5, మార్చి 2015, గురువారం

'సూర్య' హరనాథ్ ఇక లేరు

  
ఈరోజు పొద్దున్న 10 టీవీ నుంచి ఇంటికి వస్తుంటే 'సూర్య' దినపత్రిక ఎడిటర్, మిత్రుడు సత్యమూర్తి నుంచి ఫోను.
'ఓ శాడ్ న్యూస్. హరనాథ్ చనిపోయారు. ఈ  తెల్లవారుఝామున. కార్డి యాక్ అరెస్ట్ ట.'
'అయ్యో!' అనిపించింది. హరనాథ్ వయస్సులో  నాకంటే ఏడెనిమిదేళ్లు  చిన్న.  కానీ,  అనుభవంలో పెద్దవాడు. అనేక  పత్రికల్లో పనిచేసారు.  ఐదారేళ్లుగా ప్రతి శనివారం ఆయన నుంచి ఫోన్ వచ్చేది. 'అయ్యా! ఈరోజు శనివారం. ఆదివారం ఆర్టికిల్ గుర్తు చేయడానికి చేస్తున్నాను' అనేవారు ఎంతో మర్యాదగా.  గత ఏడాది నుంచి కాబోలు,  వారానికి రెండు సార్లు, ప్రతి గురువారం, ఆదివారం రాజకీయ వ్యాసాలు 'సూర్య' పత్రిక్కి  క్రమం తప్పకుండా రాస్తూ వస్తున్నాను. ఈ రీత్యా హరనాథ్ గారి నుంచి  వారం వారం వచ్చే  ఫోను పిలుపు మరోటి పెరుగుతూ వచ్చింది. మొన్న సోమవారం నేనే ఫోను చేసాను. ఆయన  ఆఫీసులోనే వున్నారు. 'గురువారం (ఈరోజు,మార్చి అయిదు) ఆర్టికిల్ ఒక రోజు ముందే పంపుతున్నాను. ఇంట్లో కరెంటు సరిగ్గా వుండడం లేదు. నెట్ ప్రాబ్లం. అందుకని ముందే మెయిల్ చేస్తున్నాను. కాస్త చూసుకోండి'  అన్నాను. ఆయనే 'అల్లానే, అల్లానే' అన్నారు. ఆ 'రెండు పదాలే'  ఆయన నోటి నుంచి నేను వినే ఆఖరు మాటలు అని అప్పుడు  నాకు తెలియదు. ఈరోజు యధావిధిగా నా ఆర్టికిల్ 'సూర్య' పత్రికలో వచ్చింది. అది చూసిన కాసేపటికే ఆయన లేరనే వర్తమానం.
ఏదో ఒకరోజు అందరూ పోవాల్సిన వాళ్ళే. అయితే,  చిన్నవాళ్ళు పోతూ వుండడం అది పెద్దవాళ్ళు  చూస్తూ వుండడం - నిజానికి ఇది  చేయని నేరానికి పడే పెద్ద శిక్ష. కానీ చేయగలిగింది లేదు.
వచ్చే శనివారం హరనాథ్ గారినుంచి ఫోను రాదు. అది తలచుకుంటే బాధ మరింత పెరుగుతోంది.

హరనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి




2 కామెంట్‌లు:

  1. కొన్ని కొన్ని మాటలు వెంటాడతాయి.
    ముఖ్యంగా అవి ఆప్తులైనవారి ఆఖరు మాటలైతే.

    మా పిన్ని ఒక సంపూర్ణసూర్యగ్రహణం రోజున హైదరాబాదులో మా యింట్లో ఉంది. ఆమె నాకు అత్యంత ఆత్మీయురాలు. 'ఒరే నిడదవోలు రారా నీతో మాట్లాడాలీ' అంది. 'ఓ అలాగే' అన్నాను. కాని నేను వెళ్ళాలని ప్రయాణమయ్యే లోగానే, కొద్ది నెలలకే ఆమె హఠాత్తుగా నిదురలో కనుమూసింది. అమె నాతో అన్న ఆఖరు మాటలు నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ఏమి నాతో మాట్లాడాలనుకుందో మరి. నాకంటే ఒక్క సంవత్సరం మాత్రం పెద్దదైన ఆమె ఇరవైల వయసులోనే వెళ్ళిపోవటం నాకు చెప్పరానంత లోటుగా ఉంది.

    రిప్లయితొలగించండి
  2. హరనాథ్ మృతికి సీఎం సంతాపం

    హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సీనియర్ జర్నలిస్టు, సూర్య అసిస్టెంట్ ఎడిటర్ హరనాథ్ అకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

    http://namasthetelangaana.com/LatestNews-in-Telugu/cm-mourns-the-death-of-haranath-1-1-426854.html#.VPlFzJG6a00

    రిప్లయితొలగించండి