10, ఫిబ్రవరి 2015, మంగళవారం

స్వీప్ చేసిన ఆప్

(Published in 'SURYA' telugu daily in its Edit Page on 12-02-2015, THURSDAY)

కేజ్రీవాల్ ది  ఘన విజయం అనుకోవాలా? ఇంకేదయినా గొప్ప  పదం వుందా!
మోడీది  ఘోర పరాజయం అనుకోవాలా? ఇంకేదయినా  మంచి విశేషణం వుందా!
మొత్తం డెబ్బయి సీట్లు వుంటే అందులో అరవై ఏడింటిలో ఆప్ విజయ పతాకం రెపరెపలా! కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కమల ధ్వజం ఎగురవేయాలని కలలుకంటున్న బీజేపీ అగ్ర నాయక ద్వయం మోడీ- అమిత్ షా ల విజయం కేవలం  మూడు స్థానాలకే పరిమితమా!
ఇలాటిది ఇంతకుముందు ఎప్పుడయినా జరిగిందా! మునుపెప్పుడయినా విన్నామా! కన్నామా!
నిరుడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆప్ పార్టీని  ఆనవాళ్ళు లేకుండా తుడిచిపెట్టిన మోడీ ప్రభంజనం ఇంత తక్కువ సమయంలోనే ఏమయిపోయినట్టు? యెలా ఆవిరై పోయినట్టు? అందివచ్చిన అధికారాన్ని కాలదన్నుకుని ఆ పొరబాటుకు లెంపలు వేసుకోవాల్సివచ్చిన  అరవింద్  కేజ్రీవాల్ ని మళ్ళీ హస్తిన ఓటర్లు  యెందుకు ఇంత త్వరగా అక్కున చేర్చుకుని ఆదరించినట్టు?
నిజంగా ఇదంతా జరిగిందా! జరిగిందంతా నిజమేనా!


(మోడీ వర్సెస్ మఫ్లర్ వాలా) 
   
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం  నుంచి అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి.
ఒకటి మాత్రం వాస్తవం. ఏ కొలమానంతో కొలిచినా, ఏ గీటురాయితో చూసినా, ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సాధించిన విజయం మాత్రం అపూర్వం, అనితర సాధ్యం.  అయితే, ఆయన సాధించిన విజయం కంటే మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి లభించిన ఘోర పరాజయం  ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితం మోడీ పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ప్రత్యర్ధులు బహిరంగంగా అంటుంటే, మోడీ మార్గం మార్చుకోవాల్సిన సమయం ఆసన్నం అయిందనడానికి సంకేతం అని ఆయన పార్టీవారే ఆంతరంగిక సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
కేజ్రీవాల్ గెలుపు, రానున్న రోజుల్లో రాజకీయాలు తీసుకోబోయే గొప్ప మలుపుకు నాంది అని అభిప్రాయపడేవారు కూడా లేకపోలేదు. భవిష్యత్ భారతంపై కొత్త తరం పెంచుకుంటున్న ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాల్లో గుణాత్మక మార్పులు చోటుచేసుకోవడానికి ఈ పరిణామాలు దోహదం చేస్తాయని భావించే ఆశావాదులు కూడా వున్నారు.
తొమ్మిదిమాసాలక్రితం జరిగిన లోకసభ ఎన్నికల్లో  విజయ దుందుభి మోగించి తనదయిన మార్కు పాలనతో ప్రజల  అభిమానం అపారంగా చూరగొంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఈ స్వల్పకాలంలో చేసిన పెద్ద తప్పిదాలు కూడా ఏవీ లేవు, ఢిల్లీ పౌరులు ఆయన పార్టీని ఇంత ఘోరంగా,  ఇంత భారీ స్థాయిలో తిరస్కరించడానికి. దేశమంతా 'మోడీ మోడీ' అని ఓ పక్క బ్రహ్మరధం పడుతుంటే, దేశ రాజధాని ఢిల్లీలో ఆయన నాయకత్వంలోని బీజేపీకి మూడంటే మూడు సీట్లు రావడం చూస్తే మోడీ  ప్రభావానికి అడ్డుకట్టపడబోతున్నదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే,  ఢిల్లీ ఫలితం మోడీ పరిపాలనపై ప్రజాతీర్పు అనడం కంటే, ఎన్నికల క్రతువులో విజయసాధన కోసం ఆయన పార్టీ అనుసరించిన కొన్ని అనైతిక విధానాల పట్ల ప్రజల నిరసనకు సంకేతంగా భావించడం సముచితంగా వుంటుంది. కేజ్రీవాల్ చెబుతున్న 'మార్పు' ను కోరుకుంటున్న ప్రజలకు బీజేపీ అగ్రనాయకులు అమలుచేసిన సాంప్రదాయిక రాజకీయ ఎన్నికల ఎత్తుగడలు మొహం  మొత్తించి వుంటాయి. మోడీ నాయకత్వంలోని బీజేపీ కూడా 'అదే తానులో ఒకముక్క' అనే అభిప్రాయాన్ని కలిగించి వుంటాయి. ఎన్నికల  ప్రచారం జరిగిన తీరు, అందులో నాయకులను పెద్దయెత్తున మోహరించిన విధానం, వ్యక్తిగత ఆరోపణలకు పెద్ద పీట వేసిన వైనం, 'మార్పు'ను బలంగా కోరుకుంటున్న ప్రజలకు బీజేపీ పట్ల  వైమనస్యాన్ని పెంచివుంటాయి.  ఓసారి ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని కాలదన్నుకుని, గతంలో చేసిన ఆ తప్పిదం మరో మారు చేయనని బహిరంగంగా అంగీకరించిన అరవింద్  కేజ్రీవాల్ పట్ల సానుభూతిని రగిలించివుంటాయి.      
ఇది ఆప్ విజయమా, బీజేపీ పరాజయమా అనే ప్రశ్న వేసుకుంటే నిస్సంశయంగా కేజ్రీవాల్ వ్యక్తిగత విజయమని ఒప్పుకోక తప్పదు. కుల, మత, వర్గాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ కలిసి కేజ్రీవాల్ కి కట్టబెట్టిన ఘన విజయం ఇది. లేకపోతే ఓటర్లలో సగానికి పైగా ఆయన పార్టీని ఎంచుకోవడం సాధ్యపడదు. 'పాంచ్ సాల్  - కేజ్రీవాల్' అనే నినాదానికి అనుగుణంగా, 'ఏమైనా సరే,  పూర్తి కాలం పాలించేలా  ఈసారి ఆయన్ని పూర్తి మెజారిటీతో  గెలిపించి తీరాలి' అనే కసితో జనం ఓట్లు వేసినట్టు కనబడుతోంది. కాబట్టే,  రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల్లో ఒకటయిన  కాంగ్రెస్ పార్టీని  వాక్యూం క్లీనర్ తో శుభ్రంగా  వూడ్చేసినట్టు సమూలంగా తిరస్కరించారు.   మరో జాతీయ పార్టీ బీజేపీని మూడు సీట్లతో సరిపుచ్చి,  ఆప్ పార్టీ ఎన్నికల గుర్తయిన 'చీపిరికట్ట'తో వూడ్చి పక్కనబెట్టారు. అందుకే కేజ్రీవాల్ దీన్ని 'ప్రజావిజయం' గా అభివర్ణించారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్ని ఆత్మ రక్షణలో పడేస్తే, ఆప్ కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. అదే సమయంలో ఓటర్లు  తమ తీర్పుతో రాజకీయ పార్టీలకి ఓ గట్టి సంకేతాన్ని కూడా ఇచ్చారు. తాము గట్టిగా తలచుకుంటే యెంత గట్టి పార్టీ తలరాతను అయినా ఇట్టే మార్చగలం అనే వారి హెచ్చరిక కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో అంతర్లీనంగా వుంది.                      
ఓడల్ని బండ్లుగా, బండ్లను ఓడలుగా చేయగల 'ఓటు' అనే మహత్తర ఆయుధం సగటు ఓటరు చేతిలో వుంది. 'ఒకసారి  ఓటరు ఇచ్చిన తీర్పుతో అధికార అందలం ఎక్కి, అదే శాశ్వతం అనుకుని ఆదమరచి వ్యవహరిస్తే ఫలితాలు యెలా వుంటాయి' అనడానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలే మంచి ఉదాహరణ. ఇవి బీజేపీకి, దానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోడీకి గుణపాఠం. అలాగే, ఆప్ నాయకుడు, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఓ హెచ్చరిక కూడా.  గతంలో చెప్పింది చేయలేకపోవడానికి ఆయన కారణాలు ఆయనకు వున్నాయి. ఈసారి అలా కుదరదు. చేయగల పనులన్నీ చేయగల 'చేవ'ను 'గొప్ప మెజారిటీ' రూపంలో ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. కాబట్టి సాకులు చూపి తప్పించుకునే వెసులుబాటు ఇక  ఎంతమాత్రం వుండదు.
అంతే  కాదు, ప్రజలు అనుక్షణం గమనిస్తూనే వుంటారు. వారి కళ్ళు కప్పడం అంత సులభం ఏమీ కాదు. వెనుకటి రోజుల్లో మాదిరిగా తాపీగా వ్యవహరిస్తాం అంటే కుదిరే పని కాదు. అయిదు రోజుల క్రికెట్ టెస్ట్ నుంచి 'ట్వంటీ ట్వంటీ' పోటీల  పట్ల మోజు పెరుగుతున్న రోజులివి. ఏదయినా త్వరత్వరగా జరిగిపోవాలని అనుకుంటారు. ఆ వేగం, ఆ వడీ చేతల్లో కానరాకపోతే ఇంతే సంగతులు.      
రాజకీయాల్లో రోజులు యెలా మారిపోయాయంటే,  పరమపద సోపానపఠంలో మాదిరిగా పెద్ద నిచ్చెన ఎక్కిన వారికి పెద్ద పాము నోట్లో పడడానికి కూడా అవకాశాలు ఎక్కువే. బీజేపీకి జరిగింది అదే! అది జరక్కుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత కేజ్రీవాల్ భుజస్కంధాలపై వుంది.
తస్మాత్ జాగ్రత్త!

(11-02-2015)

NOTE: Courtesy Image Owner

6 కామెంట్‌లు:

  1. మీరన్నట్లే కలనా లేక నిజమా అనేది నాకూ అర్ధం కావట్లేదు సుమండీ!

    రిప్లయితొలగించండి
  2. ఒక ఆంగ్లసామెత ఉంది. రాజకీయులు తప్పకుండా గుర్తుపెట్టుకోవలసినది -

    Nothing recedes like success.

    రిప్లయితొలగించండి
  3. బునియాద్ అని ఒక ధారావాహిక, వచ్చేది. అందులో నటించిన నటీనటులకు విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ ధారావాహిక పూర్తయిన తరువాత వాళ్ళను గుర్తుంచుకున్న వాళ్ళెవరు!

    ఎన్ టి రామారావు కొత్తగా తెలుగుదేశం పెట్టినప్పుడి 1983 లొ విపరీత జనాదరణ, 1984 లో వెన్నుపోటు-1 మళ్ళీ లేవటం, 1984 ఎన్నికల్లో విపరీత గెలుపు(ఇందిరా సింపథీ వేవ్ ఉన్నప్పటికీ), 1989లో ఓటమి, 1994లో గెలుపు, వెన్నుపోటు-2, ఎన్ టి రామారావు కనుమరుగు. మొదటి వెన్ను పోటు జరిగినప్పుడు జనం విపరీతంగా స్పందించి, అంతటి ఇందిరాగాంధీ కూడా హడిలిపోయి, రాం లాల్ ను కోప్పడినట్టు నటించి ఎన్ టి ఆర్ కోసం శంకర్ దయాల్ శర్మను గవర్నరుగా తెచ్చి మరీ మళ్ళీ ప్రభుత్వంలోకి ఆహ్వానించేట్టు చేసింది. మరి రెండో వెన్నుపోటు జరిగినప్పుడు ప్రజల్లో స్పందనే లేదు.కానీ అదే జనం ఎన్ టి ఆర్ 1995 లో మరణించినప్పుడు విపరీతంగా విలపించారు, విషాదంలో ముణిగిపొయ్యారు ప్రజలు-రాజకీయాలు అన్న విషయం విశ్లేషిస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు మెచ్చుకుంటారో, అంతలోనే ఎందుకు విసిరి ఆవతల పారేస్తారో పెద్దగా తెలియదు. మొదటిది ఎంతటి అద్భుతం అనిపిస్తుందో, రెండోదీ అంతకంటే అద్భుతం అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. @ శరత్ కాలమ్- శ్యామలీయం -SIVARAMAPRASAD KAPPAGANTU - 'బాగా చెప్పారు - ధన్యవాదాలు' - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  5. @ శరత్ కాలమ్- శ్యామలీయం -SIVARAMAPRASAD KAPPAGANTU - 'బాగా చెప్పారు - ధన్యవాదాలు' - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  6. నాకు ఇది ఆప్ గెలుపు కన్నా మోడి ఆమిత్ షా లకు జరిగిన వాపు లా అనిపిస్తుంది. ఆప్ మీద విశ్వాసం వుంటే ఓ 40-45 సీట్లు వర్కూ వుంటుంది. ఆపైవన్నీ... బిజెపికి రంగు పడిందనే చెప్పాలి.

    అధికారమదం తలకెక్కిన మోడి పై దిల్లీ ప్రజలు చీపురు తిరగేశారనే అనుకోవాలి. మోడి ఎన్నికలముందు దిల్లీ ఓ చేసిన రభస, అసత్యప్రచారం, దిగజారుడుతనం అంతా ఇంతా కాదు. కేజ్రివాల్ను 'దొంగా అనే నైతిక హక్కు డొకదారిన మంత్రులైన జైట్లీ, నిర్మలా సీతారామన్లుగాని, నల్లధనం వెనక్కు తెప్పించి తలో 15లక్షలు 100ఓజుల్లో పంచుతామని ప్రగల్భాలు పలికిన మోడికి కాని లేదని ఆ 45సీట్లకు పైన పడీన వోటర్లు అన్నారని నాకనిపిస్తోంది.

    'అరాచక వాదులు ఆడ్వులకు వెళ్ళాలీ అని వారితోనే అధికారికంగా కలవాల్సిన గత్యంతరం అహంకారి మోడికి కలిగంది.

    ఇక పోతే... మోడీ గారికి కట్టిన గుడి గురించి ఆయనకు ఇంటలిజెన్స్ వర్గాలు ఇన్నాళ్ళూ చెప్పకపోవడం ఆయన ప్రభుత్వ వైఫల్యమే కాక మరేంటి? దిల్లీ ఫలితాలు బిజెపికి అనుకూలంగా వచ్చి వుంటే ఈ పాటికి వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, అరున్ జైట్లీలు తమ 'నమో' భజనలతో హోరెత్తించివుండేవారే... అది తప్పించినందుకు దిల్లీ ప్రజలకు యావద్భారతము కృతజ్ఞులై వుండాల్సిన అవసరం వుందని మనవి జేసుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి