సూటిగా...సుతిమెత్తగా....
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 31-03-2016, THURSDAY)
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 31-03-2016, THURSDAY)
ఈ నెల మొదట్లో ఒకే రోజున మొదలయి ఒక
రోజు తేడాతో ముగుస్తున్నాయి అంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల శాసనసభల బడ్జెట్
సమావేశాలు.
ఎలా మొదలయ్యాయి, ఎలా ముగిసాయి అన్నదానికంటే ఎలా జరిగాయి అన్న ప్రశ్నకు మాత్రం
షరామామూలుగా అనే జవాబే చెప్పాల్సి వుంటుంది. రెండు రాష్ట్రాల సభలు ఒకే ఆవరణలో ఒకే
సమయంలో జరిగాయి కాబట్టి పోలిక సహజం. ఆమాటకు వస్తే తెలంగాణా సభే సజావుగా సాగిందని
ఆంధ్రప్రదేశ్ సభలోని సభ్యులే వ్యక్తిగత సంభాషణల్లో చెప్పుకుంటున్న సంగతి సత్య
దూరమేమీ కాదు. దీనికి కారణం తెలంగాణా సభలో సరయిన సంఖ్యాబలం కలిగిన ప్రతిపక్షాలు
లేకపోవడం అనే వాదన కూడా వుంది. ఏదిఏమైనా తెలంగాణా సభ జరిగిన తీరే బాగుందని రెండు
సభల పనితీరును టీవీల్లో చూసిన వాళ్ళు మెచ్చుకుంటున్నారు.
పైకి అంగీకరించడానికి అహం
ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆంతరంగికంగానయినా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన
అవసరాన్ని ఈ సందర్భం సూచిస్తోంది.
ఈ మధ్యకాలంలో అంటే సమైక్య రాష్ట్రంలో
కూడా పద్దులపై గిలెటిన్ వేటు వేసి ‘మమ’ అనిపించడం మినహా, శాఖల వారీ పద్దులపై సభలో చర్చ జరిగిన సందర్భం గుర్తులేదు. ఈసారి
తెలంగాణా శాసనసభ ఈ విషయంలో ఆదర్శప్రాయంగా నడుచుకుందనే చెప్పాలి. అంతకంటే మించి
సభ్యుల ప్రవర్తనను కట్టడి చేయడంలో కూడా కొత్త పుంతలు తొక్కిందనే ఒప్పుకోవాలి.
వాయిదా తీర్మానాలపై పట్టుబట్టి సమయం వృధా చేసే సాంప్రదాయానికి ఈసారి గట్టి కళ్ళెం
వేసారు. పని దినాల్లో చాలావరకు ఎజెండా
ప్రకారమే సభ నడుచుకోవడం ఓ విశేషం. అలాగే శని, ఆది వారాల్లో సయితం విరామం ఇవ్వకుండా
సభ నడిపిన తీరు కూడా ఓ కొత్త ప్రయోగం.
అలాగని పాలక పక్షం, ప్రతిపక్షాలపట్ల చాలా
ఉదారంగా వ్యవహరించిందని అర్ధం కాదు. అయితే, గతంతో పోల్చి చూసుకున్నప్పుడు తెలంగాణా శాసనసభ పని తీరు బాగా మెరుగు
పడిందనే అనుకోవాలి.
కాకపొతే తెలంగాణా సాగు నీటి
ప్రాజెక్టుల రీడిజైనింగ్ విషయంలో సభను
వేదికగా చేసుకుని పవర్ పాయింటు
ప్రెజెంటేషన్ ఇవ్వాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కొంత వివాదాస్పదం అయింది.
ఇటువంటి సాంప్రదాయం లేని మాట నిజమే అయినా గతంలో ఇలా జరిగిన సందర్భాలు లేకపోలేదు.
కాకపోతే ఆ సందర్భాలు వేరు. ఉమ్మడి రాష్ట్రంలో సురేష్ రెడ్డి స్పీకర్ గా
వున్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రసంగించారు.
పవర్ పాయింటు ప్రెజెంటేషన్ సాయంతో ఆయన గ్రామీణాభివృద్ధి అనే అంశంపై చాలా
ఆసక్తికరమైన ప్రసంగం చేసారు.
అయితే అందుకోసం శాసన సభను ప్రత్యేకంగా
సమావేశ పరిచారు. అందునిమిత్తం గవర్నర్
ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేశారు. ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతి ప్రసంగాన్ని వినే
సౌలభ్యం కలిగించారు.
ఈసారి అలా కాదు. ఇది ప్రత్యేక సమావేశం
కాదు. అందుకే కాబోలు శాసన మండలి సభ్యులను గేలరీలకి పరిమితం చేస్తూ తగిన జాగ్రత్తలు
తీసుకున్నారు.
సభలో పవర్ పాయింటు ప్రెజెంటేషన్ అన్నది
నిజానికి అంత అభ్యంతర పెట్టాల్సిన అంశం కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని
మార్పులు చేసుకుంటూ పోవడం సహజం. ఒకప్పుడు సభాకార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాల
విషయంలో కూడా ఇలాగే అభ్యంతరాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడవి అందరికీ ఆమోదయోగ్యం
అయ్యాయి.
పవర్ పాయింటు ప్రెజెంటేషన్ పట్ల
అభ్యంతరం తెలపడానికి ప్రతిపక్షాలు వాటి కారణాలు అవి చెబుతున్నాయి. సభలో ఒక అంశం
మీద చర్చ జరిగినప్పుడు, ప్రభుత్వం తన వాదన
వినిపించినప్పుడు ప్రతిపక్షాలకు కూడా అటువంటి అవకాశం వుండాలన్నది వాటి వాదన. తమ
వాదనకు మద్దతుగా పవర్ పాయింటు ప్రెజెంటేషన్ ఇచ్చే వెసులుబాటు తమకూ కల్పించాలని
ప్రతిపక్ష సభ్యులు కోరుతున్నారు. లేని పక్షంలో సభకు హాజరు కాబోమని సంకేతాలు
స్పష్టంగానే ఇస్తున్నాయి. ఈ ప్రెజెంటేషన్
కు సంబంధించిన పెన్ డ్రైవ్ లు సభ్యులు అందరికీ ఇస్తామని, ముఖ్యమంత్రి మాట్లాడిన తరువాత విషయాలను నిపుణులతో మాట్లాడుకుని మళ్ళీ
సభలో వాటిని ప్రస్తావించి,
సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం వుంటుందని
ప్రభుత్వం అంటోంది కానీ దానితో ప్రతిపక్షాలు సంతృప్తి పడిన దాఖలా కానరావడం లేదు. ఈ
వ్యాసం రాసే సమయానికి ఈ ప్రతిష్టంభన
కొనసాగుతూనే వుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారం
ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నవారికెవ్వరికీ రుచించని విధంగా వుంది. ఇందుకు పాలక
ప్రతిపక్షాలు రెండింటిదీ సమాన బాధ్యత. అయితే
దాని స్వీకరించడానికి ఉభయులు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ సభలో రెండే రెండు
పక్షాలు. ఒకరి పొడ ఒకరికి గిట్టని దాయాదుల పోరును అక్కడి పరిస్తితి తలపిస్తోంది.
సమావేశాల తొలి రోజుల్లోనే ప్రతిపక్షం
వై.ఎస్.ఆర్.సీ.పీ. అసెంబ్లీ స్పీకర్ పైనా, రాష్ట్ర ప్రభుత్వం పైనా ప్రవేశపెట్టిన
అవిశ్వాస తీర్మానాలతోనే సభ రగిలిపోయింది. సమావేశాలకు ముందు టీడీపీ తెర తీసిన
‘ఫిరాయింపుల పర్వం’, సమావేశాల చివర్లో కూడా కొనసాగడంతో
ప్రతిపక్షం ఆత్మ రక్షణలో పడిపోయింది. ఇక ప్రతిపక్ష సభ్యురాలు రోజా పై ఏడాది
పాటు వేసిన బహిష్కరణ వేటు కోర్టు గుమ్మం దాకా వెళ్ళింది. ఒక దశలో ఈ వ్యవహారం
శృతిమించి, రెండు రాజ్యాంగ వ్యవస్థల నడుమ అగాధం సృష్టించబోతున్నదా అనే సందేహాలను
కలిగించింది. గోటితో పోయేదానికి గొడ్డలి అవసరమా అనే నానుడిని గుర్తు చేసింది.
పట్టుదలలు, పంతాల నేపధ్యంలో వివేచన పక్కకు తప్పుకుంటుంది అనే పెద్దల వాక్కును
రుజువు చేసింది.
మొదట్లో సంతాప తీర్మానాలు, చివర్లో అంబేద్కర్ శతజయంతి నిర్ణయాలు మినహాయిస్తే సభ జరిగిన పదహారు
రోజుల్లో (బుధవారం నాటికి) ఏనాడూ సభ సజావుగా, ఓ పధ్ధతి ప్రకారం జరిగిందన్న అభిప్రాయం
ఎవ్వరికీ కలగలేదు. మాటమాటకు అడ్డంకులు, అభ్యంతరాలతోనే పుణ్యకాలం గడిచిపోయింది. సభాగౌరవానికి ఈ వ్యవహార శైలి ఎంతమాత్రం వన్నె
తెచ్చేది కాదన్న వాస్తవాన్ని పాలక,
ప్రతిపక్షాలు యెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
అనుభవ రాహిత్యం ప్రతిపక్షానికి పెద్ద
అడ్డంకి అనుకుంటే పుష్కలమైన అనుభవం వున్న పాలకపక్షానికి కూడా ఏమంత మంచిపేరు రాకపోవడం
ఇందులో విశేషం. పక్కన సాగుతున్న తెలంగాణా అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష సభ్యుడిని
నిబంధనలతో లొంగతీసి, హద్దులో వుంచిన తీరును ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం ఒక పాఠంగా
తీసుకోవాలి.
పొతే, ఎన్ని విబేధాలు వున్నా అటు తెలంగాణా
శాసన సభ, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండూ ఎమ్మెల్యేల జీత భత్యాలను రికార్డు
స్థాయిలో పెంచే ప్రతిపాదనలను ఆమోదించాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వై.ఎస్.ఆర్.సీ.పీ.సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర రెడ్డి
వ్యతిరేకించడం కొసమెరుపు.
ఇక అసలు విషయం ఒకటి బుధవారం ఏపీ సభ ముగిసేలోగా తేలాల్సి వుంది. ద్రవ్య వినిమయ
బిల్లుని సభ ఆమోదించే సమయంలో,
పార్టీ మారిన వై.ఎస్.ఆర్.సీ.పీ. సభ్యులు పార్టీ
జారీ చేసిన విప్ ని ధిక్కరిస్తారా లేదా అనే విషయం. గతంలో మాదిరిగానే స్పీకర్
మూజువాణీ ఓటుతో ఆమోదిస్తే ఇక చిక్కే లేదు. అది ఎలాగూ జరుగుతుంది.
ఉపశ్రుతి:
1959 ఆగష్టు ఒకటో తేదీన ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, గవర్నర్ ప్రసంగాని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానంగా
ఒక విషయం చెప్పారు.
“ఎవరూ చెప్పని ఒక విషయం బాగారెడ్డి గారు చెప్పారు. మిగిలినవారికి ధైర్యం లేక చెప్పలేదని నా ఉద్దేశ్యం. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏమంటే ఏమో,
న్యాయం అని తోచినప్పుడు కూడా పైకి చెప్పడానికి సంకోచిస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చే మొత్తం (ఆదాయంలో) యాభయ్ శాతం సాలరీల కింద ఇస్తున్నారు. వాట్ ఈజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్?
ఒక్క శాతం. పన్నులు కడుతున్న రైతాంగానికి,
పల్లెతూరివారికి తెలియదు కానీ,
తెలిస్తే ముఖ్యమంత్రి మొదలుకుని కిందివరకు రాళ్ళతో కొడతారు. 330 లక్షలమంది ప్రజానీకం రాష్ట్రంలో వుంటే, ఒక లక్షమందో, రెండు లక్షల మందో చదువుకున్నవాళ్ళమని మనం అనుకుని,
వచ్చే రాబడిలో సగం మొత్తాన్ని పంచేసుకుంటూ- (వుంటే బాగుంటుందా!) ఎవరేమి అడిగినా డబ్బు లేదంటాము. కాలువ రిపేరు చేయమంటే డబ్బు లేదంటాము. విద్యుచ్చక్తి ఇవ్వవయ్యా అంటే డబ్బు లేదంటాము. శ్రీ రామాచార్యులు గారు ధర్మల్ స్టేషన్ పెట్టండి,
రాయదుర్గం నుండి లైను వేస్తె ఎన్నో ఊర్లకి కరెంటు వస్తుంది అని అడిగితె అలాట్ మెంటు లేదని సమాధానం చెబుతాము. పాపం ప్రజలకి తెలియడం లేదు. అమాయకులుగా వున్నారు. చదువు సంధ్యలు లేవు. వారికి లక్ష అంటే ఏమిటో,
కోటి అంటే ఏమిటో తెలియదు. వాళ్లకి మన గురించి అసలు నిజాలు తెలిస్తే మనల్ని బయటకు పంపుతారు. 'మీరూ వద్దు,
మీ రాజ్యమూ వద్దు,
మీ గుమాస్తాలు వద్దు. బాబూ మమ్మల్ని విడిచిపెట్టండి,
మా బతుకు మేము బతుకుతాము'
అంటారు. ఆ పచ్చి నిజాన్ని బాగారెడ్డి గారు చెప్పినందుకు నేను ఆయన్ని అభినందిస్తున్నాను"
ఇది ఒక ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రసంగం అంటే నమ్మడం సాధ్యమా. ఒక ప్రతిపక్ష నేత కూడా ఈ విధంగా నిజాలు మాట్లాడడానికి సాహసించడని అనుకునే రోజులివి.
(30-03-2016)
శాసన సభలలో మాటిమాటికి అధ్యక్షా అధ్యక్షా అని పిలుస్తుంటే కంపరంగా ఉంటుంది. సభ్యులు ఒకరికొకరు మాట్లాడకూడదంట. అన్నీ అధ్యక్షా తోని చెప్పాలంట. ఇవేమి పిచ్చి నిబంధనలు. జీతాలు పెంచుకోవటంలో మాత్రం ఎక్కడలేని ఏకాభిప్రాయం కుదురుతుంది.
రిప్లయితొలగించండి