4, నవంబర్ 2016, శుక్రవారం

పుష్కరం నాటి అమెరికా


నేను హైస్కూల్ లో చదువుకునే రోజుల్లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారు అమెరికా సందర్శించి – ‘నేను చూసిన అమెరికాఅని ఒక పుస్తకం రాశారు. అది చదివి ఆ పుస్తకానికి అలా ఎందుకు పేరు పెట్టారా అని అనుకునేవాడిని. ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు అమెరికాలో అయిదు మాసాలు వుండి వచ్చిన తరవాత అర్ధమయింది. అదొక సువిశాల దేశం. టూరిస్టులుగా వచ్చిన వాళ్ళే కాదు, ఎన్నో ఏళ్లుగా అక్కడ వుంటూ వచ్చిన వాళ్ళు కూడా అమెరికాని పూర్తిగా చూడడం కుదరని పని. అందుకే చూసిన మేరకే అవగాహన చేసుకుని అక్షరబద్ధం చేసేందుకే ఈ ప్రయత్నం.
వీసాలు అంత కఠినం
అమెరికా వెళ్లడం అన్నది మన దేశంలో చాలా మందికి తీరని కల. ఎందుకంటె వీసా నిబంధనలు అంత కఠినతరం. డబ్బున్నవాళ్ళు కూడా మరో మరో విదేశానికి వెళ్లి వచ్చినంత సులభంగా అమెరికా వెళ్ళలేరు. అలాగే ఆనాటి సోవియట్ యోనియన్ కూడా. అయితే, ఓ పుష్కర కాలం క్రితం ఆకాశవాణి పుణ్యమా అని మాస్కోవెళ్లి అయిదేళ్ళు రేడియో మాస్కోలో పనిచేసివచ్చాను. ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో అమెరికాకు పోటీగా నిలబడిన మరో ఏకైక అధికార ధ్రువం సోవియట్ యూనియన్. అనేక దశాబ్దాల తరబడి అప్రతిహతంగా సాగిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంతిమ ఘడియలు చూడగలిగే అరుదయిన అవకాశం లభించిన నేను –‘మార్పు చూసిన కళ్ళు ‘ – అనే పేరుతొ ఆనాటి అనుభవాలను గ్రంధస్తం చేయాలనుకున్నాను. కానీ అది తీరని కోరికగానే మిగిలిపోయింది. ( తదనంతర కాలంలో వచ్చిన బ్లాగులపుణ్యమా అని పుస్తకరూపంలో తీసుకురాలేకపోయిన దానిని - దాదాపు పదిహేడు భాగాలు - నా బ్లాగులో (http://www.bhandarusrinivasarao.blogspot.com) పొందుపరచగలిగాను.పోతే, ఇప్పుడు- సియాటిల్ లో వుంటున్న మా పెద్దకుమారుడు సందీప్, అమెరికా చూసే అవకాశాన్ని కల్పించి సోవియట్ యూనియన్ అమెరికాలు రెండింటినీ చూడగలిగిన కొద్దిమంది హైదరాబాద్ జర్నలిష్టులలో నన్ను కూడా చేర్చాడు. నాకు తెలిసి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్లు ఐ వెంకటరావు,కే. శ్రీనివాసరెడ్డి  ఈ రెండు దేశాలను చూసినవారిలో వున్నారు. ఈ అవకాశం ఇకముందు  ఎవరికీ దొరికే వీలు కూడా లేదు. ఎందుకంటే అంత పెద్ద కమ్యూనిస్ట్ దేశం - అంగ వంగ కలింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమై చరిత్ర పుటల్లో మిగిలిపోయింది. కాగా, మిత్రుడు మాగంటి కోటీశ్వర రావు పూనికతో ఎలాటి టెన్షన్ పడకుండా లభించిన పది సంవత్సరాల వీసాలతో నేనూ మా ఆవిడ నిర్మల, హైదరాబాదులో 2003 సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం మలేసియన్ ఎయిర్ లైన్స్ లో బయలుదేరి కౌలాలంపూర్ మీదుగా సుమారు ముప్పయి గంటలు ప్రయాణం చేసి తిరిగి అదే రోజు, అంటే శనివారం నాడే అమెరికాలోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటయిన లాస్ ఏంజెల్స్ చేరుకున్నాము. భూమండలానికి ఆవలవైపువున్న దేశానికి చేరడంవల్ల కాలగమనంలో వచ్చిన మార్పు ఇది. (2003)
(ఆరంభానికి ప్రారంభం) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి