(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 06-12-2015, SUNDAY)
చెన్నై కంటి నీరు ధారగా కారుతోంది.
తెలుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రం తమిళనాడు
రాజధాని చెన్నై వరుస వర్షాలకు కుదేలయిపోయింది. పక్కనే వున్న సముద్రంలోని నీళ్లన్నీ
వాన రూపంలో నగరాన్ని యావత్తు ముంచెత్తి వేశాయా
అన్నట్టు చెన్నపట్నం తల్లడిల్లి పోయింది. వందేళ్ళ కాలంలో ఇలాటి పెనువృష్టిని చూసి
ఎరగమని లెక్కలు చెబుతున్నారు. టీవీ తెరలపై అక్కడి దృశ్యాలను చూస్తున్నవారికి నిజమే
అనిపిస్తోంది.
ఈ భీకర వృష్టి, దాని
భయంకర ఫలితం మానవ తప్పిదం కాదు. ఇవి ప్రకృతి ఉత్పాతాలు. ఇలాటివి జరిగినప్పుడు,
వాటి ఉధృతిని గమనించినప్పుడు ప్రకృతి ప్రతాపం ముందు తను యెంత
అల్పుడన్నది మనిషికి తెలిసి రావాలి. కానీ ఈ గుణపాఠం నేర్చుకున్న దాఖలా లేదు.
చెన్నై వర్ష బీభత్సం గురించి మీడియా వెయ్యి
గొంతులతో వివరిస్తోంది. ఇంతటి విపరీత పరిణామాన్ని ముందెవ్వరూ ఊహించినట్టు లేదు.
చెన్నై ప్రధాన వీధులు, రైల్వే ప్లాటుఫారాలు, సందులు, గొందుల్లో వరద ప్రవాహాలను, నీట
మునిగిన భవంతులను చూసిన తరువాత కానీ
జరిగిన ఉత్పాతం తాలూకు ఉధృతం అర్ధం కాలేదు. జనజీవనాన్ని ఏదో కొద్ది కాలం పాటు
స్తంభింప చేసే షరా మామూలు తుపాను తాకిడే
అనుకున్నారు కానీ, అసాధారణ రీతిలో అతలాకుతలం చేసే ప్రకృతి
వైపరీత్యంగా అంచనా వేయలేకపోయారు.
తుపాను, భూకంపాల వంటివి సంభవించినప్పుడు జరిగిన
నష్టం ఏపాటిదన్నది రోజులు గడిస్తే కానీ పూర్తిగా అవగతం కాదు. వాస్తవ ప్రాణ నష్టం, ఆస్తి
నష్టం ముందు కంటికి కనిపించిన దానికంటే అధికంగా వుండే అవకాశాలే ఎక్కువ.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే వచ్చి
పరిస్తితులను స్వయంగా చూసివెళ్ళారు. దాదాపు రెండువేల కోట్ల రూపాయల మేరకు ఆర్ధిక
సాయం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కనీసం ఐదువేల కోట్లయినా కావాలని
ప్రధానిని అభ్యర్ధించారు. సరే ఇవన్నీ షరా మామూలుగా జరిగిపోయే విషయాలే. అయిదు వేలు
కాదు, పదివేల కోట్లు సాయం అందినా భౌతిక నష్టాలు పూడ్చుకోవడానికి పనికి
రావచ్చేమో కానీ చెన్నై ప్రజలు దాదాపు వారం రోజులుగా పడ్డ మానసిక వేదనను పూర్తిగా
తొలగించవచ్చన్న పూచీ లేదు.
చుట్టూ నీళ్ళే! కానీ, గుక్కెడు కూడా అవి తాగడానికి పనికి రావు. అరకొర
విద్యుత్ సరఫరా అవుతుంటేనే సర్దుకుపోవడం కష్టం. అలాటిది రోజుల తరబడి అంధకారం.
పక్కింటికి పోవాలంటేనే పదిసార్లు తాళాలు లాగిచూసుకుని, అనేక జాగ్రత్తలు చూసుకుని అడుగు బయట పెట్టే రోజులు.
అలాటిది, పొరుగు వారితో కూడా ఒక మాట చెప్పకుండా, కట్టుబట్టలతో బయటపడి ప్రాణాలు ఉగ్గబట్టుకుంటూ, ఎక్కడికి వెడుతున్నామో తెలియకుండా నడుంలోతు
నీళ్ళల్లో దాదాపు ఈదుకుంటూ వెళ్ళాల్సిన దుస్తితి. చంటి పిల్లలకు పాలు, పెద్దవారికి
వేళకు తిండీ మందులు సరి చూసుకునే వ్యవధానం వుండదు. ఒక కష్టం కాదు, ఒక
ఇబ్బంది కాదు, పగవారికి కూడా రాకూడదు అనుకునే రీతిలో,
పక్కవాడికి కూడా చెప్పుకోవడానికి వీలులేని పరిస్తితిలో, ప్రాణాలు
దక్కించుకోవడం ఎల్లా అని రోజుల తరబడి
దిక్కుతోచని స్తితిలో కాలం గడపడం అంటే యెంత దుర్భరమో చెన్నై ప్రజలకు అనుభవంలోకి
వచ్చివుంటుంది. ఆ సమయంలో వారి మానసిక
స్తితి గురించి ఊహించుకోవడం కూడా దుర్భరం.
ప్రస్తుతం చెన్నై వాసుల పరిస్తితి ఎలావుందంటే వర్షం పేరు చెబితేనే వారికి కంటి మీద కునుకు వుండడం లేదు. ఆకాశం
వైపు చూస్తున్నారు, మళ్ళీ వాన కురుస్తుందేమో అన్న భయంతో. ఆకాశం
వైపే చూస్తున్నారు ఎవరయినా హెలికాప్టర్ లో
వచ్చి ఆదుకుంటారేమో అనే ఆశతో. ఆశల సంగతేమో కానీ భయాలు మాత్రం నిజమవుతున్నాయి,
కాస్త తెరిపి ఇచ్చినట్టే కానవచ్చి మళ్ళీ వాన ముసురు కమ్ముకుంటోంది అనే
తాజా వార్తల నేపధ్యంలో. వాతావరణ శాఖ అంచనాలు కూడా వారి ఆందోళనలను రెట్టింపు చేస్తున్నాయి.
కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ చెన్నై
పరిస్తితి గురించి లోక సభలో ఒక ప్రకటన చేస్తూ, ‘ప్రస్తుతం
చెన్నై మహా నగరం, చుట్టూ జలరాశి కమ్ముకున్న దీవిలా వుంద’ని
పేర్కొనడం అక్కడి వాస్తవ పరిస్తితికి అద్దం పడుతోంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ స్పందించి
కొన్ని సహాయక చర్యలకు నడుం బిగించాయి. చెన్నై నగరానికి వెళ్ళే అన్ని జాతీయ
రహదారులపై టోల్ వసూలును డిసెంబర్ పదకొండువరకు నిలిపివేయడం జరిగింది. వర్షాల
తాకిడికి ముందే చెన్నై వెళ్ళడానికి ఎయిర్ ఇండియా విమానాల టిక్కెట్లు కొనుక్కున్న
ప్రయాణీకులు ఎటువంటి అదనపు రుసుం లేకుండా చెన్నై దగ్గరలో వున్న విమానాశ్రయాలకు
వెళ్ళడానికి వెసులుబాటు కల్పించారు. వాన నీరు ముంచెత్తడం వల్ల చెన్నై ఎయిర్ పోర్ట్
లో చిక్కుకు పోయిన వందలాదిమంది ప్రయాణీకులను, ఆర్కోణం
తీసుకువెళ్ళి అక్కడినుంచి భారత వైమానిక దళం విమానాల్లో హైదరాబాదు తరలించారు. సైనిక దళాలు పడవలతో
రంగప్రవేశం చేసి వరదలు చుట్టూ ముట్టిన ప్రాంతాలనుంచి ఆపన్నులను సురక్షిత
ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సహాయ శిబిరాలు నిర్వహిస్తున్నారు. స్వచ్చంద సంస్థలు ఆహార
పదార్ధాలు, ఇతర నిత్యావసర సామగ్రి చేతనయిన మేరకు అందిస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకు పోయిన
వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు జారవిడుస్తున్నారు.
ప్రభుత్వాలు కల్పించుకుని యెంత సాయం అందించినా
ఇంతటి విపత్తులు వాటిల్లినపుడు అవి అరకొరగానే అనిపించడం సహజం. కమ్యూనికేషన్
వ్యవస్థ దెబ్బతినిపోయిన పరిస్తితుల్లో, ఇళ్ళ కప్పులపై నిలబడి ఆహార పొట్లాల
కోసంఎదురు చూసే ప్రజల్ని టీవీల్లో చూసినప్పుడు కడుపు తరుక్కుపోవడం సహజం.
మొలలోతు నీళ్ళల్లో ప్రాణాలు అరచేతిలో
పెట్టుకుని, పసిబిడ్డల్ని పొదివిపట్టుకుని వెడుతున్న
భార్యాభర్తల్ని చూసినప్పుడు కూడా మనసు అలాగే చివుక్కుమంటుంది.
ఇలాటి ప్రకృతి వైపరీత్యాలు గురించి
వింటున్నప్పుడు, చేస్తున్నది సరే, ఇంతకంటే
మించి చేయలేమా అనిపిస్తోంది. నిజమే. వరదలు,
భూకంపాలు, తుపానులు, సునామీలు,
కరవులు వీటన్నిటినీ సమర్ధవంతంగా ఎదుర్కోవడం మనిషి శక్తికి మించిన పని.
ఉపశమన కార్యక్రమాలు మినహా వాటి పరిణామాలనుంచి, పర్యవసానాలనుంచి పూర్తిగా బయట పడడం అసాధ్యం అన్నది అందరికీ
తెలిసిన విషయమే. అయితే ఒక విషయం మరిచి పోకూడదు. ఉత్పాతాలు, ఉపద్రవాలు
ప్రకృతి ప్రసాదం కావచ్చు. కానీ వాటి పర్యవసానాలు,
దుష్పరిణామాల స్థాయి, ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరడం అన్నది మాత్రం
మనిషి పుణ్యమే. అతగాడి స్వయంకృతాపరాధమే.
ఇక్కడ మనుషులంటే చెన్నై నగర పౌరులు కారు. అధికారగణం. వారిని శాసించే రాజకీయ
శక్తుల సమూహం.
బ్రిటిష్ వారి
కాలంనుంచి ప్రఖ్యాత నగరంగా విలసిల్లిన చెన్నపట్నం, అభివృద్ధి
పేరుతొ విచ్చలవిడిగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్ధపు ఆలోచనలకు
బలయిపోయింది. ప్రణాళికా బద్ధంగా సాగాల్సిన భవననిర్మాణాలు,
రాజకీయ పార్టీల వత్తాసుతో, అధికారుల కుమ్మక్కుతో నిబంధనలకు మంగళం పాడాయి.
వరద నీరు, మురుగు నీరు సులభంగా పారాల్సిన ప్రాంతాలన్నీ అక్రమార్కుల ఆక్రమణకు గురయ్యాయి.
చెరువులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. కూమ్, అడయార్
వంటి నదులు ఆక్రమణల కారణంగా కుంచించుకు పోయి మురికి నీటి కాసారాలుగా తయారయ్యాయి.
అనుకోని వరదలు వచ్చినప్పుడు పొంగి పొరలకుండా అడ్డుకునే కరకట్టలు కలికానికి కూడా
కానరాకుండా పోయాయి. ఏతావాతా ఇదిగో మిగిలింది ఇదే. జరిగింది ఇదే. భారీ వర్షాలకు
చెన్నపట్నం మునిగిపోయింది అని జనాలు వింతగా చెప్పుకునే విషమ పరిస్తితి.
ఇదొక అంకం. చెన్నైలోనే కాదు. అన్ని రాష్ట్రాలలోను,
అన్ని నగరాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్తితి. రెండువేల సంవత్సరంలో
హైదరాబాదులో పడ్డ వర్షాలకు ట్యాంక్ బండు పొంగిపొరలి వచ్చిన మూసీ వరదలు సృష్టించిన భయంకర పరిస్తితులు
పాలకులు మరచిపోయారేమో కానీ ఆ చేదు అనుభవాలు, అనుభవించిన జనాలకు మాత్రం ఇంకా జ్ఞాపకం వున్నాయి.
ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ప్రభుత్వాలు
నేర్చుకోవాల్సింది మరోటి వుంది.
జలదిగ్బంధంలో చిక్కుకు పోయిన ప్రజలకు ఆహారం సరఫరా
చేసే క్రమంలో వారికి హెలికాప్టర్ల ద్వారా పులిహోర పొట్లాలు జారవిడుస్తుంటారు.
పులిహార అయితే కొన్ని రోజులు నిలవ ఉంటుందన్న అభిప్రాయం కావచ్చు. కానీ చుట్టూ
నీళ్ళు వున్నా తాగడానికి వీల్లేని ఆపన్నులకు ప్రధమంగా కావాల్సింది శుభ్రమైన నీరు.
లేనిపక్షంలో, కాలుష్యమైన నీళ్ళు తాగి లేనిపోని అంటువ్యాధుల
బారిన పడే ప్రమాదం పొంచి వుంటుంది. రోజుల తరబడి నీళ్ళు నిలవ వుండే పరిసరాల్లో
అంటువ్యాధులు ప్రబలితే వాటిని అరికట్టడం ఒక పట్టాన సాధ్యం కాదు. ప్రభుత్వ అధికార
వర్గాలు సహాయక చర్యల విషయంలో ఇటువంటి కీలకమైన
అంశాలను గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని
సాధ్యమైనంత తగ్గించి ఆహార పదార్ధాలను ఇతర నిత్యావసర సామాగ్రిని బాధితులకు అందించే
ప్రయత్నం చేయగలిగితే ఉత్తరోత్తరా పర్యావరణానికి వాటిల్లే ముప్పును తగ్గించిన
వారవుతారు.
కష్టాలు కలకాలం వుండవు. ఇటువంటి సందర్భాలలో
ప్రభుత్వాలకంటే ప్రజలే నిబ్బరంగా వ్యవహరించిన దాఖలాలు అనేకం. నష్టం భారీ స్థాయిలో
సంభవించినప్పుడు ప్రభుత్వాలు యెంత పెద్ద ఎత్తున సాయం అందించినా అది జరిగిన
నష్టాన్ని పూడ్చలేదు.
ప్రకృతి ప్రకోపాలు జీవితాల్లో భాగం అయిపోయాయి.
చెన్నై ప్రజలు కూడా గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు ముంబై పౌరుల మాదిరిగానే అత్యంత
నిబ్బరంగా వ్యవహరించినట్టు సాంఘిక మాధ్యమాల ద్వారా తెలుస్తోంది.
స్పందించడం మానవనైజం. సాంఘిక మాధ్యమాల్లో ఇది
బాగా కానవస్తోంది. ఎక్కడెక్కడివాళ్ళు ‘హెల్ప్ చెన్నై’ అని నినదిస్తున్నారు.
బాధితులకు చేరుతుందన్న నమ్మకం లేకపోయినా ‘ఈ కష్ట కాలంలో మీ వెంటే మేము’ అనే
సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
‘మా ఇంటికి రండి, మా
ఇంటి తలుపులు మీకోసం తెరిచే ఉంచాము’ అంటూ
చెన్నైలో సురక్షిత ప్రాంతాల్లో వున్న
ప్రజలు, ఆపదలో చిక్కుకున్న తమ తోటి ప్రజలకు భరోసా ఇస్తూ
పోస్టింగులు పెట్టారు. నిజంగా ఇది ముదావహం.
వీటివల్ల బాధితులకు ఒరిగేదేమీ లేకపోవచ్చు. కానీ
మానవత్వం ఇంకా బతికే వుంది అనే నిజం నలుగురికీ తెలుస్తుంది. (05-12-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com
మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner
చెన్నైకి వచ్చిన ఉపద్రవం ఘోరమైనదే; చాలావరకు మానవతప్పిదమే కారణం, సందేహం లేదు. కొంతమంది స్వార్ధపరులు చెసిన అకృత్యాలకి సామాన్యజనం శిక్ష అనుభవిస్తున్నారు.
రిప్లయితొలగించండి1864 లో మచిలీపట్నాన్ని తాకిన తుఫాను జనాల్ని అతలాకుతలం చేసిందట ("బందరు ఉప్పెన" అంటారు);30 వేల మంది పోయారట. అలాగే 1977 లో దివిసీమ కూడా తుఫాను బీభత్సానికి గురయి, 15 వేల మంది జనం బలయ్యారు. ఆంధ్ర రాష్ట్రనికి సంభవించిన భారీ "విపత్తుల"లో ఇవి కొన్ని.
అప్పటికీ ఇప్పటికీ మనం చాలా "ముందుకు" వెళ్ళాం. ఎంతో "ప్రగతి" సాధించాం. అదంతా మీరు చక్కగా వర్ణించారుగా (సామాజికబాధ్యత పట్టని బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నియంత్రించవలసిన అధికారులు తమ బాధ్యతని ప్రజాశ్రేయస్సుని గాలికి వదిలేయడం, రాజకీయనాయకులు అధికారులు అవినీతి మత్తులో జోగడం, ప్రభుత్వమే BRS / BPS వెసులుబాటు కలిగించి అక్రమ కట్టడాల్ని రెగ్యులరైజ్ చెయ్యడం, వగైరా). మనిషి ఆబకి, ఆక్రమణలకి, విచ్చలవిడితనానికీ, పర్యావరణం అంటే నిర్లక్ష్యానికి ఇవి కొన్ని ఫలితాలు, దారి తప్పిన దేశంలోని ప్రజలు చెల్లించే మూల్యం. ప్రకృతిని నియంత్రించలేం కరక్టే; కాని ఏదైనా ఆపద ఎదుర్కోవడానికి, నష్ట నివారణకి / తగ్గించడానికి ఏమాత్రం రెడీగా ఉన్నాం అన్నది ముఖ్యం; కాని ఇది అవినీతి, నిర్లక్ష్యం కోరల్లో ఇరుక్కుపోయింది. చెన్నై లేటెస్ట్ ఉదాహరణ.
(అన్నట్లు, మీ టపాకి పూర్తిగా సంబంధం లేని నా పరిశీలన. ఇటువంటి సందర్భాల్లో సహాయకచర్యలు / ఆహారం / దుస్తులు అందించే దృశ్యాలు చాలా నిర్లక్ష్యాన్ని ప్రతిఫలిస్తుంటాయి. జనం ఆ లారీలు / ట్రక్కుల దగ్గర చేతులు జాస్తూ, మూకుమ్మడిగా ఎగబడటం, ఒకరినొకరు తోసుకోవడం ప్రతిసారీ జరుగుతుంది. ఫలితం బలవంతుడిదే రాజ్యం అన్నట్లుగా తయారవుతుంది. ఆ పొట్లాలు అందక కొంతమంది నిరాశ, తీరని ఆకలి బాధ, కష్టాలు. హృదయవిదారకంగా ఉంటాయి ఆ ఫొటోలు, విడియోలు. కష్టమే కానీ, ఆ కార్యకర్తలు జనాన్ని క్యూ లో ఎందుకు నించోబెట్టరో నాకు ఏనాడూ అర్ధం కాదు. బహుశ: జనం ఎగబడుతుంటే ఆ పంచేవాడికి తనే వాళ్ళని ఉద్ధరిస్తున్నాననే భావన / contempt అనచ్చా? మొన్నటికి మొన్న సిరియా నుంచి యూరప్ వైపు పారిపోయిన శరణార్ధులకి హంగరి దేశపు సరిహద్దు దగ్గర శిబిరాల్లో ఓ కార్యకర్త ఇలాగే ఆహారం పొట్లాలు వాళ్ళ మీదకి విసిరేస్తే ఆ సంఘటన ప్రపంచవ్యాప్తంగా పత్రికలకెక్కి, దుమారం రేపి ఎంక్వైరీ ఆదేశించేంత వరకు వెళ్ళింది. మనదేశంలో ఇదంతా మామూలే అని సమాధానపడిపోయాం. మేరా భారత్ మహాన్.)
అవునండీ,.. మన భారత్ మహాన్ కాదని ఎవరన్నారూ అని? ఎప్పుడూ మహానే. ఐనా ఏమాట కామాట చెప్పుకోవాలి. మహాన్ భారత్ దేశంలో అందరూ సమాన మహాన్ ప్రాంతాలు కావు సుమండీ.
రిప్లయితొలగించండిఈ చెన్నై జలవిలయం చూసి కేంద్రం గబగబా స్పందిస్తోంది కదా. అనకూడదు కాని, అదే ఈ విలయం కాని ఆంధ్రకోస్తాలో గనక వచ్చుంటే కేంద్రం ఓ సానుభూతి స్టేట్మెంటు ఇచ్చేది సాయం చేస్తామూ అని. ఆ సాయం అంచనాకు ఓ బృందాన్ని పంపుతామూ అనే వారూను. ఐతే ఆ బృందం ఏదో బోలెడు విన్నపాలూ విఙ్ఞప్తులూ వేడికోళ్ళూ నిరసనలూ ధర్నాలూ (ఇంకా ఏమున్నాయబ్బా?..) గట్రా అయ్యాక ఓ ఇరవై నెలల తరువాత మొక్కుబడిగా వచ్చినట్ళే వచ్చి వెళ్ళినట్లే వెళ్ళుండే వారు.
అవునండి, George Orwell గారి Animal Farm నవలలోలాగా, కొన్ని ప్రాంతాలు కాస్త "ఎక్కువ సమానం" - కొత్త రైళ్ళు ఇవ్వడం దగ్గర్నుంచి తుఫాను సహాయం అందించడం వరకు.
రిప్లయితొలగించండి