6, జూన్ 2015, శనివారం

మౌనమె నా భాష ....


“I get intoxication while talking” అన్నాట్ట వెనుకటికి నాలాటి వాడు. మద్యం సేవించినప్పటికంటే కంటే కూడా మాట్లాడుతుంటే నాకు బాగా కిక్కువస్తుందన్నది మా ఆవిడ వువాచ. అదికూడా తోడయితే పట్టేవాళ్ళు వుండరన్నది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం.   అదేవిటో నా వదరుబోతుతనం ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిందన్నది అచ్చంగా  నా సొంత అభిప్రాయం. మాట్లాడడానికి తగ్గ వాతావరణం వుండాలని అప్పుడే మాట బాగా పెగులుతుందని వసకారుడుఏనాడో చెప్పాడు.
చదువుకునే రోజులనుంచి నాకీ మాటల పిచ్చి వుందనీ అందుకే చదువు చెట్టెక్కిందనీ మా పెద్దవాళ్ళు అంటుండగా అనేకసార్లు వినే అదృష్టం నాకు కలిగింది. అయినా వేరే ఆటలకన్నా నాకు మాటల ఆటలుఅంటే వున్న వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు. బహుశా రేడియోలో ఉద్యోగం ఇవ్వడానికి నాకు వున్న అనర్హతలను ఈ అదనపు అర్హత కప్పిపెట్టిందేమో అని అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎస్సారార్ కాలేజీలో నాకంటే వయస్సులోనూ, చదువులోనూ పెద్దవాళ్లయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వుండేవాళ్ళు. కాస్త వీలు దొరికితే చాలు వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు మొదలు పెట్టేవాడిని. శ్రద్ధ, సుధ అనే పేర్లు కలిగిన వాళ్ళిద్దరూ వాళ్ల నోట్సులు రాసిపెట్టేవరకు నా మాటలు విని ఆ తరువాత ఎంచక్కా మంచిది వెళ్ళి రండిఅనేసేవాళ్ళు. అలా అని మాటల వల్ల అసలు ఏమాత్రం ఉపయోగం లేదనే  గొప్ప  అభిప్రాయానికి వెంటనే  రానక్కర లేదు. వెనుకటికి నేను రైళ్ళలో రిజర్వేషన్ లేకుండానే ఈ మాటల మంత్రంతో తేలిగ్గా ప్రయాణాలు చేసేవాడిని. నిలుచుని కాసేపు కూర్చున్న వాళ్ళతో మాటలు కలిపేవాడిని. ఆ తరువాత వాళ్లు మాటల మైకంలో పడిపోయి  అదేమిటి మాస్టారు అలా నిలబడేవున్నారు వచ్చి ఇలా కూర్చోండిఅని జాగా ఇచ్చేవాళ్ళు. కొండొకచో మరికొందరు శ్రోతలు మరీ మొహమాట పడిపోయి నా మాటలు వింటూ వాళ్లు లేచి నిలబడి నాకు కూర్చునే జాగా ఇచ్చేవాళ్ళు. రేడియో ఉద్యోగంలో చెప్పక్కర లేదు. ఆఫీసుకి  పోవడమే గగనం కాని వెళ్ళానంటే చాలు న్యూస్ యూనిట్ చిన్న సభా ప్రాంగణంగా మారిపోయేది.  
అలాటి ఘన చరిత్ర కలిగిన  నేను ఈ నడుమ యెందుకు మాటలాటలు  తగ్గించానని మా ఆవిడ సయితం అనుమానిస్తోంది. వున్నట్టుండి ఈ వయస్సులో అంటే అరవై  ఎనిమిది దాటిన  తరువాత మా  ఆయనకు కాసింత పెద్దమనిషితనం కానీ  రాలేదు కదాఅని బోలెడు బోలెడు సంతోషం కూడా  పడిపోతోందష. తెలుగు  సీరియళ్ల ప్రోత్సాహాక ఉద్యమంలో మునిగిపోయి టీవీల్లో రాజకీయ చర్చలు పట్టించుకోకపోవడంవల్ల ఆవిడకు ఈ జ్ఞానోదయం ఆలశ్యం అయిందని నా అనుమానం.
నిజమే. టీవీ చర్చావేదికల్లో ఒకరిని మించి మరొకరు  దూషణలతో కూడిన తిరస్కారాలవల్ల కలిగిన మాత్సర్యసహిత ప్రేలాపనలు పక్కన కూర్చుని వినీ వినీ   నాకు మాట పడిపోతోందని ఆవిడకు తెలవదు.

అందుకే అన్నారు - 

అంతయు మన మేలునకే.
NOTE: Courtesy Image Owner  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి