1975 నాటి మాట. బెజవాడ ఆంధ్ర జ్యోతిలో పనిచేస్తున్నరోజులు.
అప్పటికే హైదరాబాదుకు మకాం మార్చిన ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారికి ఓ ఆలోచన
వచ్చి బెజవాడలో అసిస్టెంట్ ఎడిటర్ గా వున్న నండూరి రామమోహన రావు గారిని
సంప్రదించారు. అనుదినం జరిగే సంఘటనలపై స్పందించి నాలుగు లైన్లలో హస్యస్పోరకంగా
వుండే గేయాన్ని రాయించాలని వారి ఉద్దేశ్యం. రాయగలరా అని అడక్కుండా రాయండి అనేసారు
రామ్మోహన రావు గారు నాతొ. ఆవిధంగా మొదలయ్యాయి ఆంద్ర జ్యోతి దినపత్రికలో ఎడిట్
పేజీలో కార్టూన్లవంటి నా వాక్టూన్లు. చిత్రకారుడు రమణ గారు ఓ చిన్న చిత్రాన్ని
దానికి జోడించేవారు.
ఆరోజుల్లో గోరాగారి కూరగాయల ఉద్యమం మొదలయింది. బెజవాడ గవర్నర్ పేటలోని
రాఘవయ్య పార్కులో కార్యక్రమం. వ్యవసాయ శాఖ మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు ముఖ్య
అతిధి. పూలదండల బదులు కూరగాయల దండలు వేయాలనేది గోరాగారి ఉద్యమం. కూరగాయలు పెంచితే
ప్రజలకు ఉపయోగం అనేది ఆయన సిద్దాంతం. సరే సభ మొదలయింది. కూరగాయలతో చేసిన దండలు
వేసారు, పుష్ప గుచ్చాల బదులు కాలీ ఫ్లవర్, క్యాబేజీలతో రూపొందించిన గుచ్చాలు
అందించారు. సుబ్బారెడ్డి గారు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే రకం. మనసులో దాచుకుండే మనిషి కాదు. అయన మాట్లాడుతూ, గోరాగారి ఉద్దేశ్యం మంచిదే అయినా మనిషి మానసిక ఆనందానికి పూలతోటలు కూడా
అవసరమన్నారు. పూల చెట్లు పీకి వాటి స్థానంలో కూరగాయల మొక్కలు పెంచేబదులు,
కాలువగట్ల మీద, వృధాగా వున్న ప్రాంతాలలో కూరగాయల పాదులు వేస్తె నలుగురుకీ ఉపయోగం
అన్నట్టు ప్రసంగించారు. ఆ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని నేను వాక్టూన్ రాసాను. అదే
ఇది.
కాయ 'గోరా'లు
కూరగాయలు
పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని, మా శ్రీవారా
ఇచ్చిన పిలుపును విని, మా శ్రీవారా
రోజంతా
పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా
(జూన్, 11, 1975 నాటి
ఆంధ్రజ్యోతి దినపత్రిక)
ఈ దినసరి వాక్టూన్ల రచనావ్యాసంగం నేను జ్యోతిని
వొదిలిపెట్టి హైదరాబాదు ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో విలేకరిగా చేరేవరకు
నిరవధికంగా అనుదినం కొనసాగింది.
NOTE:
Courtesy Image Owner
మీ వాక్టూన్లు అన్నీకలిపి విడిగా ప్రచురించారా భంశ్రీ గారూ?
రిప్లయితొలగించండి@అజ్ఞాత - లేదండీ.
రిప్లయితొలగించండి