20, మే 2017, శనివారం

ఈవీఎం లు, విలేకరిగా ఓ జ్ఞాపకం

1983 అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత వుంది.  అదేమిటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను మొదటిసారి ప్రయోగాత్మకంగా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉపయోగించారు. ఇంకోటేమిటంటే తొలిసారి ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో పోటీ చేసింది.
షాద్  నగర్ లో ఈవీఎం కౌంటింగ్ కావడం వల్ల గంటల్లోనే ఫలితం వెలువడింది. కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ పి. శంకరరావు సమీప ప్రత్యర్ధి, టీడీపీ అభ్యర్ధి పుట్టపాగ రాధాకృష్ణపై విజయం సాధించారు. రిటర్నింగ్ ఆఫీసరు అధికారికంగా ప్రకటించిన ఆ సమాచారాన్ని మొదట  హైదరాబాదులోని ప్రాంతీయ వార్తా విభాగానికి, తరువాత ఢిల్లీ ఆలిండియా రేడియో కేంద్రానికీ అందించాను. మధ్యాన్నం ప్రాంతీయ వార్తలతో పాటు గంటగంటకూ వెలువడే ఎన్నికల ప్రత్యేక బులెటిన్లలో కూడా ఆ వార్తను ప్రసారం చేసారు. అలాగే సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే ఇంగ్లీష్, తెలుగు వార్తల్లో కూడా శంకరరావు గెలిచిన వార్త ప్రసారం అయింది. మిగిలిన చోట్ల సాధారణ పద్దతిలో బ్యాలెట్ పత్రాలను లెక్కించడం వల్ల తెలుగు దేశం అభ్యర్ధుల ఆధిక్యతలకు సంబంధించిన సమాచారం మినహా ఫలితాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ఆ రోజుల్లో రేడియోలో ఆధిక్యతలు ప్రకటించే సాంప్రదాయం లేదు. అనధికారికంగా టీడీపీ విజయపధంలో దూసుకుపోతున్నట్టు సమాచారం వస్తున్నా ఆ వివరాలను ప్రసారం చేయలేని పరిస్తితి. ఇప్పటిలా వేరే వార్తా మాధ్యమాలు లేకపోవడం వల్ల అందరూ రేడియో వార్తల మీదనే ఆధారపడాల్సిన రోజులవి. షాద్  నగర్ లో ఈవీఎం లు వాడి కాంగ్రెస్ ఏదో గందరగోళం చేసిందని వదంతులు బయలుదేరాయి. దరిమిలా కొన్ని గంటల తర్వాత మాన్యుయెల్ గా కౌంటింగ్ జరిగిన ప్రాంతాల నుంచి ఫలితాలు రావడం మొదలయింది. టీడీపీ విజయ పరంపర గురించి అ తర్వాత రేడియోలో వార్తలు ప్రసారం అయ్యాయి. టీడీపీ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీ రాగానే టేప్ రికార్డర్ పుచ్చుకుని ఎన్టీ రామారావు గారి స్పందన కోసం ఆబిడ్స్ లోని ఆయన గృహానికి ఆదరాబాదరాగా వెడితే అక్కడి సిబ్బంది చెప్పిన మాట ఇది.

“సారు మేడ మీదకు వెళ్ళిపోయారు, చాలాసేపయింది  నిద్రపోయి” 

1 కామెంట్‌:

  1. < " ఇప్పటిలా వేరే వార్తా మాధ్యమాలు లేకపోవడం వల్ల అందరూ రేడియో వార్తల మీదనే ఆధారపడాల్సిన రోజులవి. "
    రేడయో, డిడి-టీవీ మాత్రమే ఉన్నరోజులే బాగుండేవి, వార్తల విశ్వసనీయత దృష్ట్యా.

    రిప్లయితొలగించండి