(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 07-06-2015, SUNDAY)
చంద్రుడు ఎంతో కాంతివంతం అయితేనే కాని అమావాస్యనాడు కనిపించడు. ఇప్పుడు రెండు కొత్త తెలుగు రాష్ట్రాలను ఇద్దరు చంద్రులు పాలిస్తున్నారు. కేవలం అనుభవం, సమర్ధత కారణంగానే ప్రజలు వారిద్దర్నీ ఈ గద్దెలు ఎక్కించారు. అనుభవంలో కాని, రాజకీయ చాణక్యంలో కాని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు. వీరికి వున్న ఈ సానుకూల లక్షణాలు అన్నీ జనరంజకమైన పాలనకు దోహదం చేసి తీరాలి. మరి ఏడాది కాలం గడచిపోయింది కానీ జనాలు కోరుకున్నది ఏమన్నా జరిగిందా?
నిజానికి వీరిద్దరూ తమ తమ పరిధుల్లో, తమ ఆలోచనలకు
తగ్గట్టు సుపరిపాలనకు పధకాలు రచిస్తూ పోయిన మాట నిజమే. ఎన్నికలకు ముందు చేసిన
సవాలక్ష వాగ్దానాల బెడద లేకపోతే మరిన్ని మంచి ఫలితాలను ఇప్పటికే రాబట్టి వుండేవారేమో
కూడా. అయితే ఆ హామీల్లో కొన్ని ముందరి కాళ్ళకు
బంధాలై కూర్చున్నాయి. ఉదాహరణకు రైతుల రుణ
మాఫీ. హామీ నెరవేర్చాము అని చెప్పుకోవడానికే కిందెత్తు, మీదెత్తు అయ్యారు. తీరా
చేసారా అంటే ఏదో అరకొర అని అందరూ మెటికలు విరిచేవాళ్ళే కాని, చెప్పింది మొత్తం చేసి చూపెట్టారు
అనుకోవడానికి ఏమీ లేదు. షరతులు
వర్తిస్తాయి అనే వాణిజ్య ప్రకటనల మాదిరి మొత్తం మీద ఏదో పని పూర్తి చేశాం అని
చేతులు దులుపుకోవాల్సిన స్తితి.
హామీల అమలు నూటికి నూరు శాతం పూర్తిగా పూర్తి చేయలేకపోవడానికి
కూడా వారి కారణాలు వారికి వున్నాయి. కొత్త రాష్ట్రాల్లో వూహించని కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. కొన్ని స్వయంకృతాలు.
మరికొన్ని ప్రకృతి ప్రసాదాలు.
రెండో అంశం వారి చేతిలోనే కాదు, ఎవరి చేతిలోను
లేదు. ఇక మొదటిది స్వయంకృతం. ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు. ఈ రెండింటి మధ్యా
వారిద్దరూ కొన్ని పనులు చేసుకుంటూ పోయారు. ఏడాది గడిచిన తరువాత కూడా, ఇద్దరు
ముఖ్యమంత్రుల పాలనపై ప్రతిపక్షాలను మినహాయిస్తే, ప్రజల్లో అంతగా వ్యతిరేకత కానరాక పోవడానికి బహుశా అడపా దడపా చేస్తూ వచ్చిన కొన్ని
మంచి పనులే కారణం కావచ్చు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అద్భుతం చేసి
చూపెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణా ప్రాంతం విద్యుచ్చక్తి కొరతతో చీకటి
మాయం అయిపోతుందని ఆరోజుల్లో భయపెట్టిన వాళ్లు వున్నారు. భయపడిన వాళ్ళూ వున్నారు.
అయితే మండించిన వేసవిలో కూడా ఈసారి విచిత్రంగా కరెంటు సరఫరా జరిగిన తీరు చూసి ప్రత్యర్దులే
చాటుగా నోటి మీద వేలు వేసుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కొత్త రాజదానికోసం వేలాది
ఎకరాలను ప్రజలనుంచి సమీకరించగలిగారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో
తెలియదు కాని భూమి పూజ క్రతువు కూడా పూర్తిచేసి అనుకున్నది చేసి, కొత్త రాజధానిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి తీరుతాననే
కొత్త ఆశలను చిగురింప చేశారు. అది జరిగితే అదొక పరమాద్భుతం అవుతుంది.
ఇద్దరు ముఖ్యమంత్రులు సాధించిన విజయాలు మరికొన్ని
లేకపోలేదు. పత్రికా ప్రకటనల్లో కనిపించిన జాబితాలు కొంత అతిశయోక్తిగా వున్నప్పటికీ
పరవాలేదు అడుగులు సరిగానే, సరైన దిశలోనే పడుతున్నాయన్న ఆశలు కలుగుతున్నాయి.
పోతే, మరికొన్ని అంశాలు వారి అనుభవానికి,
విజ్ఞతకు అనువుగా లేని మాట వాస్తవం. రాష్ట్రాలు ఏర్పడి, నూతన ముఖ్యమంత్రులుగా పదవీ
ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచీ, ఆ ముహూర్త బలం ఎలాటిదో కాని, ఇరువురి
నడుమ పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్తితి. ఏవిషయం తీసుకున్నా, వివాదం కానిది
లేదు. ఏ సమస్య తీసుకున్నా సానుకూలంగా పరిష్కారం అయ్యింది లేదు. ఈ వివాదాలకు ఎవరు
ముందు తెర తీసారు అనేది పక్కనబెడితే, వాటికి తెరదించడం యెట్లా అనే విషయంలో ఎవరు
ముందు చొరవ చూపుతారు అనే ప్రశ్న జవాబు లేకుండానే మిగిలిపోయింది. ఏరోజు పేపరు తిరగేసినా చిటపటలే! ఏ టీవీ పెట్టి
చూసినా పటపటలే! పిల్లలు ఆసక్తిగా చూసే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఫిలిం మాదిరిగా అనుక్షణం
ఒకరిపై మరొకరు పై చేయి అనిపించుకోవాలనే తాపత్రయమే కానవస్తోంది. ఆ కార్టూన్ చిత్రాల్లో
వినోదం వుంది. కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల 'పొడగిట్టని' పోరాటవైఖరి అనేకమందికి
మనస్తాపాన్ని కలిగిస్తోంది. ఈ అనేకమందిలో వారిద్దరి సమర్ధత పట్ల అచంచల విశ్వాసం
కలిగిన వారి వీరాభిమానులు కూడా వున్నారన్నది వాస్తవం.
ముందు పేర్కొన్నట్టు ఏడాదిలో ఏమి ఆలోచించారో,
ఏమేమి పధకాలకు రూపకల్పన చేశారో అవన్నీ ఒక తీరుకు వచ్చి అమలుకు నోచుకునే తరుణంలో, రెండు
రాష్ట్రాల అవతరణ దినోత్సవం, లేదా దీక్షా దినం ఏ పేరు పెట్టినా ఏడాది పుణ్యకాలం
పూర్తయి రెండో ఏట అడుగు పెట్టే సమయంలో చోటుచేసుకున్న కొన్ని ఉదంతాలు వారికే కాదు మొత్తం
రాజకీయ వ్యవస్థకు సయితం మేలు చేసేవి కాదు. ఈ సంఘటనలతో ఇద్దరు ముఖ్యమంత్రులకు
ప్రత్యక్ష ప్రమేయం వుండకపోవచ్చు. కానీ తమ హయాములో జరిగిన ఇటువంటి పరిణామాల విషయంలో
వారు ఎంతో కొంత బాధ్యత తీసుకోవాలి. జరిగిన దానిని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని
చూడడం ఈనాటి రాజకీయ విలువల ప్రకారం గర్హ్యనీయం కాకపోవచ్చు. అయినా కాని, కొన్ని
సందర్భాలలో రాజకీయాన్ని పక్కనబెట్టి చూసే సుగుణం నాయకులకి వుండితీరాలి. అలా కాక
మొండిగా వ్యవహరించడం వల్ల వారి పేరు ప్రతిష్టలు పలచపడే ప్రమాదం వుంటుంది.
కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ గ్రామరు
చెప్పడానికి ఒక లెక్చరర్ వుండేవాడు. పిల్లలు ఆయన క్లాసులో తెగ అల్లరి చేసేవాళ్ళు.
ఆయన ఒకటే అనేవాడు.'పిల్లలూ. మీరు ఎలాగు గోలచేయకుండా వుండలేరు. కనీసం కాస్త
తగ్గించి అల్లరి చేయండి'అని.
ఆయన అన్నట్టు ఈనాటి రాజకీయాల్లో కూడా విలువల్ని అతిగా ఆశించలేము. విలువలతో రాజకీయం
చేయడం ఇప్పుడెక్కవ్వరికీ సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే, చెప్పేది ఒక్కటే, కనీస
విలువల్ని కాస్త కాపాడండి, అమావాస్యనాడు కూడా కనబడే చంద్రుడి మాదిరిగా మీ ప్రతిభను
ప్రదర్శించండి అని మాత్రమే. (06-06-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
"అయితే మండించిన వేసవిలో కూడా ఈసారి విచిత్రంగా కరెంటు సరఫరా జరిగిన తీరు చూసి ప్రత్యర్దులే చాటుగా నోటి మీద వేలు వేసుకున్నారు."
రిప్లయితొలగించండిఇది భాగ్యనగరంకు పరిమితమా లేదూ తెలంగాణా రాష్త్రం మొత్తానికా?
"అది జరిగితే అదొక పరమాద్భుతం అవుతుంది."
జరిగితే ? అనుమానమా?
@Anil Atluri - I have written separate articles on one year rule of both T and AP CMs and those were already published in SURYA telugu daily. This article is mainly to focus on political ethics in the light of recent developments such as MLC elections, floor crossings besides Revanth episode. To make the article unbiased, I have not mentioned any names. Just gave a piece of advise. That's all. - Bhandaru Srinivasa Rao
రిప్లయితొలగించండి"తీరా చేసారా అంటే ఏదో అరకొర అని అందరూ మెటికలు విరిచేవాళ్ళే కాని, చెప్పింది మొత్తం చేసి చూపెట్టారు అనుకోవడానికి ఏమీ లేదు. షరతులు వర్తిస్తాయి అనే వాణిజ్య ప్రకటనల మాదిరి మొత్తం మీద ఏదో పని పూర్తి చేశాం అని చేతులు దులుపుకోవాల్సిన స్తితి"
రిప్లయితొలగించండిఏమిటా షరతులు/అరకొర అనేది విపులీకరించకుండా కొట్టేయడం భావ్యమా?
"కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల 'పొడగిట్టని' పోరాటవైఖరి అనేకమందికి మనస్తాపాన్ని కలిగిస్తోంది"
టీవీలకు ఇదే పండుగ కదా, లేకపోతె పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన చానెళ్ళ రేటింగులు ఏమి కావాలి? ఎవరికీ మనస్తాపం, బ్రహ్మాండమయిన వినోదంతో పాటు చక్కని టైమ్పాస్ అనే మాట పైకి అనడం నామోషీ అనుకున్న వారే బాధ వ్యక్తపరుస్తున్నారని లేదని నా అనుమానం.