక్టర్ పి. ఎస్. గోపాలకృష్ణ, డాక్టర్ కే.బీ.గోపాలం హాజరయిన వారిలో వున్నారు. గతంలో రేడియోలో తమ స్వర మాధుర్యంతో అసంఖ్యాక శ్రోతలను అలరించిన స్వరరాగధునులు శ్రీమతి శారదా శ్రీనివాసన్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీమతి ఇలియాస్ జ్యోత్స్త్న, శ్రీమతి ఆకెళ్ళ సీతాదేవి, శ్రీమతి ఇందిరాదేవి, శ్రీమతి నిర్మలా వసంత్, శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి, శ్రీ ఇలియాస్ అహ్మద్, శ్రీ రాజగోపాల్, శ్రీ మట్టపల్లిరావు, శ్రీ కోకా సంజీవరావు, శ్రీ కలగ కృష్ణ మోహన్, శ్రీ ఏ.వీ.రావు చౌదరి, శ్రీ సుధామ, శ్రీ ఎం. బాబూరావు, శ్రీ వెంకట్రామయ్య గారి భార్య శ్రీమతి కరుణ ప్రభ్రుతులు తమ రాకతో ఈ సమ్మేళనానికి కొత్త సొగసులు అద్దారు.
ఇక నా విషయం సరే, ఉభయచరం మాదిరిగా ఇటు రేడియో విలేకరిని, అటు జీవన స్రవంతి ద్వారా రేడియో స్వరాన్ని. అంటే ఒకరకంగా స్వర పరిచితుడిని అన్నమాట.
తోకటపా: ఈ కార్యక్రమం ఆలోచన, ఆచరణ, కర్తాకర్మాక్రియ అన్నీ వెంకట్రామయ్య గారే. మాది పేరంటాళ్ళ పాత్ర.

Image may contain: 19 people, including Padmanabharao Rao, Drcvn Reddi and M V Apparao Surekha, people smiling, wedding and indoor
     

3 కామెంట్‌లు:

  1. వెంకట్రామయ్య గారు చొరవ తీసుకుని మంచి పని చేశారు 👍. ఒకేచోట అందరూ ఇలా తిరిగి కలుసుకోవడం (reunion) చాలా సంతోషాన్నిస్తుంది కదా.

    రిప్లయితొలగించండి
  2. ఆనాటి ఆ స్నేహమానంద గీతం. ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం. ఈ నాడు ఆ హాయి లేదేమి నేస్తం. ఆ రోజులు మునుముందిక రావేమిలా.

    రిప్లయితొలగించండి
  3. ఎ టి ఎం లల్ల క్యాష్ నిల్లు. నీరవ్ మోడి, మాల్ల్య జేబులు ఫుల్లు. పుండాకోరు బ్యాంకులు గొల్లు గొల్లు. పెజానీకం జేబులు చిల్లు. పెబుత్వం ఛిల్లో ఛిల్లు.

    రిప్లయితొలగించండి