20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

అమ్మయ్య! హైదరాబాదు మనదీ, మనందరిదీ!


(Published by 'SURYA' telugu daily in it's edit page on 22-02-2015, SUNDAY)

ఎన్నో ఏళ్ళక్రితమే, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకున్న కుటుంబాలు ఎన్ని వేలున్నాయో, లక్షలు వున్నాయో  ఆ లెక్క తెలియదు కానీ, వాళ్ళల్లో చాలామంది  మొన్న గురువారం రాత్రి గుండెలమీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయివుంటారని  తేలిగ్గా చెప్పవచ్చు. తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు మంత్రించి ఒదిలిన మాటల మత్తు అలాటిది మరి.
'ఇక్కడ (హైదరాబాదులో) సెట్లర్స్ ఎవ్వరూ లేరు. వున్నవాళ్లందరూ హైదరాబాదీలే!'   
పుష్కరం పైచిలుకు తెలంగాణా ఉద్యమ ప్రస్థానంలో, ఏడుమాసాల టీ.ఆర్.యస్.పరిపాలనాకాలంలో ఇటువంటి  ఉపశమన వాక్యాలు వినడానికి నోచుకోని  హైదరాబాదీ ఆంధ్రులు, 'కలా నిజమా' అని తేల్చుకోలేని స్తితిలో పడిపోయారు. హైదరాబాదులో ఆంధ్రులతో పాటు, తమిళులు, కన్నడిగులు, మళయాళీలు, మరాఠీలు, మార్వాడీలు, రాజస్థానీలు ఇలా వాళ్ళూ వీళ్ళని కాదు సమస్త భారతదేశంలోని సమస్త ప్రాంతాలవాళ్ళు, సమస్త భాషల వాళ్లు, సమస్త సంస్కృతుల వాళ్లు  ఎన్నో ఏళ్లుగా ఈ నగరంలో  నివసిస్తూ 'ఇది మాది' అన్న భావనలోనే వుండిపోయారు.  ఈ మధ్య కాలంలో ఒక్క ఆంధ్రులకు మాత్రమే ఈ భావన దూరం అవుతూ వచ్చింది. 'హైదరాబాదు మాదీ' అని చెప్పుకోలేని పరిస్తితి. 'మేము కూడా హైదరాబాదీ'లమే అని ఒప్పుకోలేని దుస్తితి. 'ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే వుందాం' అంటూ ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నాయకులూ, ప్రత్యేకించి తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులూ ఉద్యమ కాలంలో ఎన్నిసార్లో ఉద్ఘాటించారు. కానీ అవేవీ హైదరాబాదులో నివసిస్తున్న సాధారణ ఆంధ్రులకు ఏమాత్రం ఉపశమనం కలిగించలేకపోయాయి. ఎంతమాత్రం భరోసా కల్పించలేకపోయాయి. తెలంగాణా ఏర్పడి, కేసీఆర్ నేతృత్వంలో కొత్త సర్కారు ఏలుబడి మొదలయి ఇన్ని నెలలు గడిచిపోతున్నా 'సెట్లర్లు' గా ముద్రపడిన ఆంధ్రులు  గుబులుగుబులుగానే  రోజులు గడుపుతున్నారు. అన్నింటికీ మించి హైదరాబాదులో నివసించే మరెవ్వరికీ లేని విధంగా 'సెట్లర్లు' అనే  ముద్రపడడం వారికి పుండు మీద కారం రాసినట్టుగా బాధపడిపోతున్నారు. ఉద్యమ స్పూర్తి కోసం, ఉద్యమ వేడి చల్లారకుండా చూడ్డం కోసం,  ఉద్యమ వ్యతిరేకులయిన బడా ఆంధ్రా బాబుల్ని తేలికపరచి మాట్లాడినట్టుగా,  తెలంగాణాను తమదిగా భావించి జీవనం గడుపుతున్న సాధారణ ఆంధ్రా పౌరులను  అలాగే హీనంగా చూడడం వారిని మరింత క్షోభ పెట్టి వుంటుంది. రాష్ట్రం విడిపోయింది. నిజమే.  కానీ, ఇప్పటివరకు ఏళ్లతరబడి హైదరాబాదులోనే వుంటున్న వారు తమ ఇళ్ళూ వాకిళ్ళూ ఒదులుకుని, ఎప్పుడో విడిచివచ్చిన ప్రాంతాలకు తరలివెళ్లడం అంత  ఆషామాషీ వ్యవహారం కాదు. భారతదేశ విభజన సమయంలోనే అనేకమంది ముస్లిం కుటుంబాలు పాకీస్తాన్ కు వెళ్ళకుండా హైదరాబాదులోనే వుండిపోయిన సందర్భాలను వారు గుర్తుచేస్తున్నారు. అంచేతే, అంతటి ఆందోళనలకు గురవుతూ వున్నందువల్లనే, కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో వాళ్లకు  ప్రాణాలు లేచివచ్చినట్టయింది. 'పరవాలేదు , ఇక మంచి రోజులు వచ్చేశాయ్' అన్న నమ్మకం కలిగింది. స్వయంగా టీ.ఆర్.యస్. అధినేతే  'ఇక్కడ సెట్లర్లు ఎవ్వరూ లేరు, వున్నవాళ్ళందరూ హైదరాబాదీలే' అన్న తరువాత దానికి తిరుగేముంటుంది? అదీ వారి ధీమా.
అయితే ఆయన మాటల్ని తేలిగ్గా తీసుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. 'హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయ్యేదాకా కేసీఆర్ ఇలాగే  మాట్లాడుతాడు, ఆ తరువాత మళ్ళీ షరా మామూలే' అని సన్నాయి నొక్కులు ఇప్పటికే మొదలయ్యాయి. బహుశా అలాటి వాళ్ళను దృష్టిలో పెట్టుకునే  కేసీఆర్ తన ప్రసంగంలో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'అబద్దాలు చెప్పడం తనకు నచ్చదనీ, చెప్పేది నూటికి నూరు శాతం చేసి చూపిస్తామనీ' అన్నారు.    
పత్రికల్లో ప్రచురితం అయిన దానిప్రకారం కేసీఆర్ ప్రసంగం ఇలా సాగిపోయింది.
'నిజాం పాలనకు ముందు నుంచీ ఇక్కడ (హైదరాబాదు) అన్ని ప్రాంతాలవాళ్ళు కలిసి జీవించారు. ఇప్పుడూ అలాగే ముందుకెళదాం. తెలంగాణా రాష్ట్రం మనదనే భావనతో సాగుదాం. మా ప్రభుత్వానికి ప్రాంతీయ బేధం లేదు. మీరు (హైదరాబాదులో వుంటున్న ఆంధ్రులు) సెటిలర్స్ కాదు. మీ తాతలు తండ్రులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, కాబట్టి సెటిలర్స్ అన్న భావన విడిచిపెట్టండి' అంటూ చెప్పుకొచ్చారు కేసీఆర్.
'సెటిలర్స్' అన్న ముద్ర వేసిన వాళ్ళే ఆ భావన విడిచిపెట్టాలని అంటుంటే అనుమానం కలగడం సహజం. ఈ విషయం తెలియనివారు కాదాయన. అందుకే సందేహ నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.
'ఉద్యమ సమయంలో కొన్ని సందర్భాలలో అవసరాన్నిబట్టి తేడాలు వచ్చాయి. ఇప్పుడా అవసరం లేదు. మీ కాలికి ముల్లుగుచ్చుకుంటే నా పంటితో తీస్తా'
ఏవన్నా అరకొర అనుమానాలు వుంటే ఇదిగో ఈ దెబ్బతో పటాపంచలు. మాటలను మంత్రించి ఒదలడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య.   
అయినా మనసు మూలల్లో ఏదో ఒకమూల సందిగ్ధం. అందుకే కాబోలు చివరి బాణం కూడా ఒదిలారు.
'నేను రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిని. అందరికీ రక్షణ కల్పించడం సీఎం గా నా బాధ్యత'.
అంతటితో ఆగితే అయన కేసీఆర్ యెలా అవుతారు?
అందుకే దానికి 'రాజధర్మం' అనే మాటకూడా జత కలిపారు.
అనుమాన నివృత్తి చేసిన విధానం మాత్రం, సీమాంధ్రకు చెందిన ఒక సీనియర్ జర్నలిష్టు అన్నట్టు, నూటికి నూరుపాళ్ళు మార్కులు పడేలావుంది.  
విన్నవాళ్లు కూడా  'అమ్మయ్య, ఇక భయం లేదు' అనుకునే వుంటారు.




కార్పొరేషన్ ఎన్నికల అవసరం అలా  చెప్పించిందో, రాజకీయ చాణక్యం అలా  మాట్లాడించిందో, ఏమైతేనేం, సెట్లర్స్ అనే ఆంధ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపశమన వాక్యాలు సాక్షాత్తూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షడు, తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నోటనే వెలువడడం ఆహ్వానించదగ్గ పరిణామం.
'గతం గతః వెనుకటి రోజులు మరిచిపోదాం' అని చెప్పి, కొద్ది రోజులు కూడా  గడవకముందే దానికి కొనసాగింపుగా కేసీఆర్  చెప్పిన ఈ వూరడింపు మాటలు హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రులకు అవసరమైన మనోధైర్యాన్ని ఇచ్చేవుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తీరు పట్ల ఆంధ్ర ప్రాంతం వాళ్లు ఎంతగా రగిలిపోతున్నారో ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్తితి చూసిన ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యే వుంటుంది. ఈ విషయం అర్ధం చేసుకోగల రాజకీయ పరిపక్వత కేసీఆర్ లో పుష్కలం. రాష్ట్ర విభజన జరిగిపోయి, కోరుకున్న విధంగా పరిపాలనా పగ్గాలు చేతికి వచ్చినప్పుడు చేసే యుద్ధం రాజకీయ పార్టీలతో చేయాలి కానీ, అమాయకులయిన జనాలతో కాదన్న వాస్తవం బోధపడి వుండాలి. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రజలకు చెప్పిన బహిరంగ క్షమాపణ, ఎన్నికల వేళ ప్రత్యర్ధి  నేతల తల రాతల్నే మార్చివేసింది. యేమో! టీ.ఆర్.యస్. అంటే ఏ కోశానా ఇష్టం లేనివాళ్ళు కూడా కేసీఆర్ మాటలతో మనసు మార్చుకుంటారేమో  అనే ఆలోచన కూడా ఈ మార్పుకు దోహదం చేసి వుండొచ్చు. మార్పు కోసం వేస్తున్న అడుగు, చెబుతున్న మాటలు జనం మంచికోసమే అయినప్పుడు అందులో కాదనడానికి ఏముంటుంది? అని సమాధానపడేవాళ్ళు సమాజంలో పుష్కలం. పోనీ,  ఎన్నికలకోసమే ఇలాటి బులిబుచ్చకపు మాటలు చెప్పి, తరువాత  మాట తప్పారే అనుకోండి, ప్రజలదగ్గర అంతకంటే పదునయిన ఆయుధమే 'ఓటు' రూపంలో వుంది.     
నిజానికి కేసీఆర్ చెప్పిన 'సెట్లర్ల' సంగతే మరునాడు పత్రికలకు  ప్రధాన శీర్షిక కావాలి. మీడియాకు ఇదే ముఖ్యమైన చర్చనీయాంశం కావాలి. కానీ మరుసటి రోజు  తెలుగు పత్రికలు ఈ వార్తకు ప్రాధాన్యం ఇచ్చి మొదటి పుటలోనే ప్రచురించినప్పటికీ అసలు ప్రాధన్యాన్ని కాస్తా  మరో సంచలన వార్త తన్నుకుపోయింది. దానికి కూడా కేసీఆరే కేంద్ర బిందువు కావడం కాకతాళీయం కావచ్చు.
తెలంగాణా సచివాలయంలోకి మీడియాకు 'నో ఎంట్రీ' అంటూ పత్రికలు, టీవీలు మొత్తం దృష్టిని అటు మరల్చేలా చేసాయి. నిజానికి అది నిర్ణయం కాదు. ఒక ఆలోచన మాత్రమే. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో వుంటూ అలాటి ఆలోచన కూడా చేయకూడదనే  ఎవరయినా ఆశిస్తారు.
సచివాలయంలోకి మీడియాను అనుమతించని రాష్ట్రాలు లేకపోలేదు. ఉదాహరణకు నిన్నగాక మొన్న ఢిల్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అపూర్వ విజయం సాధించి మీడియాచేత వేనోళ్ళ కొనియాడబడిన  కేజ్రీవాల్ మహాశయులే అధికార పీఠం ఎక్కగానే చేసిన మొదటి పనుల్లో ఒకటి మీడియా మీద ఆంక్షలు విధించడం. అదేమని ప్రశ్నిస్తే మీడియాకంటే తనను నమ్ముకున్న  ప్రజలే ముఖ్యమని చెప్పడం.
మీడియా చేసుకున్న దురదృష్టం ఏమిటో కానీ ఏ పార్టీ అధికారానికి దూరమైనా వారు దగ్గరకు తీసేది మీడియానే. పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని తిరిగి పొందడం కోసం అనండి, లేదా ప్రజలకు దగ్గర కావడానికి మీడియాను మించిన సాధనం లేదన్న నమ్మకంతో కానివ్వండి ఆ పార్టీలు ముందు చేసే పని మీడియాను మాలిమి చేసుకోవడమే. అవే పార్టీలు  అధికారానికి వచ్చిన మరుక్షణం నుంచీ చేసే మొదటి పని కూడా  మీడియాను ఎడం  పెట్టడమే.  ఈ విషయంలో మినహాయింపు ఇవ్వగల ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదనడం సత్య దూరం కాదు.
ఇక్కడ మరో విషయం కూడా ప్రభుత్వంలో వున్నవాళ్ళు గమనించాలి. సచివాలయానికి వచ్చే జర్నలిష్టులు లేదా విలేకరులు చాలావరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పధకాలకే తమ వార్తల ద్వారా ప్రచారం కల్పిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కాణీ ఖర్చులేని ప్రచారం. పార్టీ కార్యాలయాల వార్తలు సేకరించే విలేకరులు కేవలం రాజకీయ  మసాలా వున్న వార్తలకోసమే వెతుకుతుంటారు. వాటితో పోలిస్తే సచివాలయం బీటు చూసే పత్రికల వాళ్ళే కొంత నయం అనుకోవాలి.
ఈ విషయంలో ప్రభుత్వం కొంత పునరాలోచనలో పడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాసం సిద్ధం అవుతున్న సమయానికి కేసీఆర్ ప్రెస్ అకాడమీకి వెళ్ళి జర్నలిష్టులతో సంప్రదిస్తారని వార్తలు వస్తున్నాయి. ముందే చెప్పినట్టు, మనిషి మారినా, విధానాలు మార్చుకున్నా అది మంచికోసమే అయినప్పుడు దాన్ని స్వాగతించాలి. (20-02-2015)

2 కామెంట్‌లు:

  1. భండారువారూ, రాజకీయప్రవచనాల్లో చిత్తశుధ్ధి అనేది ఉండదని అందరికీ తెలుసునండీ. అందుచేత హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రప్రాంతప్రజానీకానికి కేసీఆర్‌గారి ఈనాటి వక్కాణింపుతో సంతోషమూ భధ్రతాభావమూ ఇబ్బడిముబ్బడిగా కలుగుతాయని అనుకోవటం పొరపాటే అవుతుంది. అత్యంత పలుచనైన నాలుకకల కేసీఆర్‌గారు ప్రస్తుతావసరం తీరనిచ్చి, మరొక నాడు మరొకసందర్భాన్ని పురస్కరించుకొని, ఆయన అవసరమని అనుకుంటే మరో విధంగా మాట్లాడరని ఎవరన్నా భావిస్తే అంతకంటే‌ అమాయకత్వం ఏమీ‌ ఉండదు. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోవటానికి కొమ్ములు తిరిగిన రాజకీయవేత్తలో మేథావులో విశ్లేషించవలసిన అవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  2. http://www.rastrachethana.net/2015/02/blog-post_68.html

    "రాష్ట్రచేతన" అనే తెలుగు బ్లాగులో ఫిబ్రవరి 26, 2015 న పెట్టిన " ఇదీ.. నిజాంగారి మంచితనం..! " అనే బ్లాగుపోస్టులో ఈ క్రింది పేరా కనిపించింది. దీంట్లో పేర్కొన్న భండారు సదాశివరావు గారు మీ వంశీకులేనా?

    "2. జైహింద్ ఉద్యమంలో పాల్గొన్నందున హైదరాబాదు రాష్ట్రంలో తమ ప్రవేశాలను కోల్పోయిన విద్యార్థులకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలను ఇవ్వకూడదన్న నిబంధనను విధించేందుకుగాను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తాము ఇచ్చిన విరాళాన్ని నిజాం ప్రభుత్వం వాడుకున్నది. ఈ కారణంగానే సర్ సి.ఆర్.రెడ్డి కొంతమంది విద్యార్థులకు ఇచ్చిన ప్రవేశాలను రద్దుచేశారు. స్వర్గీయ పి.వి.నరసింహారావు, భండారు సదాశివరావు వంటి వారు నాగపూరులోనూ తదితర ఉత్తరభారత విశ్వవిద్యాలయాలలోనూ విద్యనభ్యసింపవలసి వచ్చింది."

    రిప్లయితొలగించండి