24, నవంబర్ 2016, గురువారం

నడిచే నాటకరంగం కేవీ రమణ IAS

తెలిసిన వ్యక్తిలో తెలియని అంశాలు


My article on Savitri Sai book on KV Ramana (IAS) published in AKSHARA of Andhra Bhoomi, Telugu Daily today.Courtesy Shri Mvr Sastry

తెలంగాణా ప్రభుత్వ సలహాదారు, స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కే,వీ.రమణ  జీవన యానంపై  శ్రీమతి సావిత్రీ సాయి రాసిన పరిశోధక గ్రంధం గురించిన నా సమీక్షను   ఆంధ్ర భూమి దినపత్రిక 'అక్షర' లో ఈరోజు ప్రచురించారు. పత్రిక సంపాదకులు శ్రీ ఏం.వీ.ఆర్. శాస్త్రికి కృతజ్ఞతలు. 

సావిత్రీ సాయి చాలా సాహసం చేశారనిపిస్తుంది. డాక్టరేట్ చేయడానికి ఎన్నుకున్న ఇతివృత్తం అలాంటిది మరి. జగమెరిగిన మనిషి కేవీ రమణాచారి సాంస్కృతికోద్యమ దృక్పధం అనేది రచయిత్రి అనండి, పరిశోధకురాలుఅనండి సావిత్రీ సాయి ఎంపిక చేసుకున్న అంశం.
“తీసివేసే థీసిస్ లు, ఎత్తిపోతల పధకాలు వంటి తెలుగు పరిశోధనల పరంపరలో యోగ్యుడయిన ఒక కళా వతంసుని కృషిని అంశంగా స్వీకరించి పరిశోధన చేసిన సావిత్రీ సాయిని అభినందిస్తున్నాను” అని ఈ పరిశోధనకు పరీక్షకునిగా వ్యవహరించిన డాక్టర్  కందిమళ్ళ సాంబశివరావు పేర్కొనడం సావిత్రి గారికి డాక్టరేట్ ని మించిన కితాబు.
కేవీ రమణ (రమణాచారి అనే తన పేరులో వున్న ‘చారి’ అనే రెండక్షరాలను ఆయనే స్వయంగా తొలగించుకున్నారు) జీవితం ఒక తెరిచిన పుస్తకం. పుస్తకం అట్ట వెనుక రచయిత్రే స్వయంగా ఈ విషయం పేర్కొన్నారు.  అందరికీ తెలిసిన వ్యక్తిలో అందరికీ తెలియని అంశాలను కూడా పరిశోధించి రాయడం అంటే మాటలు కాదు. ఆ దిశగా చేసిన కృషి, ఆ క్రమంలో చూపిన పట్టుదల  ఆవిడకు డాక్టరేట్ పట్టాను అందించింది. సావిత్రీ సాయి శ్రమ  ఫలించడం వల్ల ఒక ఉపకారం కూడా జరిగింది. కేవీ రమణ జీవన చిత్రంలోని సాంస్కృతిక కోణం  సమగ్ర రూపంలో ఆవిష్కృతమైంది. తెలుగు పాఠకులకు, ప్రత్యేకించి సాంస్కృతిక ప్రియులకు  పుస్తక రూపంలో ఒక అమూల్యమైన కానుక లభించింది.  ఇందుకు డాక్టర్ సావిత్రీ సాయి బహుధా అభినందనీయులు.
ఈ పుస్తకాన్ని సమీక్షించడం అంటే ఒక రకంగా కేవీ రమణ జీవితాన్ని ఆమూలాగ్రం స్పర్శించడమే.  అందుకే కాబోలు ఆయన కొండంత వ్యక్తిత్వాన్ని  ఆవిడ కొద్ది మాటల్లో గుదిగుచ్చి ఇలా చెప్పారు.
“దేశానికి ఒక అబ్దుల్  కలాం....ఒక  అన్నా హజారే....
“తెలుగువారికి ఒక రమణాచారి”
అల్పాక్షరాల్లో అనల్పార్ధాలను పొదగడం అంటే ఇదే!
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి రచయిత్రి కృషి గురించి ‘రమణీయం’గా ఒక మాట చెప్పారు.
“పరిశోధకురాలు విషయాన్ని  సంగ్రహించి, ఔచిత్యాన్ని గ్రహించి, ఎంతగానో  శ్రమించి ఈ సిద్దాంత గ్రంధాన్ని రచించారన్న శివారెడ్డి గారి మాటల్లో ఎంతో సత్యం వుంది.    
రమణది అందరికీ తెలిసిన వ్యవహారం కనుక తెలిసిన విషయాలను తేలిగ్గా సేకరించి దానికి పరిశోధనా పత్రం అనే రూపాన్ని ఇవ్వడం చాలా సులభమని ఎవరయినా అనుకుంటే పొరబాటు పడినట్టే. రమణ పూర్తి వ్యక్తిత్వాన్ని ఆపోసన పట్టడానికి సావిత్రీ సాయి ఎంతో శ్రమించారు. ఎక్కడెక్కడో స్తిరపడిన రమణ  బాల్య స్నేహితులను, కళాశాల సహాధ్యాయులను, సహోద్యోగులను, సహచరులను, బంధు  మిత్రులను, పరిచయస్తులను స్వయంగా కలుసుకుని మాట్లాడి విషయ సేకరణ చేసారు. ఆయన పాల్గొన్న అనేకానేక సాంస్కృతిక సభలు, సమావేశాలకు హాజరై రమణ ప్రసంగ రీతులను శ్రద్దగా గమనించారు.  రమణ గురించి సర్వం తెలుసు అనుకునే వారు కూడా నివ్వెర పోయే అనేక అంశాలను సావిత్రీ సాయి తన ఈ గ్రంధంలో పొందు పరిచారు. చక్కగా చదువుకుని, డాక్టరయి సమాజానికి సేవ చేయాలనే తండ్రి ఆశయానికి అనుగుణంగా బుద్దిమంతుడయిన రాముడి మాదిరిగా మసలుకుంటున్న రమణ,  ప్రత్యేక తెలంగాణా నినాదం పట్ల ఆకర్షితుడై, పదిహేడేళ్ళ ప్రాయంలోనే ఆనాటి విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొని, అరెస్టయి. జైలుకు వెళ్లి చిప్ప కూడు తిన్నవిషయం ఇందులో వెలుగు చూసింది. బాల్యంలో కాళ్ళకు  చెప్పులు కూడా లేకుండా మండుటెండలో తండ్రి వెంట బడికి పరుగులు తీసిన రమణ తదనంతర కాలంలో ఉన్నత చదువులు చదివి, ఉన్నతోద్యోగాలలో రాణించడం వెనుక దాగివున్న శ్రమదమాదులు ఈ రచనలో అడుగడుగునా కానవస్తాయి.
రమణకు  స్వతహాగా నాటకాలంటే అనురక్తి. బాల్యంలోనే అంకురించిన ఈ అభిరుచి ఆయనతోనే పెరిగిపెద్దదయింది. విద్యార్ధిగా వున్నప్పుడు, అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు, తదుపరి ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా రమణలోని నటనాసక్తి బయటపడుతూనేవుండేది. రేడియో నాటకాలంటే చెవి కోసుకునే రమణకు ఎలాగైనా సరే రేడియోలో నాటకం వేయాలనే కోరిక బలంగా వుండేది. సైఫాబాదు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేటప్పుడు మధ్యాన్న భోజన విరామసమయంలో కాలినడకన దగ్గరలో వున్న రేడియో స్టేషనువైపు వెళ్లి చూస్తూ,  లోపలకు ఎలా వెళ్ళడం అనుకుంటూ వుండేవారు. ఆయనలోని ఈ ఆకాంక్షకు అక్కడి గేటు దగ్గరి ఘూర్ఖా అడ్డుపడే వాడు. మొత్తం మీద అతడు లేని సమయం చూసుకుని లోపలకు ప్రవేశించి,  వేలూరి సహజానందను కలుసుకుని రేడియో నాటకాల్లో నటించాలనే తన అభిమతాన్ని వ్యక్తపరిచారు. వారి సలహా పాటించి, ఆడిషన్ లోఅర్హత సంపాదించి రేడియో నాటకాల్లో నటించగలగడం  తన జీవితంలో ఒక మరపురాని అధ్యాయం అని రమణే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నారు.
అభిప్రాయ బేధం వచ్చి విడిపోయిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ప్రసిద్ధ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణలను తిరిగి కలపడంలో  రమణ ప్రదర్శించిన కుశలత పాఠకులను ఆకట్టుకునే మరో అంశం. ఇద్దరూ తమతమ రంగాలలో ఉద్దండులే. మాట పట్టింపుగల మానధనులే. మరి ఎలా సయోధ్య కుదర్చడం! ముఖ్యమంత్రి కార్యాలయంలోని టెలిఫోన్ ఆపరేటర్  సాయంతో ఎవరు ఎవరికి ముందు ఫోను చేశారో వారిరువురికీ  తెలియకుండా వారిద్దరినీ సంభాషణలో కలిపిన వైనం రమణ చతురతకు నిదర్శనం. మంగళంపల్లి పేరు వింటేనే మండిపడుతున్న రామారావు నోటితోనే “కులీ కుతుబ్ షా గారూ! (హైదరాబాదు పాత నగరం అభివృద్ధికి ఏర్పరచిన కులీ కుతుబ్ షా పట్టణాభివృద్ధి సంస్థ పరిపాలనాధికారిగా రమణ చాలా కాలం పనిచేయడం వల్ల ఆయనకు లభించిన మారుపేరిది) మంగళంపల్లివారికి ప్రభుత్వం తరపున అఖండ సత్కారం చేయాలి, డేటు ఖరారు చేయండి” అనిపించారంటే రమణలోని చాతుర్యం, చాకచక్యం అర్ధం అవుతుంది.
ఎప్పుడూ దరహాస వదనంతో కానవచ్చే రమణకు చిన్ననాటి నుంచే హరికధలు అంటే అనురక్తి. పదహారేళ్ళ వయస్సులో సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్సవాలలో ఆయన చేసిన సీతాకల్యాణం హరికధా కాలక్షేపం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం మెడలో పూలదండతో, అంగవస్త్రంతో, పట్టుదోవతితో, నుదుట తిలక ధారణతో మెరిసిపోతూ వచ్చిన రమణని చూసి ఆశ్చర్య పడడం ఇంట్లో వాళ్ళ వంతయింది.
అలాగే, దేవస్థానం అనే సినిమాలో కూడా రమణ నటించారు. జనార్ధన మహర్షి రూపొందించిన ఈ సినిమాలో విశ్వనాద్, ఎస్పీ బాలసుబ్రమణ్యం సరసన నటించడం ఆయనకు మరో మరపురాని అనుభూతి.                 
 ఇటువంటి ఆసక్తికర అంశాలను అన్నింటినీ సేకరించి ఒక క్రమపద్దతిలో, అధ్యాయాల వారీగా విభజించి ఈ పుస్తకంలో పొందుపరచడానికి  సావిత్రీ సాయి పడిన శ్రమ కూడా తక్కువేమీ కాదనిపిస్తుంది ఇది చదివిన తరువాత.
పరిశోధక పుస్తకం అయినా చదివించే పుస్తకం రాసిన రచయిత్రి అభినందనీయులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి