14, ఆగస్టు 2015, శుక్రవారం

లవణం గారు లేరు


ఈ రోజు బెజవాడలో కన్ను మూసిన ప్రముఖ నాస్తిక ప్రచారోద్యమ నాయకుడు లవణం గారితో నా పరిచయం వయస్సు నలభయ్ అయిదేళ్ళు. లవణం గారి నాన్నగారు గోరా గారి ద్వారా లవణం గారు పరిచయం అయ్యారు. గోరాగారు (గోపరాజు రామచంద్ర రావు గారు) నాస్తికులు. దేవుడ్ని నమ్మేవారు కాదు. దేవుడ్ని గురించి ప్రస్తావన వస్తే ‘దేవుడు లేదు’ అనేవారు. ‘నేను దేవుడ్నే నమ్మను, ఇక ఆయన ఆడో మగో నాకేమిటి నిమిత్తం’ అని వాదించేవారు.

1975 నాటి మాట. బెజవాడ ఆంధ్ర జ్యోతిలో పనిచేస్తున్నరోజులు. అప్పటికే హైదరాబాదుకు మకాం మార్చిన ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారికి ఓ ఆలోచన వచ్చి బెజవాడలో అసిస్టెంట్ ఎడిటర్ గా వున్న నండూరి రామమోహన రావు గారిని సంప్రదించారు. అనుదినం జరిగే సంఘటనలపై స్పందించి నాలుగు లైన్లలో హస్యస్పోరకంగా వుండే గేయాన్ని రాయించాలని వారి ఉద్దేశ్యం. రాయగలరా అని అడక్కుండా రాయండి అనేసారు రామ్మోహన రావు గారు నాతొ. ఆవిధంగా మొదలయ్యాయి ఆంద్ర జ్యోతి దినపత్రికలో ఎడిట్ పేజీలో కార్టూన్లవంటి నా వాక్టూన్లు. చిత్రకారుడు రమణ గారు ఓ చిన్న చిత్రాన్ని దానికి జోడించేవారు.
ఆరోజుల్లో గోరాగారి కూరగాయల ఉద్యమం మొదలయింది. బెజవాడ గవర్నర్ పేటలోని రాఘవయ్య పార్కులో కార్యక్రమం. వ్యవసాయ శాఖ మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిధి. పూలదండల బదులు కూరగాయల దండలు వేయాలనేది గోరాగారి ఉద్యమం. కూరగాయలు పెంచితే ప్రజలకు ఉపయోగం అనేది ఆయన సిద్దాంతం. సరే సభ మొదలయింది. కూరగాయలతో చేసిన దండలు వేసారు, పుష్ప గుచ్చాల బదులు కాలీ ఫ్లవర్, క్యాబేజీలతో రూపొందించిన గుచ్చాలు అందించారు. సుబ్బారెడ్డి గారు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే రకం. మనసులో  దాచుకుండే మనిషి కాదు. అయన  మాట్లాడుతూ, గోరాగారి ఉద్దేశ్యం మంచిదే  అయినా మనిషి మానసిక ఆనందానికి పూలతోటలు కూడా అవసరమన్నారు. పూల చెట్లు పీకి వాటి స్థానంలో కూరగాయల మొక్కలు పెంచేబదులు, కాలువగట్ల మీద, వృధాగా వున్న ప్రాంతాలలో  కూరగాయల పాదులు వేస్తె నలుగురుకీ ఉపయోగం అన్నట్టు ప్రసంగించారు. ఆ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని నేను వాక్టూన్ రాసాను. అదే ఇది.
కాయ 'గోరా'లు
“కూరగాయలు పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని, మా శ్రీవారా
రోజంతా పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా!”
గోరాగారి గురించి రాసింది లవణం గారికి నచ్చినట్టు లేదు. మర్నాడు ఆ పేపరు పట్టుకుని రామ్మోహన రావు గారిని కలుసుకుని ‘ఇదేమన్నా బాగుందా’ అని అడిగారు. రామ్మోహన రావు గారు సీరియస్ గా పైకి కనిపించినా హాస్య ప్రియులు.
‘జోకుని జోక్కా తీసుకోవాలండీ లేకపోతె మేకులా గుచ్చుకుంటుంది. కార్టూన్ చూసి నవ్వు కున్నట్టే శ్రీనివాసరావు వాక్టూన్ చదివి నవ్వుకోండి. ఓ పనయి పోతుంది’
ఇదీ ఆయన జవాబు.
వాక్తూన్ సంగతి ఏమోకానీ, లవణం గారితో నా పరిచయం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ నడుమ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏదో  కార్యక్రమానికి వెడితే కలిసారు. ఓ ఫోటో కూడా దిగాము. ఆంద్ర భూమి ఫోటోగ్రాఫర్ అనుకుంటాను. ప్రస్తుతం అయితే నా దగ్గర లేదు.
(14-08-2015)



4 కామెంట్‌లు:

  1. తండ్రికి తగ్గ తనయుడు. ఆయనకు నా శ్రద్ధాంజలి. RIP

    రిప్లయితొలగించండి
  2. లవణం గారితో నాకు బాగా అనుబంధం వుంది. గోరా గారు, లవణం గారితో కలిసి తెలంగాణాలో నాస్తికోద్యమం కొరకై పనిచేసిన వారిలో కానా గారూ, మా నాన్న నాగం గారూ ముఖ్యులు. అలా లవణం గారు నా చిన్నప్పటినుండీ నాకు తెలుసు. మా ఇంటికి వారు తరచుగా వచ్చేవారు. నేను ఒక ఏడాది విజయవాడ నాస్తికకేద్రంలో కూడా పని చేసాను. వారు నన్ను స్వంత కొడుకులా ఆప్యాయంగా చూసుకునేవారు. ఇప్పుడు వారు లేరంటే ఎంతో విచారంగా వుంది.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. లవణం గారిలాంటి మహనీయులు ఈకాలంలో అరుదు. వారితో పాటు కానా గారిని కూడా గుర్తు చేసినందుకు శరత్ గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి