5, నవంబర్ 2016, శనివారం

అమెరికాలో అలా....ఇండియాలో ఇలా...

రేపు (నవంబరు ఒకటి) ఈ సమయానికి సింగపూర్ వెళ్ళే విమానంలో ఉంటాను. అమెరికా ఎన్నికల దినం నవంబర్ 8 నాడు అక్కడే (సింగపూరులో) ఉంటాను కాబట్టి ఇవాళ పొద్దున్న ఎర్లీ ఓటింగుకి వెళ్లాను. అక్కడ లైన్ లో మా అమ్మాయి కూడా ఉంది. ఇద్దరం ఓటు వేసేశాం. అంతకు ఓ గంట ముందు మా అర్థాంగి కూడా ఓటు వేసేసి ఇంటి కొచ్చి గొప్పలు చెప్పుకుంది. ఎవరు, ఎవరికి  ఓటు వేశామో చెప్ప కూడదు. నా జాతకం ప్రకారం సాధారణంగా నేను ఎవరి కి ఓటు వేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓడి పోతారు. అంచేత నా సంగతి అమెరికాలో నవంబర్ 8 రాత్రికి తెలిసిపోతుంది. అదీ సంగతి.”
ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కోసం అమెరికా నుంచి సింగపూరు వెడుతూ వంగూరి చిట్టెన్ రాజు ఫేస్ బుక్ లో అక్టోబర్ 31 న పెట్టిన పోస్టింగు ఇది. 
శుక్రవారం నాడు హైదరాబాదులో ఉంటున్న మా అన్నయ్య రామచంద్రరావు గారు అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళ అబ్బాయి రాజేష్ తో మాట్లాడినప్పుడు అతడూ ఇదే సంగతి చెప్పాడు. ఇప్పుడే ఓటు వేసి వస్తున్నానని రాజేష్ ఫోనులో  చెబుతుంటే ‘అదేమిటి! ఎనిమిదో తేదీ కదా ఎలక్షన్లు’ అని ఆశ్చర్యపోవడం ఈయన వంతయింది. అప్పుడు ‘ఎర్లీ వోటింగు దాని కధాకమామిషూ’ రాజేష్ వివరించి చెప్పాడు.
పోలింగు సమయానికి వూళ్ళో లేనివాళ్ళు, లేదా ఆ రోజున వేరే పనులు వుండి ఓటు వేయలేని వాళ్ళకోసం ఏర్పాటు చేశారు ఈ ఎర్లీ పోలింగు పద్ధతి. ముందుగా వెళ్లి ఓటు హక్కు వినియోగించు కోవడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా కూడా ఈ సారి ఈ విధంగానే ఎర్లీ ఓటింగు విధానంలో ఓటు వేసేశారు కూడా.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎవరయినా విదేశస్తులు ఆ దేశం వెడితే అసలక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని కూడా వారికి అనిపించదు. ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్లకు. ఎందుకంటే మన దగ్గర ఎన్నికలు వస్తే ఆ హడావిడి చెప్పాల్సిన పనిలేదు. బహిరంగ సభలు, ఉపన్యాసాలు, ఊరేగింపులు, వాల్ పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగులు, ఇలా ఎన్నికల యుద్ధ వాతావరణం చాలా కాలం కొనసాగుతుంది. అమెరికాలో కూడా ఈ గందరగోళం కొంత లేకపోలేదు. కాకపొతే అది ఇళ్ళల్లో టీవీలకే పరిమితం. టౌన్ హాల్స్ లో జరిగే ఎన్నికల సమావేశాలకు ఓ వెయ్యి మంది హాజరయితే అదొక భారీ బహిరంగ సభ కింద లెక్క.
కాకపొతే ఇలా మర్యాదగా ఎన్నికలు జరుపుకుంటూ పొతే మర్యాద కాదనుకున్నారేమో కానీ, ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఇద్దరూ పోటీపడి తమ ఎన్నికల  ప్రసంగాల్లో అనకూడని మాటలు అన్నారు. పలకకూడని పలుకులు పలికారు. చేయకూడని ఆరోపణలు చేసుకున్నారు. వీటిని ఇంటింటికీ మోసుకు వెళ్ళడంలో అక్కడి మీడియా కూడా తన పాత్ర అవధుల మేరకు పోషించిందనే చెప్పాలి.
ఇదంతా చూసి, చదివి, విని ఇక్కడ అందరం అక్కడేదో జరిగిపోతోందన్న భ్రమల్లో వున్నాం. కానీ ఏమీ జరగదు, ఎనిమిదో తేదీన ఎన్నిక తప్ప.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి