30, మే 2015, శనివారం

తెలంగాణా, శత కోటి ఆశల ఖజానా

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 31-05-2015,SUNDAY)
http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4
(జూన్ రెండో తేదీ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) 
తెలంగాణా పంచాయతీ రాజ్,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసేఆర్  లాగే చక్కని మాటకారి.  హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించిందని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి  ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమాలాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటి  మీద రాత కాకుండా  రాతి మీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం.  
తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు.  ఏడాది గడిచిపోయింది కానీ వారనుకున్నట్టు మాత్రం  జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా ఈ వేసవిలో రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారయినా కూడా అధికారిక   కోతలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న కేసీఆర్ సాధించిన అద్భుతం ఇది.
సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీ,  తెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్ననీళ్ళూ, నిధులూ, ఉద్యోగాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని  అనుకున్నవారూ వున్నారు. అప్పుడే  ఏడాది గడిచి పోయింది. అయితే,  వారనుకున్నట్టూ జరగలేదు. రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోలేదు.
అంటే ఏడాదిలో ఏమీ జరగలేదా  అంటే, జరుగుతుందని 'చాలామంది' భయపడ్డ ఒక విషయం మాత్రం జరగలేదు. హైదరాబాద్ ప్రత్యేకత ఏదీ చెరిగిపోలేదు, అదొక్కటే ఊరట కలిగించే విషయం. ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ  వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.  'డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యెక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.
సంజయ్ బారు  చెప్పినట్టు భయాలు, అనుమానాలు, సందేహాలు అన్నీ కాకపోయినా కొన్నయినా తొలగిపోయాయి. అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అసలు ఏడాది కాలంలో  చేసింది ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  
'అన్నీ ఆలోచనలేనా? ఆచరణలో ఏవీ?' అని అడిగే సందేహాస్పదులు కూడా వుంటారు. ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుగా పరిగణించి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు. ఎన్నికలకు  ముందు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ, ఏడాదిగా చేసిన పనులను మననం చేసుకుంటూ, అడగాలని అనుకుని అడగలేని బడుగులు కూడా తమను ఎన్నుకున్న జనాల్లో  ఉంటారని ఏలికలు గుర్తుపెట్టుకోవాలి. వీరికి జవాబు చెప్పనక్కరలేదు. వీరిని గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకున్నట్టు కనిపిస్తే మాత్రం  కుదరదు. ఎందుకంటే అయిదేళ్ళు కాగానే అన్నీ గుర్తు పెట్టుకునే గుణం వారిలో వుంది.
'ఏడాదిగా ఏం చేస్తున్నారు' అనే ప్రశ్నకి జవాబు సర్కారు వద్ద సిద్ధంగా వుంది. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏం చేయాలో అవన్నీ ఆలోచిస్తున్నాము' అనేది అ జవాబు. 'ఆలోచనలు ఆచరణలోకి రావడానికి ఇక ఎంతో కాలం పట్టదు' అనేది దానికి ముక్తాయింపు. కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు. 

   
ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు, హరితహారాలు, ప్రతి గడపకు  నల్లా నీళ్ళు, ప్రతి పొలానికీ సాగు నీళ్ళు, కనురెప్పపాటు కూడా పోని  కరెంటు, గొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి చిన్నారి లోగిళ్ళు, చదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువు, చదువయిన వారికి కొలువు, చదువంటని వారికి తగిన ఉపాధి, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి .......ఒకటా రెండా? ఇవన్నీ చదువుతున్నప్పుడు, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగరు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవా? రావా? అనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా?
'స్వచ్చ తెలంగాణా! స్వచ్చ హైదరాబాదు' అసలు ఈ ఆలోచన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిది. అయినా  దానికి కొత్త మెరుగులు దిద్ది ఓ ఉద్యమంలా అమలు పరుస్తున్న తీరు చూస్తె, చెప్పిన ప్రతి పనీ చేసి చూపే సత్తా కేసీఆర్ కి వున్నదని ఆయన  ప్రత్యర్ధులు సయితం అంగీకరించే స్తితి. ఇది జాతీయ కార్యక్రమం. అయినా, దాన్ని ఓ వినూత్న పద్దతిలో అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మాత్రం కేసీఆర్  నేతృత్వం వహిస్తున్న తెలంగాణాయే అన్నది సుస్పష్టం.
పుష్కర కాలం పైచిలుకు తన సారధ్యంలో సాగిన వేర్పాటు ఉద్యమం పుణ్యమా అని కేసీఆర్ రాజకీయాల్లో రాటు తేలారు. సమస్యలని తనకు అనుకూలంగా మలచుకునే విద్యను పుణికిపుచ్చుకున్నారు. ఉద్యమ మూల స్వభావం మారకుండా ఎప్పటికప్పుడు పరిస్తితులను బేరీజు వేసుకుని తదనుగుణంగా విధి విధానాల్లో, వ్యూహ ప్రతివ్యూహాల్లో మార్పులు చేసుకుంటూ కడకంటా లాక్కువచ్చారు. ఎంతో ఓపిక, ఎంతో ఏకాగ్రత వుంటే కానీ ఇది సాధ్యం కాని విషయం. ఈ పట్టుదలతోనే, అందరూ  అసాధ్యం అనుకున్న తెలంగాణా స్వప్నాన్ని  సుసాధ్యం చేసి కొత్తగా ఏర్పడ్డ ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తన కలను కూడా సాకారం చేసుకోగలిగారు. వాస్తవానికి తెలంగాణా ఏర్పాటుకావడంలో  సోనియా గాంధీది కీలకమైన పాత్ర  అయినప్పటికీ, ఆ మొత్తం ఖ్యాతి తన ఖాతాలో పడేలా రాజకీయ చాతుర్యం ప్రదర్శించి ప్రత్యర్ధులను ఖంగు తినిపించారు. తనదయిన బాణీలో పాలన సాగించే క్రమంలో  ఎదురయిన ఎదురు దెబ్బలను ఒడుపుగా తనకు అనుకూలంగా మలచుకుంటూ, తెలంగాణా వాదం బలహీన పడకుండా ఎప్పటికప్పుడు దాన్ని ఎగదోస్తూ మొత్తం తెలంగాణాకు ఎదురులేని నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే,  ఈ క్రమంలో, బంగారు తెలంగాణా సాధన కోసం ఆయన నిశ్శబ్దంగా, నిరవధికంగా  చేస్తున్న ప్రయత్నాలకన్నా పార్టీని, ప్రభుత్వాన్ని స్తిరంగా, బలంగా ఉంచడానికి రాజకీయంగా  ఆయన అమలుచేస్తున్న వ్యూహ ప్రతివ్యూహాలే జనాలకు, ప్రత్యేకించి మీడియాకు కొట్టవచ్చినట్టు కానవస్తున్నాయి. రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులకి ఇవన్నీ తప్పనిసరే. కాదనము. కాకపొతే, ఇవే ప్రముఖంగా కనబడి, అసలు కనబడాల్సిన ఇతర అభివృద్ధి అంశాలు నేపధ్యంలోకి వెళ్ళిపోవడం దీర్ఘకాలంలో ఏ పార్టీకి అంత మేలు చేసే విషయం కాదు. ఇది చరిత్ర చెప్పే సత్యం.          
ఆంధ్ర ప్రదేశ్ అంటే హైదరాబాదు అని జనం నమ్మేలా చేసి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పొరబాటు చేసారు. కాకపొతే, అభివృద్ధి యావత్తూ ఒకే నగర కేంద్ర బిందువుగా  జరగడంవల్ల హైదరాబాదుకు మంచి మేలే జరిగింది. విశ్వ నగరంగా అది దేశ విదేశాల్లో కొత్త ప్రాచుర్యం పొందింది. ఎక్కడెక్కడి దేశాలవారికీ హైదరాబాదు ఒక గమ్యస్థానంగా మారింది. బయటి పెట్టుబడులకు చక్కని స్థావరంగా తయారయింది.  సంజయ్ బారు చెప్పినట్టు పాతకాలంలో కూడా  హైదరాబాదుకు మంచి పేరే వుండేది. చక్కటి వాతావరణం. భాషాబేధాలు లేకుండా  కలిసిమెలిసి వుండే  ప్రజలు.   అయితే అప్పట్లో  కొన్ని పరిధులు, మరికొన్ని పరిమితులు. ఇప్పుడలా కాదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకదానిగా పేరు తెచ్చుకుంది. పెట్టుబడుల ఆకర్షణకు ఈ కొత్త పేరు చాలా వరకు ఉపయోగపడింది.   అయితే వికేంద్రీకరణ విషయంలో  కొన్ని జాగ్రత్తలు తీసుకోని కారణంగా అది ప్రాంతీయ భావాలు పెచ్చరిల్లడానికి, ప్రాంతీయ అసమానతలు పెరగడానికి  కూడా దోహదం చేసింది.
ఇప్పుడు మళ్ళీ టీ.ఆర్.యస్. సర్కారు సయితం అదే పొరబాటు చేయబోతున్నదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాదు అంటే రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలు మాత్రమే అని చంద్రబాబు చేసిన ప్రయోగం మంచికంటే చెడు ఎక్కువ చేసింది. అభివృద్ధి యావత్తూ ఒకచోటే కేంద్రీకృతమై మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి ఫలాలకు దూరంగా వుండిపోయాయి. రాష్ట్ర విభజన అత్యంత క్లిష్టంగా మారడానికి దోహదం చేసిన అంశాలలో ఇదొకటి.  కేసీఆర్ మరో రెండు మూడు జిల్లాలు కలిపి హైదరాబాదు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసే ఆలోచనలు చేస్తున్నారు. హెచ్.ఎం.డీ.ఏ. పరిధిని విస్తరించాలని అనుకుంటున్నారు. అయితే ఈ ప్రయత్నం  మరో 'షో కేస్' ప్రయోగం కాకూడదు. విశ్వ నగరం నమూనాను ప్రపంచానికి చూపి హైదరాబాదును మార్కెట్ చేయడానికి ఈ ఆలోచన పనికి వస్తుందేమో కాని మొత్తం వెనుకబడిన తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చడానికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. భవిష్యత్తులో అసమానతలకు చోటిచ్చే విధంగా సాగే ఏ రకంయాన అభివృద్ధి, సమతూకంతో, సమన్యాయంతో  కూడిన పురోగతి అనిపించుకోదు. ఈ వాస్తవాన్ని టీ.ఆర్.యస్. అధినాయకత్వం గుర్తెరిగి అడుగులు వేయడం మంచిది.
ఎన్నికలకు ముందు చెప్పినవి అన్నీ చేసి చూపించడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. కానీ, అన్నీ కాకపోయినా కొన్ని అయినా చేసి చూపించడం రాజకీయ పార్టీల ధర్మం. లేని పక్షంలో రాజకీయ నాయకుల వాగ్దానాలపట్ల ప్రజల్లో విశ్వాసం కుదురుకోవడం కష్టం. ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.        
చూస్తుండగానే ఏడాది పుణ్యకాలం చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. చరిత్రలో నిలబడి పోవాలంటే చేయాల్సినవి చాలా వున్నాయి. ప్రజలు తమ తీర్పు ద్వారా అప్పగించిన సమయంలో మిగిలివున్న వ్యవధానం నాలుగేళ్లే.
పరిష్కారం కాకుండా వున్న తెలంగాణా సమస్యలు అన్నింటికీ పాత పాలకుల పాపమే కారణం అన్న వాదన ఇన్నేళ్ళు జనంలో చాలామంది నమ్మారు. ఇంకా కొన్నాళ్ళు నమ్ముతారు. మరి కొన్నాళ్ళ తరువాత నమ్మేవాళ్ళు తగ్గిపోవచ్చు. అసలు మిగలకపోవచ్చు.
ఏ రంగంలో అయినా   శాశ్వతంగా నిలదొక్కుకోవాలి అంటే నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత చాలా ముఖ్యం. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా అన్వయిస్తుంది.
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు, మొత్తం ప్రజానీకం అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అని కేసీఆర్ చెబుతుంటారు. ఆయన అదృష్టం ఏమిటంటే చెప్పింది చేసి చూపెట్టగల అధికారం, అవకాశం  ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో! (30 - 05 - 2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE: COURTESY IMAGE OWNER

1 కామెంట్‌:

  1. వ్యాసం బేలన్సుడ్ గా ఉంది.<< అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు, మొత్తం ప్రజానీకం అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అని కేసీఆర్ చెబుతుంటారు. ఆయన అదృష్టం ఏమిటంటే చెప్పింది చేసి చూపెట్టగల అధికారం, అవకాశం ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో! >> అవునవును చూడాలి.

    రిప్లయితొలగించండి