11, డిసెంబర్ 2017, సోమవారం

దొరకని పుస్తకంలో విజయవాడ


నాలుగున్నర దశాబ్దాల క్రితం. విజయవాడ లబ్బీపేట ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. లంక వెంకట రమణ నా సహోద్యోగి. ఏమి చదివాడో తెలియదు కాని ఆంద్ర ఆంగ్ల భాషల్లో కొట్టిన పిండి. మధ్యాన్న భోజన సమయంలో దగ్గరలో వున్న మా ఇంటికి పోయే వాళ్ళం. ఒక్కటే గది. కుర్చీలు, మంచాలు ఉండేవి కావు. ఆ గదిలోనే  నా భోజనం. ఆయన అక్కడే చాప మీద  వరద రాజస్వామిలా పడకేసి, తలకింద మోచేయి పెట్టుకుని  అనేక కబుర్లు చెబుతూ ఉండేవాడు. ఆ భాషణలో చక్కని ఇంగ్లీష్ పద ప్రయోగాలు దొర్లేవి.
ఆఫీసులో గుర్రపు నాడా ఆకారంలో ఒక బల్ల వుండేది. పనిచేసుకుంటూ ప్యూన్ నాగేశ్వర రావుతో చీటీలు పంపుకునే వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్ తీసుకోగానే ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో  ఉండేవి. అంతమాత్రం డబ్బు ఎవరి దగ్గరా ఉండదని తెలుసు. అయినా అడక్క తప్పని అవసరాలు. అందరివీ ఒకే అవసరం కనుక ఒకరంటే మరొకరికి జాలి. అందుకని, ‘లేదు’ అనకుండా మరో చీటీ మీద “ఓ యాభయ్ సర్దుతారా” అని రాసి దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుకు పంపేవాళ్ళం. ఆయన ఆ చీటీలోనే ఓ యాభయ్ నోటు వుంచి తిరిగి పంపేవాడు. అందులో సగం వుంచేసుకుని మిగిలిన పాతిక ముందు అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చక్రభ్రమణం ప్రతినెలా సాగేది. ఇదిగో! ఈ ‘లేని’ తనమే మా స్నేహాన్ని గట్టిగా నిలిపి ఉంచింది. అందరం ఇదే బాపతు కనుక ఇక అసూయలకు ఆస్కారమే వుండేది కాదు.


Image may contain: 1 person

ఇక అసలు విషయానికి వస్తాను. తరువాత మా దారులు వేరయ్యాయి. నేను హైదరాబాదులో రేడియోలో, ఆయన విజయవాడలోనే ఆంద్రప్రభలో కొత్త జీవితాలు మొదలు పెట్టాము. దరిమిలా పాతికేళ్లలో మేమిద్దరం కలుసుకున్నది ఒకటి రెండు సార్లే.
ఈ మధ్య ఇల్లు మారినప్పుడు పుస్తకాలు సర్దుతుంటే రమణ రాసిన ‘విజయవాడ వీధుల కధలు’ అనే పుస్తకం కనబడింది. చిన్న పుస్తకం అయినా చదవదగిన ఎన్నో విశేషాలు వున్నాయి. 2000 సంవత్సరంలో  ‘భారతి’ సాంస్కృతిక సంస్థ వారు ప్రచురించారు. ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలవదు. (రేడియోలో నా సీనియర్ సహచరులు ఎం.వి.ఎస్. ప్రసాద్ గారు చెప్పాలి, ఎందుకంటే ఇందులో వారి ప్రస్తావన వుంది)
ఈ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు కింద పొందుపరుస్తున్నాను.
“హువాన్ చాంగ్ చూసిన బెజవాడ”
చైనా యాత్రీకుడు హువాన్ చాంగ్ క్రీస్తు శకం 730లోభారత దేశానికి వచ్చాడు. దేశంలో పర్యటిస్తూ 739లో బెజవాడ చేరుకున్నాడు. తను చూసిన ప్రతిదీ ఆయన గ్రంధస్తం చేసారు. అప్పుడు బెజవాడ ‘తె – న – క – చ – క’ అనే దేశంలో ఉండేదట. ఈ తెనకచక చాళుక్య రాజ్యంలో వుండేది. ‘తె – న – క – చ – క’ ను సంస్కృతీకరిస్తే ధాన్యకటకం అవుతుంది. అంటే నేటి అమరావతి (ప్రస్తుతం రాజధాని అమరావతి కాదు). అప్పటి  తెనకచక దేశానికి బెజవాడ రాజధాని. హువాన్ చాంగ్ ప్రకారం అప్పటి మనుషులు చాలా బలిష్టంగా, నల్లగా, మొరటుగా వుండేవాళ్ళు. బౌద్దోపాసకులు బెజవాడ, సీతానగరం, ఉండవల్లి గుహల్లో నివసించేవాళ్ళు. రాత్రి వేళల్లో ఆ సంఘారామాలు బారులు తీరిన దీపాలతో కనుల పండుగగా కానవచ్చేవని చైనా యాత్రీకుడు వర్ణించారు. దక్షిణంగా ఉన్న కొండపై భావ వివేక స్వామి తపస్సు చేసుకున్నాడని ఆయన రాసారు. భావ వివేకుడు కృష్ణా జిల్లా వాడు. ఆయన ధారణి సూత్రాలు తెలుసుకున్నాడని బౌద్ధ గ్రంధాలు చెబుతాయి.  
ఇంకో విచిత్రమైన విషయం నూట యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ జనాభా ఎనిమిది వేలకు పై చిలుకు. అదే పదిహేను వందల ఏళ్ళకు పూర్వం ఆ పట్టణ జనాభా లక్షకు పైమాటే. విదేశీ వర్తకులతో కిటకిట లాడిన వాణిజ్య నగరం. కృష్ణలో విదేశీ నౌకలు బెజవాడ వరకు వచ్చేవి. రోమన్, గ్రీకు నాణేలు పలుచోట్ల లభించడం ఇందుకు దృష్టాంతంగా చెబుతారు. ఇక్కడి నుంచి విదేశాలకు తోళ్ళు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యేవి.
ఈ పట్టణానికి అనేక పేర్లు ఉండేవి. బిజియివాడ, విజియివాడ, బెజవాడ, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, మల్లికార్జున మహాదేవ పురం, విజయవాడ ఇలా ఎన్నో. అయినా చరిత్రలో చిరకాలం బెజవాడ అనే పేరే నిలిచింది. విజయవాడ అనే ఇప్పటి పేరు కూడా పన్నెండవ శతాబ్దంలో వాడుకలో వుండేది. ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, చోళులు, తెలుగు చోడులు, రెడ్డి రాజులు, కాకతీయులు, గజపతులు, దుర్జయులు, నరపతులు, నవాబులు, మండలేశ్వరులు, మహా  మండలేశ్వరులు, త్యాగి వంశీయులు, ఇంకా అనేకానేక రాజవంశాల ఏలుబడిలో ఉండేది.
హువాన్ చాంగ్ తో పాటు, ఫాహియాన్, భావదేవర, దిగ్నాగ, మహాపద్మనంద, ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధి వంటి వారు ఈ నగరాన్ని దర్శించారు.

(షేర్ చేసే వారికి ఒక ప్రగాఢ విజ్ఞప్తి. రమణ గారు ఎంతో కష్టపడి శ్రమించి, తన శక్తికి మించిన కార్యం నెత్తికెత్తుకుని పూర్తి చేసారు. ఆయన ఏమీ కలిగిన వాడు కాదు. ఇది చెప్పడానికే   ముందు ఉపోద్ఘాతం రాశాను. రమణ గారు ఇప్పుడు ఎలాగూ లేరు, కనీసం ‘కీర్తి’ అయినా ఆయనకు దక్కనివ్వండి)       

2 కామెంట్‌లు: