31, మే 2015, ఆదివారం

అమెరికా అధ్యక్షులు - అందరికీ తెలియని కొన్ని సంగతులు


అబ్రహాం లింకన్ పేరు తెలియని వాళ్లు వుండరు. దేశం కాని దేశంలో కూడా ఆయన ఫోటో గుర్తుపడతారు. అయితే ఆయన గురించి చాలామందికి తెలియని విషయం ఒకటుంది. అదేమిటంటే - ఆ బక్క పలచటి మనిషి గట్టి మల్ల యోధుడు. గోదాలోకి దిగారంటే చాలు ఎంతటివారయినా సరే మట్టి కరవాల్సిందేనట.


అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళలో జాన్ టైలర్ ఒకరు. మరి వీరి గొప్పతనం ఏమిటంటే టైలర్ గారు ఏకంగా పదిహేనుమంది పిల్లకు తండ్రి. వైట్  హౌస్ కాబట్టి సరిపోయింది.  ఆయన ఇద్దరు మనుమలు ఇంకా  జీవించే వున్నారట.

ఇక ఫ్రాంకిలిన్ పియర్స్ - వీరికి గుర్రపు స్వారీ ఇష్టం. అయితే అలా పియర్స్ మహాశయులు గుర్రమెక్కి షికారు చేస్తుంటే ఆ గుర్రం ఒక మహిళను తొక్కుకుంటూ వెళ్ళింది. తొక్కుతూ  వెళ్ళింది గుర్రం అయినా స్వారీ చేస్తోంది పియర్స్ కాబట్టి ప్రెసిడెంటు అనికూడా చూడకుండా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి కేసు పెట్టారు. కాకపొతే సరయిన సాక్ష్యం లేని కారణంగా కోర్టులో ఆ కేసు వీగి పోయింది. అది వేరే కధ.
ఆండ్రూ జాన్ సన్ ప్రెసిడెంటు కాక  మునుపు దర్జీ పనిచేస్తూ దర్జాగా బతికేవాడు.వైట్  హౌస్ లో ప్రెసిడెంటుగా వున్నకాలంలో కూడా అయన తన కుట్టుపని మరిచిపోకుండా తన కోట్లు సూట్లు తానే కుట్టుకునేవాడు.
జేమ్స్ బుచానన్. ఈ మహాశయుడిది మరో తరహా. ప్రెసిడెంటుగా వున్నప్పుడు వాషింగ్ టన్ డీసీలో బానిసల్ని కొనుగోలు చేసేవాడు. వారిని గుట్టుచప్పుడు కాకుండా పెనిసుల్వేనియా చేర్చి అక్కడ వారికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించేవాడు.
రూధర్ ఫోర్డ్. అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తొస్తోందా! ఆయన వేరు ఈ రూధర్ ఫోర్ట్ వేరు. ఈయన కూడా ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంటే. అంతరుధ్యం కాలంలో గాయపడ్డ ఏకైక అమెరికా అధ్యక్షుడు ఈయన. ఒకసారి కాదు నాలుగు సార్లు గాయపడడం  ఇంకో ప్రత్యేకత.
విలియం టఫ్ట్. 'బిగ్ బిల్' అని ముద్దు పేరు. ముద్దు పేరుకు తగ్గట్టే మొద్దు శరీరం. అమెరికా ప్రెసిడెంట్లు అందరిలో ఇంతటి భారీ కాయం వున్న వాళ్ళు మరొకరు లేరు. ఒకసారి స్నానం చేద్దామని వైట్  హౌస్ లోని ఓ బాత్ టబ్ లోకి దిగి మళ్ళీ పైకి లేవలేకపోయాడట. ఆయన్ని బయటకు తీయడానికి సర్వెంట్లని పిలవాల్సివచ్చిందట.
హెర్బర్ట్ హూవర్. ఈయనా అమెరికా ప్రెసిడెంటే. ఈయనగారితో ఏ చిక్కూలేదు కాని ఈ ప్రెసిడెంటు గారి కొడుక్కి మొసళ్ళ పిచ్చి. రెండు మొసళ్ళను వైట్ హౌస్ లో పెంచేవాడు. అవి ఆ శ్వేత భవనంలో స్వేచ్చగా తిరుగాడుతుంటే అక్కడి సిబ్బంది గుండెలు చిక్కబట్టుకుని విధులు నిర్వహించేవారు.
చెస్టర్ ఆర్ధర్. పెద్ద పెద్ద మీసాలు. పెద్ద అందగాడేమీ కాదు. కాకపొతే చక్కటి దుస్తులు  ధరించి చూపరుల మార్కులు కొట్టేసేవాడు. ఎలిగెంట్ ఆర్ధర్ అని ఆయనకు నిక్  నేమ్ కూడా  వుండేది. ప్రెసిడెంటుగా వున్నప్పుడు చాలామంది అమ్మాయిలు ఆయనంటే  మోజుపడేవారట. పదవిలో వున్నప్పుడు సరే.  అధ్యక్షపదవి నుంచి దిగిపోయే ఆఖరు రోజున కూడా నలుగురు అతివలు ఆయన వద్ద పెళ్లి ప్రస్తావనలు తెచ్చారట.
జేమ్స్ గార్  ఫీల్డ్. గ్రీక్ అండ్ లాటిన్ అంటాము  చూడండి. అంటే ఒక్క ముక్కా అర్ధం కాకపోతే మనవైపు అనేమాట. కానీ ఈ ఫీల్డ్ గారికి  ఆ రెండు భాషలు కొట్టిన పిండి. ఈయన గారు కుడి చేత్తో గ్రీకు భాషలో రాస్తూ, ఎడం చేత్తో లాటిన్ భాషలో రాస్తూ పోయేవాడట.
బెంజమిన్ హారిసన్ వైట్ హౌస్ లో ప్రెసిడెంటుగా పాదం మోపేవరకు ఆ భవనంలో నూనె దీపాలే గతి.  ఆయన హయాములోనే  శ్వేత భవనానికి  కరెంటు భాగ్యం కలిగింది. అయితే అప్పటివరకు కరెంటు అంటే ఏమిటో తెలియని హారిసన్ గారికి  కరెంటు అంటే ఎక్కడలేని భయం. విద్యుత్ దీపం వెలిగించాలంటే ఎక్కడ షాక్ కొడుతుందో అని హారిసన్  గారు హడిలిపోయేవారట.
కాల్విన్ కూలిడ్జ్ .  ఈయనది మరో తరహా.  కూలిడ్జ్ గారు కూల్ గా వైట్  హౌస్ లోని అధ్యక్ష కార్యాలయం ఓవల్ ఆఫీసులో కూర్చుని, ఆ  భవనం మొత్తంలో వినబడేట్టు ఏర్పాటుచేసిన ఎమర్జెన్సీ  బెల్స్ మోగించేవాడు. సిబ్బంది కంగారు పడి అటూ ఇటూ పరిగెడుతుంటే ఆయనగారు విలాసంగా ఆనందించేవాడు. సిబ్బంది పనిచేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నానని ముక్తాయింపు ఇచ్చేవాడు.

 ప్రెసిడెంట్ టాడీ రూజ్ వెల్ట్ వ్యవహారం మరీ విడ్డూరం. అయన ఒక సభలో ప్రసంగిస్తున్నారు.
"మీరు గమనించారో లేదో తెలియదు కాని, ఇప్పుడే ఓ దుండగుడు నన్ను తుపాకీతో కాల్చాడు" అంటూ ప్రసంగం కొనసాగిస్తూ పోయాడు. ఆయన చెప్పేది నిజమో అబద్దమో సభికులకు అర్ధం కాలేదు. అల్లా ఆయన గంటన్నర మాట్లాడుతూ పోయాడు. ప్రసంగం ముగిసిన తరువాత చూస్తే నిజంగానే ఆయన ఛాతీలో బుల్లెట్ దిగబడివుంది.

(మరికొన్ని ముచ్చట్లు తరువాత)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి