20, ఆగస్టు 2015, గురువారం

గుణపాఠం, నీతిపాఠం లాంటి రాజీవ్ గాంధీ జీవితం


(Published in ‘SURYA’ telugu daily on 20-08-2015, Thursday)
(ఆగస్టు, 20 -  రాజీవ్ గాంధీ జయంతి)
“కుల,మత, ప్రాంత, భాషా బేధాలకు అతీతంగా భారత ప్రజలందరి నడుమ భావసారూప్యానికీ, వారి ఐకమత్యానికీ నేను కృషి చేస్తానని ప్రతిన పూనుతున్నాను”
ఏటా ఆగస్టు ఇరవై నాడు, రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని   ఇటువంటి ప్రతిన చేయిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో వుండే రాజకీయ పార్టీ ఇష్టాఇష్టాలనుబట్టి నాయకుల జయంతులు కానీ,  వర్ధంతులు కానీ, వారి విగ్రహాలకు పూలహారాలు వేయడం కానీ ఆనవాయితీగా మారే రోజులు వస్తున్నాయి. జాతి పురోగతికి వారు చేసిన సేవలకు ఈ అట్టహాసాలతో కూడిన స్మారక విన్యాసాలు కొలమానం కాబోవు. కాంగ్రెస్ హయాములో దీన్ దయాళ్ ఉపాధ్యాయను  ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా,ఆయన చేసిన  సేవలను గుర్తుంచుకున్న ప్రజలున్నారు.  అలాగే, ఎన్డీయే పాలనలో, నవభారత నిర్మాతగా పేరుగాంచిన  ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతికి చేసిన సేవలను స్మరించుకునే విషయంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా, అంటీముట్టనట్టు వ్యవహరించినా ఆయన గొప్పతనం తగ్గిందేమీ లేదు.  కొందరు నాయకులు వారి వారి పార్టీలకు నాయకులు కావచ్చు కానీ, వారు రూపొందించిన పధకాలు, వారి అభ్యుదయ భావాలు ప్రజల మనస్సుల్లో వారిని చిరంజీవులుగా మారుస్తాయి.
బోఫార్స్ వంటి కుంభకోణాల కారణంగా రాజీవ్ గాంధీ వ్యక్తిత్వం  కొంత మసకబారి ఉండవచ్చు. కానీ ఒక యువ ప్రధానిగా ఆయన ముందు చూపుతో తీసుకున్న కొన్ని సాహస నిర్ణయాలు, అనుసరించిన కొన్ని అభ్యుదయ విధానాలు భారత దేశాన్ని ఓ మలుపు తిప్పాయనడంలో సందేహం లేదు. రోదసీ పరిశోధనల ఫలితాలను ఆధునిక భారత నిర్మాణానికి ఉపయోగించుకున్న తీరు శ్లాఘనీయం. టెలికాం రంగంలో రాజీవ్ గాంధి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల ఫలితాలను ఈనాటి యువ భారతం అనుభవిస్తోంది. అలాగే పంచాయతీ వ్యవస్థల పరిపుష్టి కోసం ఆయన ఏకంగా రాజ్యాంగ సవరణకే  పూనుకున్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం   గ్రామాలకు పంపే ప్రతి రూపాయిలో కేవలం పద్దెనిమిది పైసలే అర్హులయిన  వారికి అందుతున్నాయని, మిగిలిన ప్రజాధనం దళారుల చేతిలో హారతి కర్పూరం అవుతోందని ఆవేదన చెందిన నాయకుడాయన.
ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే రాజీవ్ గాంధీ రాజకీయాల్లో ఉన్నదీ, అధికారంలో ఉన్నదీ చాలా తక్కువ కాలమే. గాంధీ అన్న పేరు, ఇందిరా, నెహ్రూల కుటుంబానికి రాజకీయ వారసుడు కావడం ప్రధాని పీఠం ఎక్కడానికి తోడ్పడి ఉండవచ్చు కానీ, ఆ తరువాత ఎంతో ముందు చూపుతో భారత దేశాన్ని తదుపరి శతాబ్దంలోకి అడుగులు వేయించిన ఆయన దార్శనికతే,  ఇన్నేళ్ళుగా ప్రజల మనస్సుల్లో  ఆయన్ని  ఒక చెరగని జ్ఞాపకంగా ఉంచుతోంది.
ఇందిరాగాంధీ ఆకస్మిక అస్తమయం రాజీవ్ గాంధీని రాజకీయాల్లో ఉదయించే సూర్యుడిని చేసింది. ఒక విషాద భరిత నేపధ్యంలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో  ఓటర్లు యువనేతకు తిరుగులేని ఆధిక్యంతో కూడిన విజయాన్ని అందించారు. భారత దేశపు తొలి యువ ప్రధానమంత్రిగా రాజీవ్ పాలన తొలిరోజుల్లో ప్రజల అనుభవంలోకి వచ్చిన నవ్యత్వంతో కూడిన రాజకీయం,ఎక్కువకాలం కూడా గడవక ముందే బోఫార్స్ వంటి కుంభకోణాలు వెలుగులోకి రావడంతో మసకలుబారింది. దేశం ఆ యువ నేత నుంచి ఎంతో ఆశించింది. కానీ వారి ఆశలను నీరుగారుస్తూ రాజేవ్ సాగించిన పాలనతో ప్రజానీకం విసుగు చెందింది. ఆ తదుపరి జరిగిన ఎన్నికల్లో ఎంతో మెజారిటీతో గెలిపించిన రాజీవ్ గాంధీని, ఆయన పార్టీని  ఆ ప్రజలే తిప్పికొట్టారు. ప్రధాని పదవి నుంచి తప్పించి ప్రతిపక్ష నాయకుడి పాత్రలో కూర్చోబెట్టారు. భారతీయ ఓటర్ల పరిణతికి ఇదొక నిదర్శనమే కాదు,  ఓటర్లు అవకాశం ఇస్తారు  కానీ, అలా లభించిన అధికారాన్ని, ప్రజల అభిమానాన్ని  శాస్వితం చేసుకోవడం అన్నది, గెలిచిన  పార్టీల మీద ఉంటుందన్న వాస్తవాన్ని కూడా రాజీవ్ గాంధీ ఉద్ధానపతనాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాజకీయాల్లో వెలుగులు విరజిమ్ముతున్నవారికి, అవి శాస్వితం అని భ్రమిసేవారికి రాజీవ్ గాంధీ జీవితం  ఒక హెచ్చరిక లాంటి గుణపాఠం.
రాజకీయ కుటుంబంలో పుట్టి, రాజకీయ వారసత్వం కలిగి రాజకీయాల పొడగిట్టకుండా పైలట్ ఉద్యోగం ఎంచుకున్న రాజీవ్ గాంధీ , విధి వైపరీత్యం కారణంగా రాజకీయ రంగప్రవేశం చేసి, అదే రాజకీయ మకిలిలో చిక్కుకుని తిరిగి రాజకీయ ప్రత్యర్ధుల చేతుల్లో దారుణమైన మరణం పొందడం అత్యంత విషాదం. అతి హైన్యంగా ఆత్మాహుతి దాడితో పరమ కిరాతకంగా ఆయన్ని మట్టుబెట్టిన తీరుతో ఆసేతుహిమాచలం కన్నీరు మున్నీరయింది. ఎంతో భవిష్యత్తు కలిగిన యువ నాయకుడి జీవితం ఆ విధంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది.
చిన్న వయస్సులోనే అజరామరమైన కీర్తినీ, అనంతమైన అపకీర్తినీ సరిసమానంగా కూడగట్టుకున్న ఆ యువనేతకు సంబంధించిన ఒక ఉదంతంతో దీన్ని ముగిస్తాను. అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వుండగా అప్పటికి రాజకీయాల వాసన అంటని రాజీవ్ గాంధీ హైదరాబాదు వచ్చారు. అప్పుడాయన ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థలో పైలట్ గా పనిచేస్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి అంజయ్య గారు సచివాలయంలో తనదయిన తరహాలో సహచరులు, సన్నిహితులతో మాటా మంతీ సాగిస్తున్నారు. ఆ సమయంలో ఆయనకో ఫోన్ వచ్చింది. వెంటనే అంజయ్య గారు తత్తరపడుతూ లేచారు. హుటాహుటిన బరకత్ పురాలోని తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి ఆయన, ముఖ్యమంత్రి అధికార నివాసం అయిన బరకత్ పురాలోని హౌసింగ్ బోర్డు వారి టూ.ఆర్.టీ.ఇంట్లోనే వుంటున్నారు. నిజానికి అది చాలా చిన్న ఇల్లు. అవసరాన్ని బట్టి ఆ ఇంటిపైనే  గది మీద  గది నిర్మించు కుంటూ వెళ్ళడం వల్ల చాలా ఇరుకుగా వుండేది. మెట్లు కూడా సౌకర్యంగా ఉండేవి కావు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్లి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు ఆయన కంటపడ్డ దృశ్యం అపూర్వం. అక్కడ వున్న చిన్న వసారా వంటి గదిలో రాజీవ్ గాంధీ ఒంటరిగా కూర్చుని వున్నారు. ఆయన కూర్చున్న కుర్చీ కూడా ఇనుప రేకుది. అలా కూర్చుని ఆయన చేస్తున్న పనేమిటో తెలుసా. తనని పీకు తింటున్న హైదరాబాదు దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే యాపిల్ పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే – రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన విమానం, తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం ఉండడంతో, ఆయనకు ఎందుకు అనిపించిందో బేగం పేట ఎయిర్ పోర్టులో ఎవర్నో స్సాయం అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్యగారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది, ముఖ్యమంత్రి గారు ఆఘమేఘాల మీద ఇంటికి చేరేసరికి ఇదీ సీను.
‘అమ్మ (ఇందిరా గాంధి) ఇచ్చిన ఉద్యోగం’ అని చెప్పుకోవడానికి అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు.పైగా కూసింత గర్వంగా కూడా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసిన తరువాత ‘పరవాలేదు మా అమ్మ సెలక్షన్ మంచిదే’ అనుకున్నారేమో తెలవదు. అయితే తదనంతర కాలంలో అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి ఊడడానికి కూడా రాజీవ్ గాంధీయే కారణం కావడం చిత్రాతిచిత్రం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అనుకోవడానికి ఇది మరో దృష్ట్యాంతం. (20-08-2015)     
https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif


1 కామెంట్‌:

  1. విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ ఈ వాక్యం అర్ధం కాలేదు.

    <"అప్పటికి ఆయన, ముఖ్యమంత్రి అధికార నివాసం అయిన బరకత్ పురాలోని హౌసింగ్ బోర్డు వారి టూ.ఆర్.టీ.ఇంట్లోనే వుంటున్నారు. నిజానికి అది చాలా చిన్న ఇల్లు. "

    హౌసింగ్ బోర్డ్ వారి 2-RT ఇల్లు ముఖ్యమంత్రి గారి అధికార నివాసం ఏమిటి సర్? అంజయ్య గారు నిరాడంబరుడవడం వల్ల ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వేరే పెద్ద నివాసానికి మారకుండా తన స్వంత ఇంట్లోనే కొనసాగారేమో? ఆ రకంగా మీరు ఆయన బర్కత్ పుర ఇంటిని అధికార నివాసంగా భావించారేమో?

    రిప్లయితొలగించండి