16, మే 2017, మంగళవారం

శిక్షలు మరో రకంగా వుండాలి

ఎంత కష్టం ఎంత కష్టం
ఆరు నెలల కిందట మేము ఈ ప్రాంతంలో అద్దెకు  వచ్చినప్పుడు మా అపార్ట్ మెంటుకు  ఐ మూలగా ఓ ఖాళీ స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదు లాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది. కరెంటు లేకపోవడం వల్ల ఎండ గాలో వడ గాలో ఏదో ఓ గాలి వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడో  దానిమీద పిల్లర్లు వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన వారి మాదిరిగా నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో  అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమ పధ్ధతి ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటి గంట  కాగానే గంట  కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని ఇళ్లనుంచి తెచ్చుకున్న భోజనాలు చేశారు. చూడగలిగిన కళ్ళు వుండాలే కాని చుట్టూ వున్న ప్రపంచంలో చూడగలిగినవి ఎన్నో వున్నాయి. అయినా ఇంకా ప్రపంచం చుట్టిరావాలన్న యావ చావడం లేదు, ఎందుకో అర్ధం కాదు.
కరెంటు వచ్చింది. ప్యాను తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూ నే వుంది.
అసలు విషయం ఇప్పుడు విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది  కదా! అదే ఇది.

నగరంలో అక్రమ నిర్మాణాల పేరుతొ పెద్ద పెద్ద భవనాలను కూల్చివేస్తున్న వార్తలు వింటున్నాము. నిబంధనలకు విరుద్ధంగా  ఎటువంటి నిర్మాణాలను అనుమతించకూడదని నమ్మే వారిలో నేనూ వున్నాను.  అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ఫోటోలను పత్రికల్లో చూసినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పానే మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇంటికంటే అవి చాలా పెద్దవిగా అనిపించాయి.  ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ కూల్చేసిన ఇళ్లు కట్టడానికి కనీసం ఏడాది పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు.   ఇసుక సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో  వుంది. ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం?  ఎలాటి న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బు అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు  వొదులుకున్నట్టే కదా!    ఇన్నాళ్ళు అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన  అధికారులను, సిబ్బందిని వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం   ఓ యాభయ్ మందిని నిర్దాక్షిణ్యంగా  ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వితంగా  తొలగిస్తే మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా!

దయచేసి, మిగిలిన అన్ని విషయాలు పక్కనబెట్టి  ఆలోచించండి.                   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి